logo

భూచోడి సర్వే మాయ

అన్నదాతలకు మేలు చేకూర్చేదిగా జగన్‌ చెబుతున్న ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ మాయ వెనుక అసలు కథకు మూలం.. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఉద్దేశించిందన్న రీసర్వే. ఉమ్మడి జిల్లాలో 2020 డిసెంబరులో ఈ పన్నాగానికి తెరలేపారు.

Published : 06 May 2024 04:27 IST

న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్‌, గజపతినగరం, గరివిడి, గుర్ల, రామభద్రపురం

అన్నదాతలకు మేలు చేకూర్చేదిగా జగన్‌ చెబుతున్న ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ మాయ వెనుక అసలు కథకు మూలం.. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఉద్దేశించిందన్న రీసర్వే. ఉమ్మడి జిల్లాలో 2020 డిసెంబరులో ఈ పన్నాగానికి తెరలేపారు. 2023 డిసెంబరు నాటికే ఇది పూర్తి చేసి భూహక్కు చట్టం అమల్లోకి తీసుకొచ్చి భూములు మింగేయాలన్నది కుట్ర. అయితే రైతులు ముందుగానే పసిగట్టి అభ్యంతరాలు లేవనెత్తి అతడి కుతంత్రాలకు కళ్లెం వేశారు.

ఇప్పటికే భూ సర్వే పూర్తయిన రైతులకు అందజేసిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు కుప్పలుగా వెలుగుచూస్తున్నాయి. భూ విస్తీర్ణం తగ్గిపోవడం.. పేర్లు, ఇతర వివరాలు మారిపోవడంతో బ్యాంకు రుణాలు పొందలేని పరిస్థితి ఎదురవుతోంది.


జిల్లాలోని 983 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఇప్పటి వరకు మూడు విడతల్లో 488 గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశారు. 12,57,009.28 ఎకరాల్లో ప్రక్రియను నిర్వహించినట్లు అధికారిక గణాంకాల బట్టి తెలుస్తోంది. ఇందులో ఎన్ని తప్పులున్నాయో జగనన్నకే తెలియాలి.


1/70 చట్టం మాటేంటి

మన్యంలో భూముల క్రయ విక్రయాలు గిరిజనుల మధ్య మాత్రమే జరిగేలా 1/70 చట్టం హక్కులు కల్పించింది. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు అమల్లోకి వస్తే ఈ చట్టం పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడున్న పలు రక్షణ చట్టాలను తొలగిస్తే మన్యంలో గనులు, కొండలు, గుట్టలు మాయమయ్యే ప్రమాదం ఉందని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో భూ వివాదాలు తలెత్తితే ఐటీడీఏ పీవో అప్పిలేట్‌ అథారిటీగా వ్యవహరిస్తున్నారు. కొత్త చట్టం వస్తే గిరిజనులు హైకోర్టు వరకు వెళ్లడం సాధ్యం కాని పని అని కొందరు వాపోతున్నారు.


ఇనాం భూములు ఏమవుతాయో?

జమిందారీ వ్యవస్థ అవశేషాలు జిల్లాలో ఉన్నాయి. పాచిపెంట, వీరఘట్టం, కురుపాం ప్రాంతాల్లో ఇనాం భూములు వేల ఎకరాల్లో ఉన్నాయి. ఈ భూములను రైతులు, గిరిజనులు సాగు చేస్తున్నా ఎవరికీ ఎలాంటి హక్కులు కల్పించలేదు. శాశ్వత భూహక్కుల కోసం వీరు ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నారు. రీసర్వే చేయడంతో తమకు పట్టాలు వస్తాయని వారంతా ఆశగా చూస్తున్నారు. కొత్త చట్టంలో ఆయా సమస్యను పరిష్కరించకపోతే ఇవన్నీ వివాదాస్పద భూముల జాబితాలో చేరుతాయి. వీటిపై హక్కు పొందాలంటే సాగుదారు హైకోర్టు వరకు వెళ్లాల్సిన పరిస్థితి. అది సాధ్యమయ్యేనా..


తప్పులు చూపేందుకు వచ్చిన శివిని గ్రామస్థులు

  • కొమరాడ మండలం శివినిలో  1080 ఎకరాల భూమి ఉంది. దాదాపు 900 మంది రైతుల ఖాతాలున్నాయి. వీటిలో కొంత మందివి మినహా మిగిలిన భూ దస్త్రాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. రైతు పేరుకు, ఫొటోకు సంబంధం లేకపోవడం, ఖాతా నంబర్లు, తండ్రి, భర్త పేర్లు తప్పుగా నమోదు కావడం, ఫారం 42లో ఇచ్చిన వివరాలకు భిన్నంగా ఉండటం, ఉన్నదాని కంటే ఎక్కువ భూమి నమోదు చేయడం లాంటి తప్పిదాలు జరిగాయని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారులను ఆశ్రయించినా.. స్పందించలేదని పేర్కొంటున్నారు.
  • ఇదే గ్రామంలోని రామ మందిరానికి 1.5 ఎకరాల భూముంది. దీన్ని 4.5 ఎకరాలుగా నమోదు చేశారు. వేరే వ్యక్తుల ఆధార్‌, చరవాణి నంబరును తీసుకొచ్చి అనుసంధానం చేశారు. ఇవి అసలు ఎవరి నంబర్లో కూడా తెలియడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు.

ఇక్కడే ముప్పు తిప్పలు

  • భూహక్కు పత్రాల్లో తప్పులు ఉన్నా,  అభ్యంతరాలు ఉన్నా ముందుగా స్థానిక తహసీల్దారును సంప్రదించాలి. తర్వాత ఆర్డీవో, సంయుక్త కలెక్టర్‌, కలెక్టర్‌ వరకు వెళ్లాలి. అయినా సమస్య పరిష్కారానికి మోక్షం కలగడం లేదు.
  • అలాంటిది భూహక్కు చట్టం అమల్లోకి వస్తే ఏకంగా హైకోర్టును ఆశ్రయించాలి. మరి పేద రైతులు వెళ్లగలరా?


మరొకరి పేరున భూమి..

గజపతినగరానికి చెందిన లెంక పెంటమ్మకు తన అత్త నుంచి నారాయణ గజపతిరాజపురం రెవెన్యూలో సర్వే నంబరు 34/8లో 96 సెంట్ల డి.పట్టా భూమి వచ్చింది. సర్వేకు ముందుగా గ్రామానికి చెందిన జగనన్న కాలనీ నిమిత్తం అందులో 80 సెంట్లు ప్రభుత్వం తీసుకుంది. రీసర్వేలో మిగిలిన 16 సెంట్లలో ఆమెతో పాటు కేఎస్సార్‌ పురం గ్రామానికి చెందిన బెల్లాన సత్యం పేరున నమోదైంది. ఇద్దరికీ అదే భూమిని దస్త్రాల్లో చూపారు. ఈ తప్పు సరిచేయాలని కలెక్టరు, తహసీల్దారు, అధికారుల చుట్టూ ఆరు నెలలుగా తిరుగుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


8 సెంట్లే కనిపిస్తోంది..
- సూరెడ్డి శ్రీను, రైతు, మర్రివలస

మా అమ్మ, నా పేరున మూడు ఎకరాల భూమి ఉంది. సర్వేలో 2.76 ఎకరాలున్నట్లు వచ్చింది. 1బీలో 8 సెంట్లు మాత్రమే కనిపిస్తోంది. బ్యాంకు వారు రుణం ఇవ్వమంటున్నారు. అధికారులు స్పందించి సరిచేయాలి.


43 సెంట్లు ఏమైనట్లు..
- గురుబిల్లి అక్కమ్మ, చింతలపేట

నాకు 1.23 ఎకరాల భూమి ఉంది. రీ సర్వే తర్వాత రికార్డుల్లో 0.80 ఎకరాల విస్తీర్ణమే కనిపిస్తోంది. మిగతా 43 సెంట్లు ఏమైందో తెలియదు. మొత్తం భూమిని రికార్డుల్లోకి ఎక్కించాలని వీఆర్వో, తహసీల్దారుకు పలుమార్లు విన్నవించినా పరిష్కారం కాలేదు.


మిగతా భూమి ఏదీ?..
- వి.శ్రీను, చింతలపేట, గుర్ల మండలం

నాకు చింతలపేట రెవెన్యూ పరిధిలో 0.78 సెంట్ల భూమి ఉంది. రీసర్వేలో 0.65 సెంట్లుగా చూపించారు. మిగతా భూమి ఏమైందో తేల్చాలని రెవెన్యూ అధికారులను పలుమార్లు కలిసి విన్నవించినా సమస్యకు పరిష్కారం చూపలేదు.


60 సెంట్లే చూపిస్తోంది..
- చలపరెడ్డి అప్పలనాయుడు, రైతు, రామభద్రపురం

జగనన్న భూసర్వేలో అన్ని తప్పులే నమోదయ్యాయి. నాకు 2.69 ఎకరాలు ఉంటే సర్వే తర్వాత 1బీలో 60 సెంట్ల భూమి వచ్చింది. సరిచేయమని రెవెన్యూ అధికారుల దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదు.


ఇలా చేసినప్పుడు ఎందుకన్ని తప్పులు..??

డ్రోన్‌ ఫ్లై: భూమి స్వరూపం తెలుసుకోవడానికి డ్రోన్‌ ద్వారా చిత్రాలు తీస్తారు.

ఓఆర్‌ఐ: డ్రోన్‌ఫ్లై చిత్రాల ఆధారంగా సర్వే శాఖ ఛాయా చిత్రపటాలను (మ్యాప్‌లు) రూపొందిస్తుంది.

గ్రౌండ్‌ ట్రూతింగ్‌: మ్యాప్‌ల ఆధారంగా గ్రామ సర్వేయర్‌, వీఆర్వోలు రైతులను పిలిచి భూమిపై కొలతలు వేస్తారు.

విక్టరైజేషన్‌: అడంగల్‌, ఒన్‌బీ ఆధారంగా ఆన్‌లైన్‌లో రైతుల భూమి కొలతలు పొందుపర్చుతారు. జియో కోఆర్డినేటర్స్‌, ఎల్‌పీఎంలు(ల్యాండ్‌ పొజిషనింగ్‌ మ్యాప్‌) ఇందులోకి వస్తాయి.

గ్రౌండ్‌ వేలిడేషన్‌: రైతుల సమక్షంలో భూమిపై నిజనిర్ధారణ చేస్తారు.

9(2) నోటీసులు: రైతులను పిలిచి సర్వే చేసినట్లు సంతకాలు తీసుకుంటారు. ఇందుకోసం వారికి ముందుగా నోటీసులు జారీ చేస్తారు. వీటిపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా చెప్పుకోవచ్చు. భూ వివాదాలపై జిల్లాస్థాయిలో మొబైల్‌ మెజిస్ట్రేట్‌కు వెళ్లవచ్చు.  

సర్వే డేటా: సర్వే చేసిన డేటా (రైతుల భూముల వివరాలతో కూడిన) గ్రామ సర్వేయర్‌, వీఆర్వో, తహసీల్దారు, ఆర్డీవో, జేసీ లాగిన్లకు వెళుతుంది. టైటిల్‌ నిర్ధారణ చేసి వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌తో సరిచూస్తారు.

13 నోటిఫికేషన్‌: గ్రామంలో విస్తీర్ణం నిర్ధారించినట్లు నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.  

హక్కు పత్రాలు: భూమి మీద హక్కు కల్పిస్తూ పత్రాలు అందజేస్తారు.

ఇన్ని చేసినా.. పట్టాదారు పాసు పుస్తకంలో ఎందుకు తప్పులు దొర్లుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని