logo

పోస్టల్‌ బ్యాలెట్లు.. ఉద్యోగుల ఇక్కట్లు

పోస్టల్‌ బ్యాలెట్‌లో భాగంగా ఓట్లేసేందుకు ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జేఎన్‌టీయూ గురజాడ విద్యాలయంలో ఫెసిలిటేషన్‌ కేంద్రం వద్ద ఈ పరిస్థితి కనిపిస్తోంది.

Published : 07 May 2024 04:34 IST

జాబితాలో ఓట్లు లేవని చెబుతున్న ఉద్యోగులు

విజయనగరం అర్బన్‌, ఉడాకాలనీ, న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలెట్‌లో భాగంగా ఓట్లేసేందుకు ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జేఎన్‌టీయూ గురజాడ విద్యాలయంలో ఫెసిలిటేషన్‌ కేంద్రం వద్ద ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఎన్‌హెచ్‌- 26 నుంచి కేంద్రానికి వచ్చేందుకు సుమారు రెండు కి.మీ. రావాలి. రవాణా ఇబ్బందులతో కొందరు మండుటెండలో కాలినడకన వెళ్లారు. ఉదయం 11 గంటల సమయంలో తాగునీరు లేకపోవడంతో కొందరు ఆవేదన వ్యక్తం చేయగా  అప్పటికప్పుడు అక్కడున్న సిబ్బంది క్యాన్ల ద్వారా తాగునీటిని తీసుకొచ్చారు. చాలామంది పేర్లు జాబితాలో లేవు. సొంత నియోజకవర్గంలో ఓటు వేయాలని సూచించడంతో కొందరు కంగుతిన్నారు. జిల్లాలో పనిచేస్తున్న వారు విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు వెళ్లాల్సి రావడంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బీ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన ఓటరు.. ప్రస్తుతం వంగర మండల విద్యాశాఖలో పనిచేస్తున్నా.. ఇక్కడకు వచ్చి చెక్‌ చేస్తే తన పేరు కనిపించకపోవడంతో ఓటేయడానికి వీల్లేదని చెప్పడంతో ఆ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగులను బెదిరిస్తున్నారు: బేబినాయన

 బొబ్బిలి, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు ఉద్యోగులను బెదిరిస్తున్నారని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ ఓటు ఎవరికి వేశారన్నది బ్యాలెట్‌ పేపరు ఫొటో తీసి పెట్టాలని అధికార పార్టీ నాయకులు ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. దీనిపై ఆర్వో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలింగ్‌ కేంద్రంలోకి చరవాణులను అనుమతించకూడదని కోరామన్నారు. చాలామంది ఉద్యోగులు సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు.

 వాలంటీర్లతో ఓటర్ల స్లిప్పుల పంపిణీ?

పట్టణంలోని పలు వార్డుల్లో వాలంటీర్లతో ఓటర్ల స్లిప్పుల పంపిణీ గుట్టుగా సాగుతోంది. అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు దగ్గర ఉండి పంపిణీ చేయిస్తున్నట్లు సమాచారం. సోమవారం నాలుగో వార్డులో పంపిణీ చేసినట్లు తెలిసింది. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి తెరచాటుగా ప్రచారాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో రాజీనామా చేసిన వాలంటీర్లు అధికార పార్టీ ప్రచార కార్యకర్తలుగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి జగన్‌కు ఓటేయాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని