logo

AP News: ఎమ్మెల్యే సోదరుడు- విద్యుత్తు ఈఈ ఆడియో వైరల్‌

జిల్లాలో ఓ శాసనసభ్యుడి సోదరుడు, విద్యుత్తు శాఖ ఈఈ మధ్య జరిగిన సంభాషణ ఆడియో కలకలం సృష్టించింది. 5 రోజుల క్రితం జరిగినట్లు చెబుతున్న ఈ సంభాషణ బుధవారం లీకు కాగా.. క్రమశిక్షణ చర్యల కింద అధికారిని ఆ శాఖ గురువారం సస్పెండ్‌ చేసింది. వివరాలివి. ఓ శాసనసభ్యుడి సోదరుడు కనిగిరి డివిజనల్‌ ఈఈ

Updated : 16 Jul 2021 09:19 IST

అధికారిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు 

ఈనాడు డిజిటల్, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఓ శాసనసభ్యుడి సోదరుడు, విద్యుత్తు శాఖ ఈఈ మధ్య జరిగిన సంభాషణ ఆడియో కలకలం సృష్టించింది. 5 రోజుల క్రితం జరిగినట్లు చెబుతున్న ఈ సంభాషణ బుధవారం లీకు కాగా.. క్రమశిక్షణ చర్యల కింద అధికారిని ఆ శాఖ గురువారం సస్పెండ్‌ చేసింది. వివరాలివి. ఓ శాసనసభ్యుడి సోదరుడు కనిగిరి డివిజనల్‌ ఈఈ ఎం.భాస్కరరావుకు ఫోన్‌ చేశారు. కురిచేడు మండలం బోదనంపాడులో ఉన్న తమ భూములకు విద్యుత్తు సరఫరా ఇచ్చే విషయమై ఇంతవరకు సామగ్రి రాలేదని ప్రస్తావించారు. ఒక నెలలో చేయిస్తామని ఎస్‌ఈ చెప్పారని ఈఈ గుర్తుచేశారు. డబ్బులు కట్టి ఇన్ని రోజులవుతుంటే రోజుకో కథ చెబుతున్నారంటూ ఆ నేత అనగా.. వ్యవసాయానికి ప్రాధాన్యం ప్రకారం చేస్తామని అధికారి బదులిచ్చారు. ఈ క్రమంలో ‘ఏందీ.. నువ్వు తమాషా చేస్తున్నావ్‌’ అని నేత అనడంతో ‘నువ్వు.. నువ్వు.. అనకండి. మర్యాద ఇచ్చి మాట్లాడండి. మీరు ఎమ్మెల్యే సోదరుడు అయినంత మాత్రాన ప్రభుత్వ ఉద్యోగన్న గౌరవం లేకుండా మాట్లాడతారా? మీ పని ఎస్‌ఈ గారి పరిధిలోనిదని మీకు తెలుసు. ఈఈ అనుకుంటున్నారా? ఇంట్లో పాలేరు అనుకుంటున్నారా?’ అంటూ అధికారి ప్రశ్నించారు. ఈ సంభాషణ ఆడియో వైరల్‌ కావడంతో అధికారులు తీవ్రంగా తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ఉల్లంఘించడంతో పాటు ఉద్యోగ రీత్యా క్రమశిక్షణ రాహిత్యం వహించారంటూ ఈఈ భాస్కర్‌రావును సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఏపీసీపీడీసీఎల్‌ ఎస్‌ఈ కేవీజీ సత్యనారాయణ ఉత్తర్వులిచ్చారు. ఆ వెంటనే కనిగిరి ఇన్‌ఛార్జి ఈఈగా పొదిలి డీఈఈ ఎ.సత్యనారాయణను నియమించారు. ఈ క్రమంలోనే సస్పెండైన భాస్కరరావు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను గురువారం కలవడం గమనార్హం. తాను తప్పు చేయలేదని, ఎమ్మెల్యే సోదరుడితో మామూలుగానే మాట్లాడానని ఈఈ భాస్కరరావు ‘న్యూస్‌టుడే’తో అన్నారు. ఎందుకు సస్పెండ్‌ చేశారో తెలియదని, ఆ కాపీ అందలేదని తెలిపారు. సీఎండీ దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్తానని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని