logo

TDP Mahanadu: దండు కదిలింది ..దేశం మురిసింది

మూడేళ్ల తర్వాత నిర్వహించిన మహా వేడుక అంచనాలను మించింది. ‘అధికార’ అడ్డంకులను దాటుకుంటూ.. భానుడి భగభగలనూ లెక్క చేయకుండా పసుపు పండుగకు దేశ, విదేశాల నుంచి తెలుగు దండు కదిలొచ్చింది. అన్ని దారులూ మహానాడు వైపే అన్నట్టు సాగిన వాహనాల శ్రేణి చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై చీమలదండును తలపించిం

Updated : 29 May 2022 08:07 IST

అన్ని దారులూ మహానాడు వైపు

అంచనాలకు మించి తరలివచ్చిన శ్రేణులు  

వేడుక విజయవంతంతో నాయకుల జోష్‌

మండువవారిపాలెంలో పసుపు పూల ప్రభం‘జనం’

 

బాబుకు గజమాలతో  ఒంగోలు నాయకుల సత్కారం

మూడేళ్ల తర్వాత నిర్వహించిన మహా వేడుక అంచనాలను మించింది. ‘అధికార’ అడ్డంకులను దాటుకుంటూ.. భానుడి భగభగలనూ లెక్క చేయకుండా పసుపు పండుగకు దేశ, విదేశాల నుంచి తెలుగు దండు కదిలొచ్చింది. అన్ని దారులూ మహానాడు వైపే అన్నట్టు సాగిన వాహనాల శ్రేణి చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై చీమలదండును తలపించింది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు తండోప తండాలుగా తరలివచ్చిన సైన్యాన్ని చూసి దేశమే మురిసింది. ఒంగోలు మండలం మండువ వారి పాలెంలోని సభా ప్రాంగణం జన సంద్రాన్ని తలపించింది.  - న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం, ఒంగోలు ట్రంకు రోడ్డు, ఒంగోలు అర్బన్, ఒంగోలు నగరం,  ఈనాడు డిజిటల్, ఒంగోలు

మండుటెండలోనూ బ్రహ్మరథం...

మిట్ట మధ్యాహ్నం. పైన సూర్యుడు నడి నెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. కింద సిమెంట్‌ రోడ్లు సెగలు కక్కుతున్నాయి. ఇంతటి ఉక్కుపోత వాతావరణం, మండుటెండల్లోనూ తెదేపా అధినేత చంద్రబాబు రాక కోసం గంటల తరబడి కార్యకర్తలు రోడ్ల పైనే నిరీక్షించారు. ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు బస చేసిన ఎన్నెస్పీ అతిథి గృహం నుంచి ఒంగోలులో శనివారం భారీ రోడ్‌షో నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో అనుసరించగా కాన్వాయ్‌ ముందుకు సాగింది. మాతాశిశు వైద్యశాల సమీపంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద తెదేపా కౌన్సిలర్‌ తిప్పరామల్లి రవితేజ క్రేన్‌తో భారీ గజమాలతో స్వాగతం పలికారు. మహిళలు ఉత్సాహంగా ఎదురెళ్లి చంద్రబాబుకు హారతులిచ్చారు. అక్కడి నుంచి సీవీఎన్‌ రీడింగ్‌ రూమ్, మున్సిపల్‌ కార్పొరేషన్, చర్చి సెంటర్‌ మీదుగా కాన్వాయ్‌ సాగింది. భారీ ప్రదర్శనతో నగరంలోని వీధులు పసుపు రంగులోకి మారాయి. అద్దంకి బస్టాండ్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం దామచర్ల జనార్దన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 60 కిలోల కేకును కత్తిరించారు.

ఒంగోలు అభివృద్ధి ఘనత జనార్దన్‌దే...

ఒంగోలు నగర అభివృద్ధి అంతా దామచర్ల జనార్దన్‌ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తెలుగుదేశం హయాంలోనే చేపట్టిందేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కేక్‌ కోసి నాయకులకు తినిపించారు.

అడ్డంకులు అధికారికం

మెప్మా ఆధ్వర్యంలో జాతీయ రుతుస్రావ దినోత్సవాన్ని నిర్వహించడం ఈ సారి తప్పనిసరి చేయడంతో పాటు, డ్వాక్రా మహిళల హాజరు తీసుకుంటామని అధికారులు షరతు పెట్టారు. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తున్న తరుణంలోనే.. డ్వాక్రా మహిళలు తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొనడం తెదేపా వర్గాల్లో ఆగ్రహం కలిగించింది. పార్టీ అధినేత చంద్రబాబు సైతం అద్దంకి బస్టాండ్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేశాక చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. స్లమ్‌ సమాఖ్యలు వారి పరిధిలోని పొదుపు సంఘాల మహిళలకు సమావేశాలు నిర్వహించాయి. గోల్డ్‌ మర్చంట్స్‌ హాల్, పేర్నమిట్టలో నిర్వహించిన కార్యక్రమాలకు మేయర్‌ సుజాత, మెప్మా పీడీ రవికుమార్, డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి హాజరయ్యారు. పేర్నమిట్ట సమీపంలోని కల్యాణమండపంలో ఉదయం 11 గంటలకు మొదలు కావాల్సిన కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రారంభించలేదు. దీంతో మహిళలు తీవ్ర అసహనానికి గురయ్యారు. అడ్డంకులు సృష్టించినప్పటికీ మహానాడు సభ అనుకున్నదానికంటే విజయవంతం కావడం విశేషం.

ఎన్టీఆర్‌ జయంతి.. తెలుగుదేశం పార్టీ మహానాడు ముగింపు సందర్భంగా ఒంగోలు మండలం మండువవారిపాలెం గ్రామ సమీపంలో శనివారం నిర్వహించిన బహిరంగ సభా ప్రాంగణం జన సంద్రాన్ని తలపించింది. అధికార పార్టీ అడ్డంకులు సృష్టించినా జనం రాకను నిలువరించలేకపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి రావడంతో మహానాడు ప్రాంగణం కిక్కిరిసింది. మహానాడులో భాగంగా తొలి రోజైన శుక్రవారం నాటి ప్రతినిధుల సభకు నాయకుల అంచనాకు మించి తెలుగు తమ్ముళ్లు తరలిరావడంతోనే పార్టీ శ్రేణుల్లో అవధుల్లేని ఆనందం కనిపించింది. 

ఉదయం నుంచీ అదే ఉత్సాహం...

షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కావాల్సి ఉంది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రతతో పాటు, వడగాడ్పులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇతర జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఉదయం 7 గంటల నుంచే సభా ప్రాంగణం సందడిగా మారింది.

అంతటా పసుపు వర్ణ శోభితం...

నాయకుల ప్రచార ఫ్లెక్సీలు, పార్టీ జెండాలతో పాటు, కార్యకర్తలు, నాయకులు పసుపు వస్త్రాలు ధరించి సభకు తరలివచ్చారు. దీంతో ప్రాంగణంతో పాటు సమీపంలో ఎటు చూసినా పసుపు వర్ణ శోభితంగా కనిపించింది.

మూడు లక్షల వరకు హాజరు...


 

రెండో రోజు నాటి సభకు లక్ష నుంచి 1.50 లక్షల మంది హాజరవుతారని అంచనా వేసినప్పటికీ.. అంతకుమించి సుమారు 3 లక్షల వరకు శ్రేణులు తరలివచ్చాయి. రెండు రాష్ట్రాల నుంచి కార్లతో పాటు, మినీ లారీలు, ప్రైవేట్‌ బస్సుల్లోను.. జిల్లాలోని నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలపై తరలివచ్చారు. వాహనాల రాకతో సభా ప్రాంగణంతో పాటు పార్కింగ్‌ స్థలంలో ఖాళీ లేకపోవడంతో వేలాది వాహనాలు జాతీయ రహదారికి రెండు వైపులా ఉన్న అంచుల వెంటే ఉంచాల్సి వచ్చింది. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది.

పక్కా ప్రణాళికతో సభ సూపర్‌ హిట్‌

మహానాడును ఒంగోలులో నిర్వహించనున్నట్టు తెదేపా ప్రకటించగానే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో పాటు, ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఉమ్మడి ప్రకాశంలోని పార్టీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఇతర నియోజకవర్గ బాధ్యులు, నాయకులు దామచర్ల సత్యనారాయణ జన సమీకరణపై దృష్టి సారించారు. నియోజకవర్గ స్థాయిలో సన్నాహాక సమావేశాలు నిర్వహించి ద్వితీయ శ్రేణి నాయకులకు దిశానిర్దేశం చేశారు. అధికార పార్టీ అడ్డంకులు సృష్టించినా సభకు హాజరయ్యేలా ముందస్తు ప్రణాళిక చేశారు. దీంతో రెండు రోజుల పాటు సాగిన మహానాడుకు అంచనాలకు మించి జనం తరలివచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకుల సమష్టి కృషిని పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా అభినందించారు. 

నేతల ప్రసంగాలు.. శ్రేణుల కేరింతలు...

ఎండ తీవ్రత నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు వేడిగాలితో పాటు, ఉక్కపోతతో ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ.. జనం సభా వేదిక వద్ద నుంచి కదల్లేదు. మజ్జిగ ప్యాకెట్లను ఉదయం నుంచి సభ పూర్తయ్యే వరకు మైదానంలో అందజేస్తూనే ఉన్నారు. తాగునీటి సీసాలు, మంచినీటి ప్యాకెట్లు కూడా సరఫరా చేశారు. కీలక నాయకులు తమ ప్రసంగాల్లో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అనుసరిస్తున్న విధానాలను విమర్శించిన ప్రతిసారీ తెలుగు తమ్ముళ్ల నుంచి చప్పట్లతో స్పందన కనిపించింది. జిల్లా నుంచి ఎక్కువ మంది హాజరు కావడం స్థానిక నాయకుల్లో జోష్‌ నింపింది. రెండో రోజుల పాటు సాగిన మహానాడుకు అనూహ్య స్పందన రావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

 సభా ప్రాంగణంలో కిక్కిరిసిన తెదేపా శ్రేణులు

తొలగించిన జర్మన్‌ షెడ్‌లో సభకు హాజరైన జన సందోహం

బహిరంగ సభకు హాజరైన ఆశేష జనవాహినిలో ఓ భాగం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని