logo

‘తినడానికా! సమస్యల పరిష్కారానికా!!’

‘టీ, బిస్కెట్లు తినడానికా.. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకా ఈ సమావేశం’ అని అధికారులపై రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కుంభా రవిబాబు

Published : 12 Aug 2022 02:16 IST

అధికారులపై రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ ఆగ్రహం

సమావేశంలో మాట్లాడుతున్న రవిబాబు.. వేదికపై ప్రజాప్రతినిధులు, అధికారులు

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ‘టీ, బిస్కెట్లు తినడానికా.. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకా ఈ సమావేశం’ అని అధికారులపై రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కుంభా రవిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని పాత సింగరాయకొండ గ్రామ పరిధిలోని మల్లికార్జుననగర్‌ గిరిజన కాలనీలో ఆయన గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో సమావేశమై సమస్యలపై ఆరా తీశారు. దీనికి పలువురు మండల స్థాయి అధికారులు గైర్హాజరవ్వడంతో ఆయన మండిపడ్డారు. అనంతరం యానాది సొసైటీ సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో రవిబాబు మాట్లాడారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేసిందన్నారు. గిరిజన కాలనీలను అధికారులు తరచూ సందర్శించడంతో పాటు ఆధార్‌ కార్డులు, సంక్షేమ పథకాలు అందించాలన్నారు. హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కాలనీ వాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. 3, 4, 5 తరగతుల విలీనంతో తమ పిల్లలు సుమారు 3 కిలో మీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కేటాయించిన శ్మశానవాటిక భూమిని కొందరు వైకాపా నాయకులు ఆక్రమిస్తున్నారని వివరించారు. సమావేశంలో నెల్లూరు ఐటీడీఏ పీవో మందారాణి, మత్స్యశాఖ జేడీ చంద్రశేఖరరెడ్డి, తహసీల్దార్‌ ఉష, సర్పంచి రాజ్యలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు ఝాన్సీ, యానాది సంఘం నాయకులు శంకర్‌ నాయక్‌, రామచంద్రయ్య, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని