ముసి రక్షణ గోడను ఢీకొన్న కారు
వేగంగా వెళుతున్న కారు టైరు పంక్చర్ కావడంతో వాహనం అదుపు తప్పి వాగు రక్షణ గోడను ఢీకొని నిలిచిపోవడంతో త్రుటిలో ముప్పు తప్పింది.
త్రుటిలో తప్పిన ముప్పు
ప్రమాదంలో దెబ్బతిన్న కారు
వేలూరు (పొదిలి గ్రామీణం), న్యూస్‌టుడే: వేగంగా వెళుతున్న కారు టైరు పంక్చర్ కావడంతో వాహనం అదుపు తప్పి వాగు రక్షణ గోడను ఢీకొని నిలిచిపోవడంతో త్రుటిలో ముప్పు తప్పింది. ఈ సంఘటన వేలూరు ముసి వాగు బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు టి.సళ్లూరు గ్రామానికి చెందిన వెలుతుర్ల వెంకటేశ్వర్లు సోమవారం తన కారులో మర్రిచెట్లపాలెం వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో ముసి వాగు వంతెన వద్దకు వచ్చేసరికి కారు టైరు పంక్చర్ అయ్యి అదుపుతప్పి గోడను బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. రక్షణ గోడ స్వల్పంగా దెబ్బతింది. వాహనచోదకుడికి ఎలాంటి గాయాలు కాలేదు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
సిద్ధవరం (కొనకనమిట్ల), న్యూస్‌టుడే: కొనకనమిట్ల మండలంలోని సిద్ధవరం వ్యవసాయ భూముల వద్ద సోమవారం గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించామని ఎస్సై దీపిక తెలిపారు. వయస్సు 45 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. మృతదేహంపై తెల్లచొక్కా ఉందన్నారు. వివరాలకు స్టేషన్‌కు సంప్రదించాలన్నారు.
యువ వ్యాపారి బలవన్మరణం
దర్శి, న్యూస్‌టుడే: దర్శి పట్టణంలో కురిచేడు రోడ్డులో పండ్ల వ్యాపారం చేస్తున్న యువ వ్యాపారి (24) పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. మండలంలోని ఒక గ్రామానికి చెందిన అతడు దర్శిలో నివాసం ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుని జీవిస్తున్నాడు. అతడికి వివాహమైంది. భార్య, కుమార్తె ఉన్నారు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బంధువులు తొలుత స్థానికంగా ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అనంతరం ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
లారీ ఢీకొని దుర్మరణం
సంతనూతలపాడు (మద్దిపాడు), న్యూస్‌టుడే: లారీ ఢీకొని ఓ ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. జాతీయ రహదారిపై మద్దిపాడు మండలం గ్రోత్‌సెంటర్ కూడలిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జె.పంగులూరు మండలం బైటమంజులూరుకు చెందిన నల్లమద్ది కిషోర్ (40)... గ్రోత్‌సెంటర్ కూడలి వద్ద ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో... గుంటూరు నుంచి ఒంగోలు వైపు వస్తున్న లారీ ఆయనను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న హైవే మొబైల్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
గల్లంతైన యువకుడు మృతి
కొత్తపట్నం, న్యూస్‌టుడే: గుండమాల తీరంలో గల్లంతైన మరో యువకుడు కూడా మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం... కె.పల్లెపాలెం వద్ద సముద్ర స్నానానికి దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జితేంద్ర మృతదేహం వెంటనే లభ్యమైంది. మరో యువకుడు అవనిగడ్డ కార్తిక్ (23) మృతదేహం... సోమవారం సాయంత్రం తీరానికి కొట్టుకువచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు.
రైలు కిందపడి...
ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఒకరు మృతి చెందారు. ఒంగోలు రైల్వేస్టేషన్‌కు సమీపంలో పోతురాజు కాలువ వంతెన వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి వయసు సుమారు యాభై ఏళ్లు ఉంటుందని ఒంగోలు జీఆర్‌పీ సిబ్బంది తెలిపారు. నెల్లూరు - విజయవాడ, విజయవాడ - ఒంగోలు, ఒంగోలు- సికింద్రాబాద్, సికింద్రాబాద్ - ఒంగోలు జనరల్ బోగీల్లో ప్రయాణించిన టిక్కెట్లు లభ్యమయ్యాయి. ఇతర ఆధారాలేవీ లభించకపోవడంతో ఎవరన్నదీ తెలియరాలేదు. మృతదేహాన్ని జీజీహెచ్ శవాగారానికి తరలించారు. జీఆర్‌పీ ఎస్సై వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య