logo

అభివృద్ధి చేస్తాం.. అవినీతి అంతు తేలుస్తాం..!

పలాసలో తెదేపా అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభ  తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఐక్యతకు ప్రతిరూపంగా నిలిచింది. అనుకున్న సమయం కన్నా కార్యక్రమం ఆలస్యమైనా శ్రేణుల్లో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు.

Updated : 16 Apr 2024 06:28 IST

జిల్లాకు హామీల వర్షం

ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు

రెట్టించిన సమరోత్సాహం..  జవసత్వాలు నింపిన అధినేత ప్రసంగం..అడుగడుగునా నీరా‘జనాలు’.. కూటమి కలిసి కట్టు ప్రయాణం..వెరసి పలాసలో ప్రజాగళం హోరెత్తింది..

పలాసలో తెదేపా అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభ  తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఐక్యతకు ప్రతిరూపంగా నిలిచింది. అనుకున్న సమయం కన్నా కార్యక్రమం ఆలస్యమైనా శ్రేణుల్లో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఎర్రన్నాయుడు, స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్నను స్మరించుకుంటూ చంద్రబాబు ప్రసంగాన్ని ప్రారంభించారు. అటు అభివృద్ధి చేస్తూనే.. ఇటు అవినీతి అంతు తేలుస్తామంటూ ఆయన చెప్పిన మాటల్లో భరోసా కనిపించింది.. బాబు ప్రశ్నలకు సానుకూల సమాధానాలిస్తూ యువత కేరింతలు కొట్టారు.

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, న్యూస్‌టుడే, పలాస, పలాస గ్రామీణం, వజ్రపుకొత్తూరు, టెక్కలి, కాశీబుగ్గ

సభకు హాజరైన జనసందోహం


కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం

‘తెదేపా హయాంలో డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం. పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేశాం. అయిదేళ్లలో వైకాపా వాళ్లు పొడిచిందేమీ లేదు. కిడ్నీ వ్యాధులపై పూర్తిస్థాయిలో పరిశోధన చేస్తాం. నీరు, పరిసరాలు, ఆహారంపై కూడా పరిశోధనలు చేయాల్సి ఉంది. కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపే విధంగా చర్యలు తీసుకుంటాం.’

ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు..

‘జిల్లాల విభజనతో ఐటీడీఏ కోల్పోయిన శ్రీకాకుళానికి ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేస్తాం. పలాసలో కేంద్రీయ విద్యాలయం నెలకొల్పుతాం. జిల్లాలో యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే సత్తా ఉన్నవారు. రక్షణ రంగంలో ఇక్కడి యువత ఎక్కువగా పని చేస్తారు. ప్రాణం కన్నా దేశ రక్షణే ముఖ్యమని భావించే యువత ఇక్కడ ఉన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం.’

రైతులకు అండగా నిలుస్తాం..

‘జిల్లాలో రైతులకు అండగా నిలుస్తాం. జీడి పిక్కలు 80 కిలోల బస్తా ధర రూ.16 వేలు ఉండాలి. ఇప్పుడు రూ.7 వేలకు పడిపోయింది. జీడి బోర్డు ఏర్పాటు చేసి రైతుకు మద్దతు ధర కల్పిస్తాం. వంశధార- బాహుదా నదులను అనుసంధానం చేస్తాం. ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుకు గతంలో రూ.436 కోట్లు ఇచ్చాం. వంశధార కాలువలకు సిమెంట్‌ లైనింగ్‌ పనులూ జరగలేదు. ఆ పనులన్నీ వైకాపా ప్రభుత్వం నిలిపేసింది. తెదేపా అధికారంలోకి రాగానే పూర్తి చేస్తాం. పలాసలో రైతుబజారు తెరిపించి పంటలను ఇక్కడే అమ్ముకునేలా వీలు కల్పిస్తాం.’

కూటమి శ్రేణులతో కిక్కిరిసిన పలాసలోని ఇందిరాచౌక్‌ కూడలి

అప్పలరాజు భూకబ్జాలకు లెక్కే లేదు..

‘వైకాపా అధికారంలోకి రాగానే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. శిరీషని, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేశారు. పలాసలో మంత్రి అప్పలరాజు భూకబ్జాలకు అంతులేదు. వీటిపై విచారణ చేసి అన్ని అంశాలను తిరగదోడుతాం. లెక్కలన్నీ తేలుస్తాం. నష్టపోయిన బాధితులకు తిరిగి వారి భూములను అప్పగిస్తాం. ఒకసారి ఎమ్మెల్యే అయితేనే ఇన్ని తోకలు వస్తే.. మూడు తరాలుగా ఉన్న వారు ఏమైనా చేస్తే ఏమవుతారు. పెద్ద సైకో..చిన్న సైకోలను తయారు చేశారు. తలుచుకుంటే అందరి తోకలను కట్‌ చేస్తాం’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నాటకాలు వేసే వ్యక్తులు వద్దని, శిరీషతో పాటు కూటమి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. భావనపాడు నుంచి విశాఖ వరకు తీరం వెంట సాగర నడవా నిర్మిస్తామని ప్రకటించారు. తిత్లీ తుపాను సమయంలో ఇక్కడ రెండు వారాల పాటు గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. ప్రజలకు కష్టం వస్తే పక్క జిల్లాకు సైతం జగన్‌ పరామర్శకు రారని ఎద్దేవా చేశారు.’

ప్రసంగిస్తున్న చంద్రబాబు

మత్స్యకారులకు పూర్వ వైభవం

‘217 జీవో రద్దు అయితే మత్స్యకారుల గురించి మాట్లాడలేని వ్యక్తి సీదిరి అప్పలరాజు. గతంలో మత్స్యకారులను అన్ని విధాల ఆదుకున్నాం. రాయితీపై వారికి అవసరమైన ఉపకరణాలు, యంత్రాలు, వాహనాలు అందజేశాం. వారికి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత తెదేపా ప్రభుత్వానిది’ అని భరోసా ఇచ్చారు.’


ప్రశాంతత కరవు

వైకాపా పాలనలో తెదేపా కార్యకర్తలను చిత్రహింసలకు గురిచేశారు. పలాస ప్రాంతంలో ప్రశాంతత కరవైంది. జీడిపిక్కలకు మద్దతు ధర ఊసే లేదు.  రైతుబజారు, ఇండోర్‌ స్టేడియం ఏర్పాటు గాలికి వదిలేశారు. నియోజకవర్గంలో ప్రధానమైన కొండలను మింగేస్తున్నారు. తెదేపా హయాంలో ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుకు     రూ.436 కోట్లు కేటాయించగా వైకాపా ప్రభుత్వం ఒక్క పైసా మంజూరు చేయలేదు.

ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు  


పలాసను అక్రమాల అడ్డాగా మార్చేశారు

వైకాపా అధికారంలోకి రాగానే పలాసను అక్రమాలకు అడ్డా మార్చేశారు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధి కాలువల్లో చెత్త కూడా తీయలేదు. జిల్లాకు ఐటీడీఏ లేకుండా చేశారు. జీడి రైతులకు తెదేపా హయాంలో బస్తాకు రూ.15 వేలు చెల్లించాం. వైకాపా పాలనలో ధర రూ.ఏడు వేలకు పడిపోయింది. కిడ్నీ బాధితులను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. తెదేపా హయాంలో ఉన్న డయాలసిస్‌ కేంద్రాలనే కొనసాగిస్తున్నారు. పలాస ప్రాంతంలో యువత కోసం నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. సాగునీటి వనరులు కళింగ్‌దళ్‌, డబార్శింగి, దామోదర్‌సాగర్‌ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం.

గౌతు శిరీష, పలాస ఎమ్మెల్యే అభ్యర్థి

చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న శ్రేణులు

 

తెదేపా, జనసేన జెండాలు చేతపట్టి యువతి సందడి

 

పలాస ప్రధాన రహదారిపై రోడ్‌ షో
 

చంద్రన్న రాకకు రహదారిపై నిరీక్షిస్తూ..

 

హెలీప్యాడ్‌ వద్ద పోలీసు బందోబస్తు

 

పుష్పగుచ్ఛం ఇస్తున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని