logo

అనుసంధానానికి జగనన్న గ్రహణం..!

నాగావళి- వంశధార అనుసంధానం పనులను అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది.

Published : 24 Apr 2024 05:05 IST

అయిదేళ్లుగా పనులను పట్టించుకోని సర్కారు
భూసేకరణ సమస్యలకు చూపని పరిష్కారం

వైకుంఠపురం- అల్లిపల్లిగూడ సమీపంలోని స్లూయిజ్‌ వద్ద పరిస్థితి

నాగావళి- వంశధార అనుసంధానం పనులను అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. కనీసం భూసేకరణ సమస్యలకు సైతం గ్రహణం వీడలేదు. శాసనసభాపతి తమ్మినేని సీతారాం కాలువ పనులు పూర్తిచేయడంపై దృష్టి సారించక పోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ప్రాధాన్యతా పనుల్లో రెండు నదుల అనుసంధానాన్ని చేర్చి 2020 జూలై నాటికి పూర్తిచేస్తామని చెప్పింది. తీరా ఇప్పటి వరకు ఆరుసార్లు గడువు పెంచింది. ఈ ఏడాది జూన్‌ నాటికి ఏడో గడువు ముగియనుండటం గమనార్హం.

న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌


పూర్తయితే ప్రయోజనాలివీ..

నాగావళి- వంశధార నదుల అనుసంధానం పనులు పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న కృతనిశ్చయంతో తెదేపా హయాంలో ప్రతిపాదనలు చేశారు. 33.583 కి.మీ. పొడవునా 600 క్యూసెక్కుల సామర్థ్యంతో రూ.145 కోట్ల అంచనా వ్యయంతో 2017-18లో పరిపాలన అనుమతులు జారీ చేసింది. గుత్తేదారుడు రూ.78.96కోట్లకు పనులు సొంతం చేసుకొని ఇప్పటి వరకు రూ.55.28 కోట్లు ఖర్చు చేసి 80 శాతం పూర్తిచేశాడు. ఈ పనులు పూర్తయితే 5 వేల ఎకరాల ఆయకట్టుతో పాటు, నారాయణపురం ఆనకట్ట దిగువనున్న 33,500 ఎకరాలకు సాగునీరందించవచ్చు. ఓవీపేట పరిధిలో ఎత్తిపోతల పథకం నిర్మించి మరో 600 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఏడాదిన్నర నుంచి రెండేళ్ల పరిధిలో భూసేకరణ చేయడంతో పాటు సుమారు 60 శాతం పనులు శరవేగంగా జరిగాయి. ప్రస్తుత ప్రభుత్వం బిల్లులు చెల్లింపుల్లో తీవ్రంగా జాప్యం చేయడం ఏడాదిన్నర పాటు పనులు నిలుపుదల చేయడం తదితర కారణాలతో గత నాలుగేళ్లుగా కేవలం 20 శాతం పనులు మాత్రమే జరిగాయి. ఇటీవల పనులు ప్రారంభించినా అవి నత్తతో పోటీపడుతున్నాయి.

మిగిలిన వాటికి మోక్షమెప్పుడో

రెండేళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు పూర్తయిన చోట పట్టించుకోక పోవడంతో కాలువల్లో ఎక్కడికక్కడ పనికిరాని మొక్కలు ఏపుగా పెరిగాయి. 33.583 కి.మీ. కాలువకు గానూ సుమారు 30 కి.మీ. మేర మట్టి పనులు పూర్తయినా.. చాలావరకు ఇవి పూడుకు పోయాయి. 3.583 కి.మీ. పనులు వివిధ కారణాలతో ప్రారంభించలేదు. కాలువపై చేపట్టాల్సిన 66 నిర్మాణాలకు గాను 34 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. 7 నిర్మాణాలు ఇంకా ప్రారంభించాల్సి ఉంది. గేట్లు, హెడ్‌ రెగ్యులేటర్స్‌, క్రాస్‌ రెగ్యులేటర్‌ పనులు, 10 డిస్ట్రిబ్యూటర్స్‌ నిర్మాణాలు ఇంకా చేపట్టాల్సి ఉంది.

 తొలగని ఇబ్బందులు

అనుసంధాన కాలువ భూసేకరణలో సమస్యలకు గ్రహణం వీడలేదు. శ్రీరామవలస, చిగురువలస, లక్ష్మీపురం, బొట్టారుసింగి, డక్కరవలస, లంకాం, అమృతలింగాపురం, తదితర గ్రామాల్లో రైతుల భూముల సమస్యలు నేటికీ పరిష్కరించలేదు. అనుసంధాన కాలువ నిమిత్తం సుమారు 636.96 ఎకరాలకు గానూ 597 ఎకరాలు సేకరించారు. మరో 5.51 ఎకరాల దేవదాయ భూములకు సంబంధించి రైతులకు పరిహారం అందించలేదు. 34 ఎకరాలకు రూ.6.92 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. కేవలం 5.51 ఎకరాల భూమిని సేకరించాల్సిన చోట రైతులకు చెల్లించాల్సిన పరిహారం వద్ద వివాదంతో పనులు నిలిచిపోయాయి.

80 శాతం పూర్తి

2017- 18లో ప్రారంభమైన నాగావళి- వంశధార నదుల అనుసంధాన పనులకు ఆరుసార్లు గడువు పెంచారు. 2018 జులైలో  మొదటి గడువు పూర్తయ్యే నాటికి 58 శాతం పనులు పూర్తయ్యాయి. 2019 నవంబరుకు 60 శాతం, 2020 జులైకు 65 శాతం, 2022 ఆగస్టుకు 70 శాతం, 2022 డిసెంబరుకు 80 శాతం పనులు పూర్తయ్యాయని ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. 2023 జూలై 30 నాటికి ఆరోసారి గడువు పూర్తికానుంది. బిల్లులు చెల్లింపుల్లో ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో గుత్తేదారుడు రెండున్నరేళ్లుగా పనులు చేయడంలో ఆసక్తి చూపడం లేదు. గతేడాది జూన్‌ 17న ప్రభుత్వం రూ.3.52 కోట్లు చెల్లించింది. ఇక పనులు వేగంగా జరుగుతాయన్న తరుణంలో వర్షాలు పడటంతో పురోగతి లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని