logo

జనం జాగాలపైకి జ‘గన్‌’..!

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత భూఆక్రమణలకు కొదవ లేకుండా పోయింది. ఖాళీ జాగా కనిపిస్తే అధికార మదంతో కబ్జా చేసేస్తున్నారు. ప్రశ్నిస్తే వివాదాలకు దిగుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేసేందుకు జగన్‌ కొత్త ఎత్తుగడతో జనాల ముందుకు వస్తున్నారు.

Published : 05 May 2024 05:40 IST

లోపభూయిష్ఠంగా భూ యాజమాన్య హక్కు చట్టం
వైకాపా ప్రభుత్వ నిర్ణయంతో అన్ని వర్గాల్లో ఆందోళన
న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌, నరసన్నపేట, బృందం

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత భూఆక్రమణలకు కొదవ లేకుండా పోయింది. ఖాళీ జాగా కనిపిస్తే అధికార మదంతో కబ్జా చేసేస్తున్నారు. ప్రశ్నిస్తే వివాదాలకు దిగుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేసేందుకు జగన్‌ కొత్త ఎత్తుగడతో జనాల ముందుకు వస్తున్నారు. అరాచకాలకు అవకాశమిచ్చే ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం(ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌)ను తెరపైకి తెచ్చారు. ఆక్రమణలను అధికారికం చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే అందరికీ కొత్త కష్టాలు మొదలవుతాయి. తమ భూముల యజమానులు తామేనని నిరూపించుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పే పరిస్థితులు రానున్నాయి.


  • శ్రీకాకుళం గ్రామీణ మండలం ఒప్పంగి గ్రామానికి చెందిన శ్రీనివాసరావుకు చెందిన భూమిపై కొందరు వేరొకరి పేరు మీద తప్పుడు పత్రాలు సృష్టించారు. నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఇప్పటికీ ఆయనకు న్యాయం జరగలేదు. ఇలాంటి సమయంలో భూ యాజమాన్య హక్కు చట్టం అమలు చేస్తే పలుకుబడి ఉన్నవారికే ఆ భూమి సొంతమవుతుంది.

  • జలుమూరు మండల కేంద్రానికి చెందిన సురేశ్‌ ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో స్థిరపడ్డారు. డబ్బులు అవసరమై స్వగ్రామంలో పిత్రార్జితంగా వచ్చిన 60 సెంట్ల వ్యవసాయ భూమిని కుదవపెడదామని బ్యాంకుకు వెళ్లారు. అక్కడ మీ భూమిపై వివాదముందని.. అధికారుల నుంచి క్లియరెన్స్‌ పత్రం తీసుకురావాలని సూచించారు. టైటిలింగ్‌ చట్టం ప్రకారం ఆ భూమి సురేశ్‌కు చెందినదని సంబంధిత అధికారి ధ్రువపత్రం ఇచ్చే వరకు ఆయనకు బ్యాంకు నుంచి నయాపైసా రుణం రాదు.

  • ఎచ్చెర్లకు చెందిన అప్పలనాయుడుకు నాలుగెకరాల భూమి ఉంది. దానిపై హక్కుల కోసం టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి(టీఆర్‌వో) వద్దకు వెళ్లారు. అక్కడ న్యాయం జరగకపోవడంతో సివిల్‌ కోర్టుకు వెళ్లమని ఆయనకు కొందరు సలహా ఇచ్చారు. ఈ చట్టం అమల్లోకి వస్తే అది సాధ్యం కాదు. న్యాయం కావాలనుకుంటే నేరుగా హైకోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌ భూ యాజమాన్య హక్కు చట్టం-2023ను గతేడాది అక్టోబరు 31 నుంచి వైకాపా ప్రభుత్వం తెరపైకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ప్రభుత్వం నియమించే అధికారే భూములు, ఆస్తుల వివరాలు నమోదు చేసే హక్కు ఉంటుంది. ఆయన ఇచ్చిన ధ్రువపత్రం లేకపోతే భూ యజమాని ఆ స్థలంపై హక్కు కోల్పోయినట్లే. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కొన్ని నెలలుగా న్యాయవాదులు నిరసనలు చేస్తున్నా కనీసం పట్టించుకోలేదు. తమ ఆస్తులపై యాజమాన్య హక్కులు హరించేలా చట్టాన్ని రూపొందించడంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

హైకోర్టు వరకు వెళ్లాల్సిందే..

డిస్ప్యూట్‌ రిజిస్టర్‌లో భూహక్కుదారుని పేరు నమోదైతే వాటిపై సివిల్‌ కోర్టుకు వెళ్లడానికి వీలుండదు. ఏమైనా అభ్యంతరాలుంటే జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసే ట్రైబ్యునల్‌లో మాత్రమే తేల్చుకోవాలి. అక్కడ కూడా న్యాయం జరగకపోతే తీర్పు వచ్చిన 15 రోజుల్లోపు రాష్ట్రస్థాయి ట్రైబ్యునల్‌కు అప్పీలు చేసుకోవచ్చు. అక్కడా సమస్య పరిష్కారం కాకుంటే హైకోర్టుకు వెళ్లాల్సిందే.


ఆందోళన ఎందుకంటే..

  • భూముల రీ సర్వే పూర్తయితే ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కొత్త చట్టాన్ని అడ్డం పెట్టుకొని వైకాపా నాయకులు భూ యజమానుల పేర్లు మార్చేస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది.
  • భూవివాదాలు జిల్లాలోని సివిల్‌ కోర్టుల్లో పరిష్కరించుకునేందుకు వీలుండదు.
  • ఇప్పటి వరకు స్థలం కొనుగోలు సమయంలో ఒరిజినల్‌ పత్రాలుండేవి. ఇకపై యజమానులకు కేవలం జిరాక్స్‌ పత్రాలు మాత్రమే ఇవ్వనున్నట్లు చట్టం చెబుతోంది.
  • భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్పందన కార్యక్రమాల్లో ఎన్నిసార్లు వినతి పత్రాలిస్తున్నా ఆశించిన మేర ఫలితం ఉండట్లేదు. అలాంటిది వారికే భూములపై శాశ్వత హక్కులు కల్పించే బాధ్యత అప్పగిస్తే ఇబ్బందులు తప్పవనే ఆందోళన వెంటాడుతోంది.
  • యాజమాన్య హక్కు నిర్ధారించే వ్యక్తికి ఎలాంటి అధికారాలు ఉన్నాయి. వాటిని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారనే విషయంపై కూడా స్పష్టత ఇవ్వలేదు.

సామాన్యుల ఆస్తులకు భద్రత ఉండదు..
- టి.ఖగేంద్రనాథ్‌, సీనియర్‌ న్యాయవాది

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పూర్తిస్థాయిలో అమలైతే సామాన్యులు, చిన్న, సన్నకారు రైతుల ఆస్తులకు భద్రత ఉండదు. సుదూర ప్రాంతాల్లో ఉండేవారి భూములపై ఏమైనా ఫిర్యాదులు వస్తే వాటిని రెండేళ్లలోపు పరిష్కరించుకోవాలి. లేదంటే ఫిర్యాదుదారుకి దానిపై హక్కులు ఇస్తారు. దీనిపై న్యాయస్థానాలకు ఆశ్రయించే అవకాశముండదు. ట్రైబ్యునల్‌లో పరిష్కరించుకోవాలి. అక్కడ అనుకూలంగా లేకుంటే హైకోర్టులో ఫిర్యాదు చేసుకోవాలి. ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి.


అమలు చేయడానికి వీల్లేదు...
- కోట నారాంనాయుడు, రైతు, మూలపేట

పేద రైతుల భూములు కొట్టేసేందుకు ప్రభుత్వం చట్టం తీసుకురావడం దుర్మార్గమైన చర్య. మూలపేట పోర్టుకు భూములివ్వడానికి రైతులకు ఇష్టం లేకపోయిన ఏవో సాకులు చూపి 320 ఎకరాలు తీసుకున్నారు. ఈ చట్టం వచ్చాక భూ వివాదాలపై కోర్టుకు వెళ్లే హక్కు లేకపోతే పేదలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. రైతులను గందరగోళానికి  గురి చేస్తున్న చట్టాన్ని అమలు చేయడానికి వీల్లేదు.


అందరికీ ఇబ్బందులు తప్పవు..
- వాన కనకయ్య, విశ్రాంత వీఆర్వో, యలమంచిలి

పట్టాదారు పాసుపుస్తకాలపై పాలకుల చిత్రాలు ఉండటం ఇంతవరకు చూడలేదు. కొత్త చట్టం ద్వారా భూ యజమానులు న్యాయస్థానాలకు వెళ్లే హక్కులు లేకుండా చేయడం హేయమైన చర్య. ఇది అమలులోకి వస్తే అయిదు సెంట్లు ఉన్న రైతు నుంచి 500 ఎకరాల భూమి ఉన్నవారి వరకు అందరికీ ఇబ్బందులు తప్పవు.

జిల్లాలో వివరాలిలా..

మొత్తం వ్యవసాయ భూముల విస్తీర్ణం: 4,47,382 ఎకరాలు
రైతులు: 3,21,930
సొంత భూములు కలిగినవారు: 3,14,212
పోడు భూముల్లో సాగు చేసేవారు: 4,718
సర్వే నంబర్లు: 2,42,283

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని