logo

పదవులిచ్చిన పేటకు.. దాసన్న ద్రోహం..!

అభివృద్ధికి దూరంగా ఉన్న నరసన్నపేట నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని గత ఎన్నికల సమయంలో ధర్మాన కృష్ణదాస్‌ హామీలు గుప్పించారు. ఆ మాటలు నమ్మిన ప్రజలు ఓట్లు వేసి అందలమెక్కించారు. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి పదవులు అనుభవించినా సొంత నియోజకవర్గానికి ఆయన పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదు.

Published : 08 May 2024 05:16 IST

అమాత్య పదవి వరించినా ఒరిగింది శూన్యం
హామీలను విస్మరించారు..అభివృద్ధిని గాలికొదిలేశారు
ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం

అభివృద్ధికి దూరంగా ఉన్న నరసన్నపేట నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని గత ఎన్నికల సమయంలో ధర్మాన కృష్ణదాస్‌ హామీలు గుప్పించారు. ఆ మాటలు నమ్మిన ప్రజలు ఓట్లు వేసి అందలమెక్కించారు. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి పదవులు అనుభవించినా సొంత నియోజకవర్గానికి ఆయన పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదు. స్వలాభం తప్ప సమస్యల పరిష్కారం, అభివృద్ధికి ఏం చేయాలన్న అంశాలపై దృష్టి సారించకుండా ద్రోహం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ సైతం నరసన్నపేటకు వచ్చి రూ.కోట్లు మంజూరు చేసినట్లు ప్రగల్బాలు పలికినా అడుగు ముందుకు పడలేదు. మరోసారి తనను గెలిపించాలని దాసన్న ఊరూరూ తిరుగుతూ అభ్యర్థిస్తున్నారు. ఇదిలా ఉండగా దాటవేసిన హామీల మాటేమిటని ప్రజలు చర్చించుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో గతంలో ఆయన ఇచ్చిన హామీలు-ప్రస్తుత పరిస్థితిపై ప్రత్యేక కథనం.


ఆలయాన్ని వదిలేశారు..

శ్రీముఖలింగేశ్వర ఆలయంలో పూర్తి కాని మాడవీధుల పనులు

హామీ: శ్రీముఖలింగం ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం

ప్రస్తుత పరిస్థితి: తెదేపా హయాంలో మాడ వీధుల అభివృద్ధికి రూ.20 కోట్లతో 50 శాతం పనులు పూర్తి చేశారు. అప్పట్లో ప్రసాద్‌ పథకం కింద రూ.50 కోట్లతో అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అదనంగా రూ.నాలుగు కోట్లు కలిపారు తప్ప ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు, కార్తిక మాసంలో వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా పట్టనట్లు ఊరుకున్నారు.


కొలిక్కిరాని విస్తరణ

హామీ: నరసన్నపేట ప్రధాన రహదారిని ఆధునికీకరించి సెంటర్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తాం.

ప్రస్తుత పరిస్థితి: సుమారు మూడు కిలోమీటర్ల రహదారిని విస్తరించి ఆధునికీకరించడానికి ముఖ్యమంత్రి జగన్‌ రూ.10 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటి వరకు రూ.4.50 కోట్లు విడుదల చేశారు. 2020లో పనులు ప్రారంభించారు. రెండు వైపులా వదిలేసి మధ్యలో ఒక కిలోమీటరు మేర మాత్రమే పనులు చేశారు. నాలుగేళ్లలో మూడు కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తి చేయలేకపోవడాన్ని స్థానికులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.


చెరువు సంగతేంటి?

హామీ: నరసన్నపేటలో రాజుల చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.
ప్రస్తుత పరిస్థితి: గత ప్రభుత్వ హయాంలో రూ.50 లక్షలతో పనులు ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక వాటికి గండి పడింది. నరసన్నపేటలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ చెరువు అభివృద్ధికి రూ.10 కోట్లు ప్రకటించారు. ఇప్పటికీ పైసా రాలేదు. ఈ విషయమై హామీ ఇచ్చిన దాసన్న సమీక్షించిన దాఖలాలు లేవు.


‘కట్ట’లేకపోయారు..

హామీ: నరసన్నపేట, జలుమూరు, పోలాకి మండలాలకు వరద ముంపు లేకుండా కరకట్టలు నిర్మిస్తాం..

ప్రస్తుత పరిస్థితి: 54 కిలోమీటర్ల మేర కరకట్టల నిర్మాణానికి రూ.58 కోట్లు అవసరమని 2007 ప్రతిపాదనలు చేశారు. తెదేపా హయాంలో కొంతమేర పనులు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా తుంగలోకి తొక్కారు. కరకట్టల వైపు కన్నెత్తి చూడలేదు.


సాగు నీరివ్వకుండానే ఎన్నికలకు..

నిర్మాణ దశలో నిలిచిపోయిన బొంతు ఎత్తిపోతల పథకం

హామీ: సారవకోట మండలంలో బొంతు ఎత్తిపోతల పథకం పూర్తికి చర్యలు తీసుకుంటాం..
ప్రస్తుత పరిస్థితి: సారవకోట మండలంలో బొంతు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి సాగునీరు అందించాకే ఎన్నికలకు వెళ్తానని ధర్మాన కృష్ణదాస్‌ గత ఎన్నికల్లో బహిరంగంగానే హామీ ఇచ్చారు. ఐదేళ్లయినా నీరందించలేదు. ఈ పథకం అందుబాటులోకి వస్తే 11,700 ఎకరాల ఆయకట్టు, 69 గ్రామాలకు మేలు జరుగుతుంది. తెదేపా హయాంలో 60 శాతం పనులు పూర్తయ్యాయి. వైకాపా ప్రభుత్వం మిగిలిన వాటిపై దృష్టి సారించలేదు.


అసంపూర్తిగానే వంతెన..

హామీ: వనిత మండలం వంతెన నిర్మాణం పూర్తి చేస్తాం

ప్రస్తుత పరిస్థితి: గత ప్రభుత్వ హయాంలో వనిత మండలం వద్ద రూ.56 కోట్లతో గార-పోలాకి మండలాల మధ్య వంశధార నదిపై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు 60 శాతం పనులు పూర్తయ్యాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్క అడుగు ముందుకు పడలేదు. బిల్లులు బకాయిలు ఉండటంతో గుత్తేదారు మధ్యలోనే నిలిపేశారు. రెవెన్యూ మంత్రిగా పని చేసిన కృష్ణదాస్‌ బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోలేకపోయారు.


ప్రజా సమస్యల్ని పట్టించుకోలేదు..

అయిదేళ్లలో ధర్మాన కృష్ణదాస్‌ నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని చేయలేదు. ప్రజా సమస్యలను గాలికొదిలేశారు. ముఖ్యమంత్రి జగన్‌ నరసన్నపేటకు వచ్చినప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి రూ.కోట్లు మంజూరు చేశానన్నారు. ఒక్క రూపాయి ఇవ్వలేదు.

తంగి తారకేశ్వరరావు, బొరిగివలస, నరసన్నపేట మండలం


మాటలే.. చేతల్లో లేదు..

గత ఎన్నికల ముందు ధర్మాన కృష్ణదాస్‌, ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ పూర్తి చేయలేదు. తెదేపా హయాంలో మొదలుపెట్టిన పనులను సైతం పూర్తి చేయలేకపోయారు. మాటలే తప్ప చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు.

కేలం చిరంజీవి, నరసన్నపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని