logo

గ్రామాల్లో పర్యటనకు పళనిస్వామి ?

డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలోనూ, బయట విమర్శలు గుప్పిస్తూ అధికార పార్టీపై ఒత్తిడి పెంచుతున్న ప్రతిపక్ష నేత పళనిస్వామి, అన్నాడీఎంకేను బలోపేతం చేయడాన్ని తదుపరి లక్ష్యంగా ఎంచుకున్నారు. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 2024 లోక్‌ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించేలా అడుగులు వేయాలని భావిస్తున్నారు.

Updated : 19 May 2022 06:00 IST

లోక్‌సభ ఎన్నికల్లో అధిక స్థానాలే లక్ష్యం

ఇదే పార్టీలోని సమస్యలకు పరిష్కారమనే భావనలో ఎడప్పాడి

- సైదాపేట, న్యూస్‌టుడే

డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలోనూ, బయట విమర్శలు గుప్పిస్తూ అధికార పార్టీపై ఒత్తిడి పెంచుతున్న ప్రతిపక్ష నేత పళనిస్వామి, అన్నాడీఎంకేను బలోపేతం చేయడాన్ని తదుపరి లక్ష్యంగా ఎంచుకున్నారు. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 2024 లోక్‌ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించేలా అడుగులు వేయాలని భావిస్తున్నారు. తన నాయకత్వంపై దృఢమైన సంకేతాలను ప్రజల్లోకి, పార్టీ కార్యకర్తల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అందుకోసం గ్రామాల పర్యటనను శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్రామాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేయడం ద్వారా శశికళను నిలువరించి, పార్టీపై పట్టు కోల్పోకుండా నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు రూపొందించనున్నట్లు ఈపీఎస్‌ కోటరీలో

చర్చ జరుగుతోంది.

ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న ప్రతిపక్ష నేత పళనిస్వామి పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. డీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇతర పార్టీలకు చెందిన నేతలతో పాటు పశ్చిమ, దక్షిణ తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే నిర్వాహకులు పలువురు తమ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా డీఎంకేలో చేరుతుండగా మరి కొందరు కూడా అటుగా అడుగులు వేస్తున్నారు. దీంతో అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు ఈపీఎస్‌ కొత్త పంథా ఎంచుకున్నారు. గ్రామాల్లో పర్యటించి ప్రతి కార్యకర్తను కలవాలని నిర్ణయించారు. అన్నాడీఎంకేలో ఇటీవల అంతర్గత ఎన్నికలు ముగిశాయి. సమన్వయకర్తల నుంచి కింది స్థాయి నిర్వాహకులు, జిల్లా కార్యదర్శుల వరకు నియామకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్లే ఇద్దరిని ఎంపిక చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. రాజ్యసభ సీటు కోసం ఆశావహులు ఈపీఎస్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీ బలోపేతానికి సలహాలు ఇస్తున్నారు. ఇందులో గ్రామాల్లో పర్యటించాలన్న సలహా ఈపీఎస్‌ను ఆకర్షించినట్లు తెలుస్తోంది. దీంతో గ్రామాల వారీగా పర్యటించాలని ఈపీఎస్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

డీఎంకే వైఫల్యాలను ఎండగట్టేలా..

తాజాగా పన్నీర్‌పల్లం రాళ్ల క్వారీ ప్రమాదం, పత్తినూలు ధరల పెరుగుదల తదితర సమస్యలను పళనిస్వామి తనకు అనుకూలంగా మలచుకునేందుకు నిర్ణయించారు. నూలు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారికి సంఘీభావం తెలిపి మంచి ప్రతిపక్షం అనే పేరు సంపాదించాలన్నది ఈపీఎస్‌ ఆలోచన. తద్వారా డీఎంకేకు ఇబ్బందులు సృష్టించాలన్నది ఎడప్పాడి లక్ష్యంగా తెలుస్తోంది. డీఎంకే అధికారంలోకి వచ్చేందుకు స్టాలిన్‌ చేపట్టిన ‘‘నమక్కు నామే’’ పథకంలా ఈపీఎస్‌ గ్రామాల్లో పర్యటించి ప్రజలను ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారు. ఇది 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవశం చేసుకునేందుకు సహాయపడుతుందని పార్టీ నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

శశికళకు చెక్‌ పెట్టేలా

రాజకీయంగా శశికళ కదుపుతున్న పావులను కూడా ఈపీఎస్‌ క్షుణ్ణంగా గమనిస్తున్నారు. కొన్ని వారాల ముందు శశికళ ఆధ్యాత్మిక యాత్ర చేయగా, అన్నాడీఎంకే నిర్వాహకులు, కార్యకర్తలు కొందరు ఆమెను కలసి మాట్లాడారు. దీనికి తోడు అన్నాడీఎంకే భవిష్యత్‌లో తన నాయకత్వంలో పనిచేస్తుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శశికళ మద్దతుదారులు వల్ల అన్నాడీఎంకేలో చీలిక రాకూడదని ఈపీఎస్‌ భావిస్తున్నారు. గ్రామాల్లో పర్యటించడం ద్వారా చీలికలు నివారించవచ్చన్న ఆలోచనకు వచ్చారు. పార్టీలో ఈపీఎస్‌ ఆధిపత్యం ప్రారంభమైనప్పటి నుంచే దక్షిణ జిల్లాలకు చెందిన పార్టీ నిర్వాహకుల ప్రభావం తగ్గిందనే చెప్పాలి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీ ఓటమికి కారణం దక్షిణ జిల్లాల్లో తక్కువ నియోజకవర్గాలు దక్కటమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎస్‌ పర్యటన అక్కడ బలపడేందుకు దోహదపడుతుందని పార్టీలో చర్చసాగుతోంది. మొత్తంగా ఈ పర్యటన పార్టీలో తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకునేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందని ఈపీఎస్‌ భావిస్తున్నట్లు అన్నాడీఎంకే వర్గాల భోగట్టా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని