logo

వైభవంగా ఆడి వెల్లి

తిరువళ్ళూరులో పలు ఆలయాల్లో ఆడి వెల్లి పూజలు నిర్వహించారు. ఆడిమాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని వేంబులి అమ్మవారు, గోలకొండమ్మ, పడవేట్టమ్మ, పొన్నియమ్మ ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది.

Published : 13 Aug 2022 05:45 IST

తిరువళ్ళూరు: అలంకరణలో వీరరాఘవస్వామి

తిరువళ్ళూరు, న్యూస్‌టుడే: తిరువళ్ళూరులో పలు ఆలయాల్లో ఆడి వెల్లి పూజలు నిర్వహించారు. ఆడిమాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని వేంబులి అమ్మవారు, గోలకొండమ్మ, పడవేట్టమ్మ, పొన్నియమ్మ ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. భక్తులు పసుపునీటిని ఊరేగింపుగా తీసుకెళ్లి మూల విరాట్టులకు అభిషేకం చేశారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ప్రధాన వీధుల్లో ఊరేగించారు. వీరరాఘవస్వామి ఆలయంలో కనకవల్లి తాయారుకు, వీరరాఘవస్వామి మూల విరాట్టుకు తిరుమంజనసేవ, విశేష పూజలు చేశారు. శ్రీదేవి భూదేవి సమేత వీరరాఘవస్వామిని ప్రత్యేకంగా అలంకరించి వీధుల్లో ఊరేగించారు. తర్వాత వసంత మండపంలో కొలువుదీర్చి ఊంజల్‌ సేవ నిర్వహించారు.
వేలూర్‌, న్యూస్‌టుడే: ఆడి మాస చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. వేలూర్‌, తిరుప్పత్తూరు, రాణిపేట జిల్లాలోని అన్ని అమ్మవారి ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వేలూర్‌ కోట ప్రాంగణంలోని ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. వెట్టువాణం ఎల్లయమ్మన్‌ ఆలయం, కొత్త బస్టాండు సమీప పాలారు నదీ తీరంలో ఉన్న సెల్లియమ్మన్‌ ఆలయం, కాట్పాడి సమీప వంజూర్‌లో ఉన్న వంజి అమ్మవారిని ప్రత్యేకంగా అలకరించి పూజలు నిర్వహించారు.

వేంబులి అమ్మవారు

అళగర్‌ రథోత్సవం
ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: మదురై అళగర్‌ ఆలయంలో ఆడి బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవం నిర్వహించారు. ఈనెల 4 నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. పదిరోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో తొమ్మిదో రోజైన శుక్రవారం రథోత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రథోత్సవం జరిపారు. లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

భక్తుల రద్దీ
విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఆడి నెల చివరి శుక్రవారాన్ని పురస్కరించుకొని దిండిగల్లు నగరంలోని పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కోట్టైమారియమ్మన్‌ ఆలయంలో శుక్రవారం వేకువ జామునుంచే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనలు చేశారు. అభిరామి అమ్మన్‌ ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనానికి అనుమతించారు. అదేవిధంగా వైఎంఆర్‌ పట్టి, కాళియమ్మన్‌, నెహ్రూజీ నగర్‌ బన్నారి అమ్మన్‌ ఆలయం, ఆర్‌ఎం కాలనీ వెక్కాళి అమ్మన్‌ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.

భక్తిశ్రద్ధలతో అన్నకూట మహోత్సవం
చెన్నై(సాంస్కృతికం), న్యూస్‌టుడే: జార్జిటౌన్‌లోని శ్రీకన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అన్నకూట మహోత్సవం నిర్వహించారు. అన్నాన్ని అమ్మవారి మూలవిరాట్టు ముందు రాశిగా పోసి పిండి వంటలతో నైవేద్యం సమర్పించారు. ముందుగా శ్రీకన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల సింహ ద్వారంలో ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర పంతులు బృందం కలశ పూజ, 102 పాలబిందెల పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలక మండలి సభ్యులు ఊరా ఆంజనేయులు, ఊటుకూరు శరత్‌కుమార్‌, దేసు లక్ష్మీనారాయణ, గుగ్గిలం రమేష్‌లతోపాటు మహిళలు పాల బిందెలు తీసుకొని ఆలయం వరకు ఊరేగింపుగా వచ్చారు. అనంతరం మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు క్షీరాభిషేకం చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తిని పలు రకాల పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరించారు. వాసవి క్లబ్‌ సభ్యుల భక్తిగేయాలాపన వీనులవిందు కలిగించింది. పాలక మండలి సభ్యులు నాళం శ్రీకాంత్‌, డాక్టర్‌ జి.విజయ్‌కుమార్‌లు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని