logo

సామాజికంగానూ అభివృద్ధి జరగాలి: స్టాలిన్‌

ఆర్థికంగా మాత్రమే కాకుండా సామాజికంగానూ అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. అమెరికాలోని పెరియార్‌ సాంస్కృతిక సంస్థ, అమెరికా, కెనడా మానవత్వ సంస్థలు సంయుక్తంగా కెనడాలో మూడో సాంస్కృతిక మానవత్వ సామాజిక న్యాయం సదస్సు ఆదివారం నిర్వహించాయి.

Published : 26 Sep 2022 05:58 IST

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న సీఎం

చెన్నై, న్యూస్‌టుడే: ఆర్థికంగా మాత్రమే కాకుండా సామాజికంగానూ అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. అమెరికాలోని పెరియార్‌ సాంస్కృతిక సంస్థ, అమెరికా, కెనడా మానవత్వ సంస్థలు సంయుక్తంగా కెనడాలో మూడో సాంస్కృతిక మానవత్వ సామాజిక న్యాయం సదస్సు ఆదివారం నిర్వహించాయి. తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి స్టాలిన్‌ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పెరియార్‌ జయంతిని 17వ తేదీ మలేషియా, సింగపూర్‌, అమెరికా, ఆస్ట్రేలియా, మధ్య గల్ఫ్‌ దేశాలు, ఐరోపా దేశాలు తదితర పలు దేశాల్లో నిర్వహించారని తెలిపారు. తమిళులు ఎక్కువ సంఖ్యలో జీవించే దేశాల్లో కెనడా కూడా ఉందన్నారు. ప్రపంచస్థాయిలో సామాజిక న్యాయం గురించి మాట్లాడినవారే తిరువళ్లువర్‌, తందై పెరియార్‌ అని తెలిపారు. తిరువళ్లువర్‌ తమిళంలో తిరుక్కురళ్‌ను రాసినా నేడు ఆయన సూక్తులు ప్రపంచవ్యాప్తంగా 125కుపైగా భాషల్లో తర్జుమా అయ్యాయని పేర్కొన్నారు. తమిళ గడ్డపై పుట్టి తమిళంలో రాసి, మాట్లాడి, ప్రచారం చేసిన పెరియార్‌ కూడా నేడు ప్రపంచ తత్వవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందారని తెలిపారు. ఆయన పుస్తకాలు ఆంగ్లం, ఫ్రెంచ్‌, జర్మన్‌ తదితర పలు భాషల్లో అనువాదం అయ్యాయని తెలిపారు. పెరియార్‌ పుస్తకాలను 21 ప్రపంచ భాషల్లో అనువదించి ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. తిరువళ్లువర్‌ సూక్తులను, తందై పెరియార్‌ భావజాలాన్ని ప్రపంచస్థాయిలో తీసుకెళ్లడం ద్వారా మానవత్వ, సామాజికన్యాయ, సమాన న్యాయ ప్రపంచాన్ని రూపొందించడగలమని తెలిపారు.

‘పెరియార్‌ గొప్ప దార్శనికుడు’
పెరియార్‌ తన జీవితకాలంలో మలేషియా, సింగపూర్‌, శ్రీలంక, రష్యా, టర్కీ, జర్మనీ, స్పెయిన్‌ తదితర పలు దేశాలు పర్యటించారని, హేతువాదం గురించి మాట్లాడారని పేర్కొన్నారు. ఆయన లోకాన్ని గ్రహించారని, భవిష్యత్తులో ఈ ప్రపంచం ఎలా ఉంటుందని అంచనా వేసిన దార్శనికుడని తెలిపారు. భవిష్యత్తులో విమానాలు ఉంటాయని, వైర్‌లెస్‌ పరికరాలు ప్రతి ఒక్కరి జేబుల్లోనూ ఉంటాయని, రూపాన్ని తంతీలో పంపే పరికరం ఉంటుందని, ఎక్కడున్నా పరస్పరం రూపాన్ని చూసుకుని మాట్లాడొచ్చని, ఒక చోట నుంచే పలు ప్రాంతాల్లోని ప్రజలకు విద్యను బోధించవచ్చని, పిల్లలు కనేందుకు స్త్రీ, పురుషుల కలయిక అవసరం ఉండదని, పెట్రోల్‌కు బదులు విద్యుత్తును ఉపయోగించవచ్చంటూ 1943లోనే వెల్లడించారని పేర్కొన్నారు. సొక్రటీస్‌, మార్క్స్‌, లెనిన్‌ తదితర ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తల పుస్తకాలను 80 ఏళ్లకు ముందే తమిళంలో అనువదించారని తెలిపారు. అలాంటి పెరియార్‌కు శిష్యులైన అన్నాదురై, కరుణానిధి మార్గంలో తన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నానని పేర్కొన్నారు. అన్నిచోట్ల సామాజిక న్యాయాన్ని నెలకొల్పామని తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పథకాలను వివరించారు. పరిశ్రమల అభివృద్ధి, సామాజిక మార్పు, విద్యాభివృద్ధి వంటివి ఏకకాలంలో జరగాలన్నారు. అభివృద్ధి అనేది ఆర్థికంగా మాత్రమే కాకుండా సామాజికంగా ఉండాలని తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు తమిళనాడు ద్రావిడ మోడల్‌ సిద్ధాంతాలు, విధానాలు తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ద్రావిడర్‌ కళగం అధ్యక్షుడు వీరమణి, కెనడా మానవత్వ సంస్థ అధ్యక్షుడు మార్టిన్‌ ప్రీత్‌, పెరియార్‌ సాంస్కృతిక సంస్థ నిర్వాహకుడు సోమ ఇళంగోవన్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రేమా శ్రీనివాసన్‌ మృతికి సంతాపం
చెన్నై: టీవీఎస్‌ సంస్థ ఛైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ తల్లి ప్రేమా శ్రీనివాసన్‌ మృతికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ సంతాపం తెలిపారు. ఆమె మృతి ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు. ఆమెను కోల్పోయి బాధపడుతున్న వేణు శ్రీనివాసన్‌, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని