logo

ప్రియుడు మాట్లాడలేదని ప్రియురాలి ఆత్మహత్య

తిరుపత్తూర్‌ సమీపంలో ప్రియుడు మాట్లాడలేదని ప్రియురాలు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుపత్తూర్‌ జిల్లా నాట్రాంపల్లి కరుణానిధి నగర్‌కు చెందిన శరణ్య (23) కృష్ణగిరిలోని ప్రైవేటు కళాశాలలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతోంది.

Published : 26 Nov 2022 00:24 IST

వేలూర్‌, న్యూస్‌టుడే: తిరుపత్తూర్‌ సమీపంలో ప్రియుడు మాట్లాడలేదని ప్రియురాలు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుపత్తూర్‌ జిల్లా నాట్రాంపల్లి కరుణానిధి నగర్‌కు చెందిన శరణ్య (23) కృష్ణగిరిలోని ప్రైవేటు కళాశాలలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన సైనికుడైన అరుణ్‌, ఆమె ప్రేమించుకున్నారు. వారు మధ్య గొడవ జరగడంతో శరణ్యతో అతడు మాట్లాడటం మానేశాడు. మనస్తాపంతో శరణ్య ఈ నెల 11వ తేదీన శీతల పానీయంలో విషం కలుపుకొని తాగుతూ తన చావుకు అరుణ్‌ కారణమని సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసింది. తర్వాత స్పృహ కోల్పోవడంతో చికిత్స కోసం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స ఫలించక గురువారం రాత్రి మృతి చెందింది. నాట్రాంపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శరణ్య తీసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వెన్ను నొప్పి భరించలేక వృద్ధుడు...

విల్లివాక్కం, న్యూస్‌టుడే: నామక్కల్‌ జిల్లా పరమత్తివేలూర్‌ సమీపం కాట్టూర్‌ అరుంధతీయర్‌ వీధికి చెందిన పాప్పాన్‌ (65) రెండేళ్ల నుంచి వెన్నెముక నొప్పితో బాధపడుతున్నారు. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా నయం కాలేదు. అతను గురువారం సాయంత్రం నొప్పి భరించలేక పురుగుల మందు తాగాడు. స్థానికులు నామక్కల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు.

వారసత్వ ఉద్యోగం కోసం తండ్రిని చంపిన తనయుడు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: వారసత్వంగా ఉద్యోగం పొందేందుకు కన్న తండ్రినే కొట్టి చంపాడు ఓ కసాయి పుత్రుడు. పోలీసుల వివరాల మేరకు... దిండిగల్లు జిల్లా కొడైక్కానల్‌ పట్టణంలోని కామరాజర్‌సాలైకి చెందిన నటరాజన్‌ (55) మున్సిపాలిటీలో శుభ్రతా కార్మికుడు. ఈయన కుమారుడు దినేష్‌ (27) మద్యానికి బానిసై ఏ పని లేకుండా తిరుగుతున్నాడు. మద్యం మత్తులో తరచూ తండ్రితో గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో గురువారం మళ్లీ తండ్రితో గొడవపడ్డాడు. ఆక్రోశంతో తండ్రిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నటరాజన్‌ను చుట్టుపక్కలవారు కొడైక్కానల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దినేష్‌ని అరెస్టు చేశారు. దర్యాప్తులో.. తనకు ఉద్యోగం లేదని, తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద ఉద్యోగం వస్తుందన్న ఆశతో చంపినట్లు నిందితుడు తెలిపాడు.

భార్య మృతదేహంపై కూర్చొని భర్త విచిత్ర ప్రవర్తన

వేలూర్‌, న్యూస్‌టుడే: ఓ గ్రామంలో భార్య మృతదేహం ఖననం కోసం తవ్విన గుంతలో కూర్చొని భర్త విచిత్రంగా ప్రవర్తించాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తిరుపత్తూర్‌ సమీపం పసలికుట్టైకు చెందిన రాజాదేశింగు, పూర్ణిమ (25) దంపతులు. వీరికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె 5 నెలల గర్భవతి. ఈ నెల 22వ తేదీన ఇంటి సమీపంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. బుధవారం పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. శ్మశానంలో ఖననం చేయడానికి గుంత తవ్వారు. మృతదేహాన్ని అందులో పెట్టాక... రాజాదేశింగు ఉప్పు కుమ్మరించి, నగ్నంగా తయారై తన ఒంటికి కూడా పూసుకొన్నాడు. మృతదేహంపై కూర్చొని కేకలు పెట్టాడు. తర్వాత బయటకు వచ్చాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. గ్రామస్థులు మాట్లాడుతూ... కొద్ది సంవత్సరాల క్రితం స్వామిగా రాజాదేశింగు తనను తాను చెబుతూ పూజలు నిర్వహించేవాడని తెలిపారు. ఇప్పుడు ఇలా ప్రవర్తించడంతో ఆందోళనకు గురయ్యామని పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తును ఆర్డీవోకు అప్పగించారు.

నకిలీ పోలీసు అరెస్టు

ప్యారిస్‌, న్యూస్‌టుడే: పోలీసునని బెదిరించి ఓ యువకుడి వద్ద రూ.25 వేలు తీసుకున్న వ్యక్తిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు... చెన్నై ఆరుంబాక్కం ఎమ్‌ఎమ్‌డీఏ కాలనీకి చెందిన కేశవన్‌ ఈనెల 22వ తేదీ రాత్రి ఎతిరాజ్‌రోడ్‌ పోస్టాఫీస్‌ వద్ద సిగరెట్‌ తాగుతున్నాడు. అప్పుడు అటుగా వచ్చిన ఓ వ్యక్తి కేశవన్‌ దగ్గరకు వెళ్లి తాను పోలీసునని బహిరంగ ప్రదేశంలో సిగరెట్‌ తాగినందుకు రూ.25 వేలు జరిమానా చెల్లించాలని, లేకుంటే అరెస్టు చేస్తానిని బెదిరించాడు. దీంతో భయపడిన కేశవన్‌ ఏటీఎంలోంచి రూ.25 వేలు తీసిచ్చాడు. నగదు తీసుకున్న అతను వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. అనుమానం వచ్చిన బాధితుడు ఎగ్మూర్‌ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసి నెర్కుండ్రానికి చెందిన డాన్‌ స్టువర్ట్‌ను అరెస్టు చేశారు. హోంగార్డుగా పనిచేస్తూ నాలుగు నెలల క్రితం మానేసినట్లు తెలిసింది. అతని నుంచి రూ.44 వేల నగదు, ఓ సెల్‌ఫోన్‌, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. అతనిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్లు శుక్రవారం పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని