logo

వంద సభల నిర్వహణకు నిర్ణయం

డీఎంకే దివంగత ప్రధానకార్యదర్శి అన్బళగన్‌ శతజయంతి ముగింపు వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వంద ప్రత్యేక బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశం తీర్మానించింది.

Published : 02 Dec 2022 00:03 IST

సమావేశంలో ప్రసంగిస్తున్న స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: డీఎంకే దివంగత ప్రధానకార్యదర్శి అన్బళగన్‌ శతజయంతి ముగింపు వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వంద ప్రత్యేక బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశం తీర్మానించింది. అధ్యక్షుడైన ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధ్యక్షతన గురువారం ఈ కార్యక్రమం జరిగింది. తేనాంపేటలోని పార్టీ ప్రధానకార్యాలయమైన అన్నా అరివాలయం వేదికైంది. అన్బళగన్‌ శతజయంతి ప్రారంభ వేడుకల సందర్భంగా చెన్నై నందనంలోని సమీకృత న్యాయశాఖ ప్రాంగణంలో గత ఏడాది డిసెంబరు 19న ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ప్రాంగణానికి ‘పేరాసిరియర్‌ అన్బళగన్‌ మాళిగై’ పేరు పెట్టినందుకు స్టాలిన్‌కు సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. డీపీఐ ప్రాంగణంలోనూ అన్బళగన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు, ఆ ప్రాంగణానికి ‘పేరాసిరియర్‌ అన్బళగన్‌ కల్వి వళాగం’ అని పేరు పెట్టనున్నట్టు ప్రకటించడంపైనా హర్షం వ్యక్తం చేసింది. శతజయంతి ముగింపు వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 15వ తేదీన 100 ప్రత్యేక బహిరంగ సభలు నిర్వహించాలని తీర్మానించారు. అన్నా అరివాలయంలోని కలైజ్ఞర్‌ ఆడిటోరియంలో 17వ తేదీన అన్బళగన్‌ జీవితాన్ని కీర్తించేలా కవి సమ్మేళనం, 18న ఉత్తర చెన్నైలో సెక్యులర్‌ ప్రొగ్రెసివ్‌ అలయన్స్‌ నేతలతో సమావేశం, 19న పార్టీలోని విభాగాలు. అనుబంధ సంస్థల తరఫున అన్బళగన్‌కు నీరాజనాలు అర్పించాలని తీర్మానించారు. సమావేశంలో పార్టీ ప్రధానకార్యదర్శి దురైమురుగన్‌, కోశాధికారి టీఆర్‌ బాలు, ఉప ప్రధానకార్యదర్శి కనిమొళి, జిల్లా కార్యదర్శులు సుబ్రమణియన్‌, శేఖర్‌బాబు, మాధవరం సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని