logo

అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె శివగంగైలో నామినేషన్‌

అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె స్వతంత్ర అభ్యర్థిగా శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్‌ దాఖలు చేయడం కలకలం సృష్టించింది.

Published : 29 Mar 2024 01:24 IST

పార్టీ శ్రేణుల దిగ్భ్రాంతి

స్వతంత్ర అభ్యర్థిగా నామపత్రం అందిస్తున్న ధనలక్ష్మీ

ప్యారిస్‌, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె స్వతంత్ర అభ్యర్థిగా శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్‌ దాఖలు చేయడం కలకలం సృష్టించింది. శివగంగైలో డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్‌ తరఫున కార్తి చిదంబరం, అన్నాడీఎంకే నుంచి సేవియర్‌దాస్‌, భాజపా కూటమి తరఫున దేవనాథన్‌ యాదవ్‌, నామ్‌ తమిళర్‌ కట్చి నుంచి ఎళిలరసి బరిలో ఉన్నారు. శివగంగై లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కారైక్కుడి, తిరుప్పత్తూర్‌, శివగంగై, మానామదురై, పుదుక్కోట్టైలోని తిరుమయం, ఆలంగుడి శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆలంగుడి స్థానం నుంచి 1984లో అన్నాడీఎంకే తరఫున పోటీచేసి గెలుపొందిన వెంకటాచలం అనంతరం 1996లో స్వతంత్ర అభ్యర్థిగా, ఆ తర్వాత 2001లో మళ్లీ అన్నాడీఎంకే తరఫున బరిలో నిలిచి విజయం సాధించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మంత్రివర్గంలో మంత్రిగా కూడా విధులు నిర్వహించిన ఆయన 2010లో హత్యకు గురయ్యారు. ఆయన కుటుంబానికి ఆలంగుడి నియోజకవర్గంలో ఇప్పటికీ మంచి పలుకుబడి ఉంది. ఆయన కుమార్తె ధనలక్ష్మీ తమిళ్‌ ముత్తరైయర్‌ వాళ్వురిమై సంఘ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఉన్నారు. అన్నాడీఎంకే తరఫున సేవియర్‌దాస్‌ అభ్యర్థిగా ప్రకటించి నామినేషన్‌ దాఖలు చేయగా బుధవారం సాయంత్రం స్వతంత్ర అభ్యర్థిగా ధనలక్ష్మీ నామపత్రం అందించడం జిల్లాలోని అన్నాడీఎంకే నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది.


కార్తి చిదంబరంపై అసంతృప్తి..

కార్తి చిదంబరం అభ్యర్థిత్వానికి స్థానిక నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత రాగా ఆయన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం పలుకుబడితో టికెట్‌ ప్రకటించారు. కార్తి చిదంబరంపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు మరో పార్టీకి ఓటు వేయడానికి ఇష్టపడితే ధనలక్ష్మీకి ఆ అవకాశం ఉందని శివగంగై నియోజకవర్గ రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని