logo

తెన్‌కాశిలో నెగ్గేదెవరు?

పశ్చిమ కనుమల్లోని తెన్‌కాశి నియోజకవర్గం పునర్విభజనకు ముందు పూర్తిగా తిరునెల్వేలి జిల్లాలో ఉండేది. ఆ తర్వాత తెన్‌కాశి, కడైయనల్లూర్‌, వాసుదేవనల్లూర్‌(రిజర్వు), శంకరన్‌కోవిల్‌(రిజర్వు), విరుదునగర్‌లోని శ్రీవిల్లిపుత్తూర్‌(రిజర్వు),

Published : 18 Apr 2024 01:22 IST

కుట్రాలం జలపాతం

ప్యారిస్‌, న్యూస్‌టుడే: పశ్చిమ కనుమల్లోని తెన్‌కాశి నియోజకవర్గం పునర్విభజనకు ముందు పూర్తిగా తిరునెల్వేలి జిల్లాలో ఉండేది. ఆ తర్వాత తెన్‌కాశి, కడైయనల్లూర్‌, వాసుదేవనల్లూర్‌(రిజర్వు), శంకరన్‌కోవిల్‌(రిజర్వు), విరుదునగర్‌లోని శ్రీవిల్లిపుత్తూర్‌(రిజర్వు), రాజపాళెయం శాసనసభ నియోజకవర్గాలతో ఏర్పాటైంది. 39 లోక్‌సభ స్థానాల్లో తెన్‌కాశి(రిజర్వు) 37వ నియోజకవర్గం.

వరుసగా తొమ్మిదిసార్లు..

ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌ కంచుకోట. 1957 నుంచి 1991 వరకు వరుసగా తొమ్మిదిసార్లు ఆ పార్టీ విజయభేరి మోగించింది. ఆ పార్టీకి చెందిన అరుణాచలం వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. ఆ తర్వాత 1996లో జీకే మూపనార్‌ నేతృత్వంలోని టీఎంసీ గెలుపొందింది. ఈ పార్టీ తరఫున పోటీచేసిన అరుణాచలమే ఆరోసారి కూడా గెలుపొందారు. అనంతరం జరిగిన మూడు ఎన్నికల్లో ఒకసారి అన్నాడీఎంకే, రెండుసార్లు సీపీఐ విజయం సాధించింది. 2019లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి డీఎంకే గెలుపొందింది. డీఎంకే తరఫున పోటీచేసిన ధనుష్‌ ఎం.కుమార్‌ 4,76,156 ఓట్లు పొందారు. అన్నాడీఎంకే అభ్యర్థి అయిన పుదియ తమిళగం కట్చి అధ్యక్షుడు కృష్ణసామి కంటే 1,20,286 ఓట్లు అధికంగా పొందారు.

నలుగురి మధ్య తీవ్ర పోటీ..

డీఎంకే తరఫున ఈసారి ధనుష్‌ ఎం.కుమార్‌కు అవకాశం దక్కలేదు. శంకరన్‌కోవిల్‌కి చెందిన డాక్టర్‌ రాణి శ్రీకుమార్‌ను బరిలోకి దింపారు. వరుసగా ఆరుసార్లు పోటీచేసి పరాజయంపొందిన పుదియ తమిళగం కట్చి అధ్యక్షుడు కృష్ణసామి ప్రస్తుతం ఏడోసారి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. భాజపా తరఫున తమిళగ మక్కల్‌ మున్నేట్ర కళగం అధ్యక్షుడు జాన్‌పాండియన్‌ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నామ్‌ తమిళర్‌ కట్చి తరఫున గతసారి పోటీచేసిన ఇసై మదివాణన్‌ను మళ్లీ నిలిపారు. స్వతంత్ర అభ్యర్థుల సహా మొత్తం 15 మంది పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌, ఎండీఎంకే, కమ్యూనిస్టులు, వీసీకేల బలాన్ని నమ్ముకుని డీఎంకే బరిలో ఉంది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా ప్రచారం చేశారు. పుదియ తమిళగం కట్చి అధ్యక్షుడు కృష్ణసామి, తమిళగ మక్కల్‌ మున్నేట్ర కళగం అధ్యక్షుడు జాన్‌పాండియన్‌లు తమ కూటమి పార్టీల బలాన్ని నమ్ముకుని ముందుకెళుతున్నారు. నెరవేరని హామీలు..

నియోజకవర్గంలోని చాలామందికి వ్యవసాయమే ప్రధాన వృత్తి. శంకరన్‌కోవిల్‌లోని చేనేత పరిశ్రమపై ఆధారపడి పలువురు జీవనం సాగిస్తున్నారు. జలపాతాలకు పేరొందిన కుట్రాలంలో జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో పర్యాటకరంగం ఆ ప్రాంత ప్రజలకు చేయూతనిస్తుంది. కుట్రాలంను అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం. జౌళి పార్కు ఏర్పాటు, పశ్చిమ కనుమల్లోని సెన్బగవల్లి చెక్‌డ్యామ్‌ మరమ్మతులు, వైద్య కళాశాల ఏర్పాటు తదితరమైనవి ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లుగా ఉన్నాయి. వాటిపై రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చినా నెరవేరలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని