logo

చిన్నారిపై పెంపుడు కుక్కల దాడి

పార్కులో ఐదేళ్ల చిన్నారిపై రెండు పెంపుడు కుక్కలు దారుణంగా దాడిచేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది.

Published : 07 May 2024 00:18 IST

తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స
ముగ్గురి అరెస్టు

ఘటన జరిగిన కార్పొరేషన్‌ పార్కు

చెన్నై: పార్కులో ఐదేళ్ల చిన్నారిపై రెండు పెంపుడు కుక్కలు దారుణంగా దాడిచేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించారు. కుక్కల యజమాని, భార్య, కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. థౌజండ్‌లైట్స్‌లోని మోడల్‌ స్కూల్‌ రోడ్డులో ఉన్న కార్పొరేషన్‌ పార్కుకు ఆదివారం సాయంత్రం రాట్‌వీలర్‌ జాతి కుక్కలతో అదే ప్రాంతానికి చెందిన పుగళేంది వచ్చాడు. అక్కడి ఓ గదిలో ఉన్న పార్కు కాపలాదారుడు రఘు కుమార్తె సుదక్ష(5)పై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. శరీరంపై పలుచోట్ల కరిచాయి. తల, జుట్లు భాగాన్ని గట్టిగా కొరికి లాగేశాయి. ప్రత్యక్షంగా చూసిన పార్కులోని సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. తర్వాత ధైర్యం చేసి చిన్నారిని వాటి నుంచి రక్షించి ప్రభుత్వ ఆస్పత్రిల, తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దాడిలో చిన్నారి తలపై జుట్లు సహా చర్మం కొంతభాగం వేరైంది. రఘు తన సమీప బంధువు మృతితో విళుపురం వెళ్లగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుమార్తెను కాపాడే సమయంలో సుదక్ష తల్లి సోనియా కూడా గాయపడింది.

గొలుసుల్లేవు..

కుక్కల యజమాని పుగళేంది అదే ప్రాంతంలో రక్తనిధి నిర్వహిస్తున్నాడు. రాట్‌వీలర్‌ జాతి కుక్కలతో సంతానాభివృద్ధి చేయించి వాటి పిల్లలను విక్రయిస్తున్నాడు. కుక్కల మెడకు గొలుసు వేయకుండా స్వేచ్ఛగా విడిచిపెట్టడంతో ఇప్పటికే స్థానికులు ఇద్దరిని కరిచినట్లు సమాచారం. పార్కుకు తీసుకొచ్చినప్పుడు కుక్కల మెడకు గొలుసులు లేవని తెలిసింది. పుగళేందిని దర్యాప్తు కోసం థౌజండ్‌లైట్స్‌ పోలీసులు తీసుకెళ్లారు. సోమవారం ఉదయం ఆయన్ను అరెస్టు చేశారు. భార్య ధనలక్ష్మీ, కుమారుడు వెంకటేశన్‌నూ అరెస్టు చేశారు.

కింద పడి ఉన్న బెల్టు

చిన్నారికి వైద్యసాయం

బాధిత చిన్నారికి ప్లాస్టిక్‌ సర్జరీ అవసరమని, అందుకయ్యే ఖర్చును కార్పొరేషన్‌ యంత్రాంగం భరించనుందని జీసీసీ కమిషనర్‌ డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ తెలిపారు. కేంద్రప్రభుత్వం నిషేధించిన 23 కుక్కల జాతిలో రాట్‌వీలర్‌ కూడా ఒకటన్నారు. అలాంటి జాతి సంతానాభివృద్ధి కూడా చేయకూడదని తెలిపారు. లైసెన్సు లేకుండా రాట్‌వీలర్‌ కుక్కలను పుగళేంది పెంచుతున్నారని, కార్పొరేషన్‌ యంత్రాంగం నోటీసు పంపిందని పేర్కొన్నారు. ఇళ్లల్లో కుక్కలు, పిల్లులు, పక్షులను పెంచడానికి కచ్చితంగా లైసెన్సు తీసుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని