logo

Vizag: పెళ్లిరోజే తిరిగిరాని లోకాలకు..

వైవాహిక జీవితంలో పదేళ్ల మైలురాయి చేరే తరుణం.. ఆ ఇల్లాలు నాలుగు నెలల గర్భిణి కావడంతో ఎంతో సంతోషంగా వేడుకలకు సిద్ధమైన కుటుంబానికి అంతులేని ఆవేదనే మిగిలింది

Updated : 25 May 2023 09:14 IST

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: వైవాహిక జీవితంలో పదేళ్ల మైలురాయి చేరే తరుణం.. ఆ ఇల్లాలు నాలుగు నెలల గర్భిణి కావడంతో ఎంతో సంతోషంగా వేడుకలకు సిద్ధమైన కుటుంబానికి అంతులేని ఆవేదనే మిగిలింది. అనారోగ్యం కారణంగా ఆ ఇంటి దీపం దూరమవడం అందరినీ శోకసంద్రంలో ముంచేసింది. గొలుగొండ మండలం అమ్మపేటలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అమ్మపేటకు చెందిన కొరుపోలు కృష్ణవేణి (28) లింగంపేట సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తోంది. ఈమెకు పదేళ్ల క్రితం గొర్లి నాయుడుతో వివాహమైంది. ఆయన కాకినాడ జిల్లా తుని కారాగారంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు.

మంగళవారం ఎప్పటిలాగే సచివాలయంలో విధులకు వెళ్లి ఇంటికి వచ్చిన కృష్ణవేణికి తీవ్రంగా కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నర్సీపట్నం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలిస్తుండగా బుధవారం తెల్లవారుజామున మార్గమధ్యంలో మృతి చెందింది. బుధవారం కృష్ణవేణి, నాయుడు దంపతుల పెళ్లిరోజు. ఎంతో ఆనందంగా వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆమెను మృత్యువు వెంటాడిందని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. విధి నిర్వహణలో అందరితో కలివిడిగా మెలిగే కృష్ణవేణి మృతిచెందడం పట్ల సహచర ఉద్యోగులు, స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. కృష్ణవేణి మృతదేహానికి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సహచర ఉద్యోగులు నివాళులు అర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని