logo

ప్రయాణికులేమైపోనీ.. ఆర్టీసీకేల..!

ప్రయాణికుల సేవలో తరలించాల్సిన ఆర్టీసీ అధికారులు వైకాపా అడుగులకు మడుగులు వొత్తుతున్నారు. సుమారు 460 కి.మీ. దూరంలో ఉన్న మేదరమెట్లలో ఆదివారం జరిగిన సిద్ధం సభకు నగరం నుంచి 100 వరకు బస్సులను తరలించేశారు.

Updated : 11 Mar 2024 04:09 IST

వైకాపా సిద్ధం సభకు బస్సుల తరలింపు

ఖాళీగా దర్శనమిస్తున్న ద్వారకా బస్‌స్టేషన్‌

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ప్రయాణికుల సేవలో తరలించాల్సిన ఆర్టీసీ అధికారులు వైకాపా అడుగులకు మడుగులు వొత్తుతున్నారు. సుమారు 460 కి.మీ. దూరంలో ఉన్న మేదరమెట్లలో ఆదివారం జరిగిన సిద్ధం సభకు నగరం నుంచి 100 వరకు బస్సులను తరలించేశారు. దీంతో ఆదివారం నగరంలో సిటీ బస్సుల కొరత ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సు పాసులు కలిగినవారు సైతం ఆటోల్లో వెళ్లాల్సి వచ్చింది. బస్సుల్లేక పోవడంతో ఆదివారం సాయంత్రం నగరంలో సందడి కనిపించలేదు. శ్రీకాకుళం, విజయనగరం, టెక్కలి, పలాస, చీపురుపల్లి, రాజాం, పాలకొండ, పార్వతీపురం, సాలూరు ప్రాంతాలకు బస్సులు అరకొరగా నడవడంతో ద్వారకా బస్‌స్టేషన్‌లో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లేవారు జీపులు, ఇతర వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రయాణికుల తాకిడి చూసిన ప్రయివేటు వాహదారులు ఛార్జీలను అమాంతం పెంచేశారు. రూ.20 నుంచి రూ.70 వరకు అదనంగా వసూలు చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రయాణికులు చేతి చమురు వదిలించుకుని గమ్యస్థానాలకు చేరాల్సి వచ్చింది.

నేడు విద్యార్థులకు కఠిన పరీక్ష: సిద్ధం సభకు వెళ్లిన సిటీ బస్సులు సోమవారం మధ్యాహ్నానికి నగరానికి చేరుకునే అవకాశాలున్నాయి. అంటే సాయంకాలం తర్వాత అవి అందుబాటులోకి వస్తాయి. ఉదయం ఇంటర్‌ విద్యార్థులకు పరీక్ష ఉంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ఈ తరుణంలో బస్సులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు కలవరం చెందుతున్నారు. దూర ప్రాంతాలకు చెందిన వారు రెండు గంటల ముందుగానే ఇళ్ల నుంచి బయల్దేరాల్సి వస్తోంది. తిరుగు ప్రయాణంలో ఇళ్లకు వెళ్లడానికి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సాధారణంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగే రాజకీయ సభలకు ఇక్కడి బస్సులను తరలిస్తుంటారు. కాని ఎక్కడో ప్రకాశం జిల్లాలో జరిగిన సభకు కూడా విశాఖ నుంచి బస్సులు పంపిస్తుండడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఎన్నికల సమయంలో సీఎం జగన్‌ తన బలాన్ని చూపించుకోవడానికి తమను తీవ్ర ఇబ్బందులను గురి చేస్తున్నారని ప్రయాణికులు, విద్యార్థులు మండిపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని