logo

ఆటల ప్రాజెక్టు.. అటకెక్కించిన జగన్‌..!

‘గమ్య నగరి’గా పేరుగాంచిన విశాఖలో భారీ సమీకృత క్రీడల ప్రాంగణం (ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌) నిర్మించాలని గత తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ప్రతిపాదనలూ సిద్ధం చేసింది.

Published : 05 May 2024 04:00 IST

‘సమీకృత క్రీడా ప్రాంగణం’పై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం

స్థలాన్ని పరిశీలిస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు (పాత చిత్రం)

‘గమ్య నగరి’గా పేరుగాంచిన విశాఖలో భారీ సమీకృత క్రీడల ప్రాంగణం (ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌) నిర్మించాలని గత తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ప్రతిపాదనలూ సిద్ధం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం క్రీడా మైదానం నిర్మాణానికి మోకాలడ్డింది. ఇక్కడే రాజధాని ఏర్పాటు చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. క్రీడా మైదానానికి సహకరించకపోవడంతో క్రీడాకారుల ఆశలు ఆవిరయ్యాయి.

న్యూస్‌టుడే, అగనంపూడి:

రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌ గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ తరహాలో సమీకృత క్రీడల ప్రాంగణం ఏర్పాటుకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  నిర్ణయించారు. ఆ మేరకు అధికారులు నగర పరిధిలో వివిధ చోట్ల స్థలాలు పరిశీలించారు.

  • క్రీడా ప్రాంగణంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాల కల్పనకు నాటి వుడా (ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ) సహకారంతో సుమారు రూ.400 కోట్ల నిధులతో ప్రణాళికలు సిద్ధం చేశారు.
  • ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్టేడియాలు నిర్మించి క్రీడాకారులకు తర్ఫీదు ఇవ్వడానికి వీలుగా అభివృద్ధి చేస్తామన్నారు. షాపింగ్‌ కోసం మల్టీఫ్లెక్స్‌లు నిర్మిస్తామన్నారు.
  • అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహణకు మైదానాలను సిద్ధం చేసి, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, షటిల్‌, హాకీ, బాక్సింగ్‌, కబడ్డీ, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌.. తదితర క్రీడాంశాలకు అవకాశం కల్పిస్తామన్నారు.

స్థలాల పరిశీలన

  • తొలుత ఆనందపురం మండలం గండిగుండంలో 79 ఎకరాలు గుర్తించారు. ప్రపంచ స్థాయి సౌకర్యాల కల్పనకు ఆ స్థలం సరిపోదని, సరైన రవాణా సౌకర్యాలు లేవని వెనక్కి తగ్గారు. ఆ తర్వాత అగనంపూడి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఖాళీ భూములు క్రీడా ప్రాంగణానికి అనుకూలంగా ఉంటాయని భావించారు. అవి ఉక్కు యాజమాన్యం ఆధీనంలో ఉండడంతో భూ బదలాయింపునకు నిర్ణయించారు.
  • అగనంపూడిలోని 150 ఎకరాలను తీసుకుని, దానికి బదులుగా పెదగంట్యాడ మండలం పరిధిలో అంతే విస్తీర్ణం కలిగిన ప్రభుత్వ భూమిని స్టీల్‌ప్లాంట్‌కు అప్పగించేలా కార్యాచరణ రూపొందించారు. దీంతో అప్పటి రాష్ట్ర యువజన, క్రీడా వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యం జిల్లా రెవెన్యూ అధికారులతో కలిసి అగనంపూడి, పెదగంట్యాడలో స్థలాలను పరిశీలించారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు, దువ్వాడ రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్నందున అనుకూలంగా ఉంటుందని నిర్ధారించారు. అయితే ఉక్కు యాజమాన్యం నుంచి ఆమోదం లభించకపోవడంతో జాప్యం జరిగింది.

మరో ప్రతిపాన ఇలా..

ఆ తర్వాత గాజువాక, పరవాడ, సబ్బవరం మండలాల సరిహద్దు ప్రాంతం (ట్రైజంక్షన్‌)లో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు  జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు మరో ప్రతిపాదన చేశారు. అధిక శాతం ప్రభుత్వ భూములు ఉన్నందున స్థలాల లభ్యత సులభమవుతుందని భావించారు. ఆయా భూములను కొందరు రైతులు సాగు చేస్తుండడంతో భూసమీకరణ చేపట్టారు. గ్రామ సభలు నిర్వహించి రైతుల ఆమోదం తీసుకున్నారు. ఆ ప్రక్రియ కొనసాగుతుండగానే 2019 ఎన్నికలు రావడంతో పనులకు బ్రేకులు పడ్డాయి.

పట్టించుకోని వైకాపా...

2019 ఎన్నికల్లో వైకాపా గెలిచి అధికారంలోకి వచ్చాక క్రీడా మైదానాన్ని పక్కన పెట్టేసింది. అప్పటి వరకు జరిగిన భూసేకరణ పనులు నిలిచిపోయాయి. ఈ అయిదేళ్లలో క్రీడాప్రాంగణం ఊసే ఎత్తలేదంటే విశాఖ నగర అభివృద్ధిపై వైకాపా పాలకులకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందని క్రీడాకారులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

పాలకుల నిర్లక్ష్యమే కారణం

విశాఖలో ప్రపంచ స్థాయి క్రీడా వేదిక లేకపోవడం పెద్ద లోటు. తెదేపా ప్రభుత్వ ప్రతిపాదనను సీఎం జగన్‌ ముందుకు తీసుకెళ్లి ఉంటే ఇప్పటికే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. క్రీడాకారులు నైపుణ్యం పెంచుకుని అంతర్జాతీయ పోటీల్లో రాణించే అవకాశం ఉండేది. వైకాపా పాలకుల నిర్లక్ష్యం.. క్రీడాకారులకు శాపంగా మారింది.

కె.పెంటారావు, అగనంపూడి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని