logo

జిల్లా అభివృద్ధికి పరి‘శ్రమిస్తా’..!

‘రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైంది. మరికొద్ది రోజుల్లో జగన్‌ రాక్షస పాలన అంతం కాబోతోంది. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా గాడితప్పిన ఈ రాష్ట్రాన్ని ప్రధాని మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్‌ కల్యాణ్‌ చతురతతో పునఃనిర్మాణం చేసుకుంటాం.

Updated : 06 May 2024 05:17 IST

పారిశ్రామికీకరణకు అనువైన ప్రాంతమిది..
కేంద్ర సాయంతో యువతకు ఉపాధి, మహిళలకు సాధికారత కల్పిస్తాం
సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తాం
‘ఈనాడు’ ముఖాముఖిలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌

ఈనాడు,  అనకాపల్లి: ‘రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైంది. మరికొద్ది రోజుల్లో జగన్‌ రాక్షస పాలన అంతం కాబోతోంది. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా గాడితప్పిన ఈ రాష్ట్రాన్ని ప్రధాని మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్‌ కల్యాణ్‌ చతురతతో పునఃనిర్మాణం చేసుకుంటాం. రాష్ట్రంలో కూటమి ప్రకటించిన సూపర్‌ సిక్స్‌కు కేంద్రంలో మోదీ సంకల్ప్‌పత్ర్‌ జతచేసి సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ముందుకు వెళతామ’ని అనకాపల్లి పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ పేర్కొన్నారు. ‘ఈనాడు, ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌’ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర ముఖద్వారం అనకాపల్లి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం రూపొందించిన కార్యాచరణను వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఉద్యోగులకు తోడుగా ఉంటాం..

వైకాపా ప్రభుత్వం ఉద్యోగులను శత్రువులుగా చూసింది. ఏనాడు ఒకటో తేదీన జీతాలు ఇచ్చిన పాపాన పోలేదు. వారికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు దక్కలేదు. అడిగితే కేసులతో వేధించారు. మేం అధికారంలోకి వచ్చాక సహృద్భావ వాతావరణంలో ఉద్యోగులు పనిచేసేలా చూస్తాం. వారి సేవలను మరింతగా ఉపయోగించుకుంటాం. జీత భత్యాలు సకాలంలో అందేలా చూస్తాం. అన్ని వర్గాలు సంతోషంగా ఉండేలా పాలన సాగిస్తాం.

భూ భక్షకుల పని పడతాం..  

జగన్‌ ప్రభుత్వంలో పేదల భూములన్నీ పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టమంటూ తెచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములకు రక్షణ లేకుండా పోయింది.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూ భక్షక చట్టాన్ని రద్దుచేస్తాం. ప్రభుత్వ భూములను కాపాడుకుంటాం.. ప్రైవేటు భూములకు రక్షణగా నిలుస్తాం. రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందించి సాగుకు దన్నుగా నిలుస్తాం.

నైపుణ్య శిక్షణ.. ఉపాధి కల్పనకు పెద్దపీట ..

జిల్లా జనాభాలో చదువుకున్న యువత 40 శాతం మంది ఉన్నారు. ఒక్కఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ యువత జీవితాలను నిర్వీర్యం చేసేశారు.   నేను ప్రచారానికి వెళ్లినప్పుడు చూశా బీటెక్‌, ఎంటెక్‌, బీఈడీ, డిగ్రీలు చేసినవారు ఉపాధి కూలీలుగా పనులకు వెళుతున్నారు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపించడానికి చర్యలు తీసుకుంటాం. సూపర్‌ సిక్స్‌ ద్వారా ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించాం. కేంద్రం కూడా యువశక్తి కార్యక్రమం ద్వారా వారికి నైపుణ్య శిక్షణ ఇస్తాం. దేశవ్యాప్తంగా నిర్మాణరంగ పరిశ్రమ విస్తరిస్తోంది. కాస్త నైపుణ్యం ఉంటే మంచి కొలువులు సాధించొచ్చు. అనకాపల్లి జిల్లాలో నియోజకవర్గాల వారీగా నైపుణ్య శిక్షణలు అందించి వారికి ఉపాధి అవకాశాలు చూపించి నిరుద్యోగిత తగ్గించడానికి ప్రాధాన్యం ఇస్తా. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుకు ఎంతో అనువైన వాతావరణం ఉంది. కేంద్ర ప్రభుత్వ సాయంతో జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కృషిచేస్తా.

మహిళా సాధికారత కూటమితోనే సాధ్యం..

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు కూటమి తోడుగా నిలుస్తుంది. సూపర్‌ సిక్స్‌ ద్వారా మహిళల కోసం చాలా పథకాలను ప్రకటించారు. రూ.10 లక్షల వరకు పొదుపు రుణాలుపై వడ్డీ లేకుండానే ఇవ్వబోతున్నాం. దీనివల్ల జిల్లాలో 40 వేల డ్వాక్రా సంఘాల్లోని 4.64 లక్షల మంది పొదుపు మహిళలకు సున్నా వడ్డీ లబ్ధి చేకూరుతుంది. ఇంటింటికీ మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాం. జిల్లాలో 4.5 లక్షల కుటుంబాలకు ఇవి లభిస్తాయి. ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వనున్నారు. జిల్లాలో 5 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందబోతున్నారు. ఇవే కాకుండా కేంద్రం సాయంతో మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెట్‌ లభించేలా వారిలో నైపుణ్యం అందిస్తాం. మహిళా సాధికారతను సాధ్యం చేస్తాం. 

ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పట్టాలెక్కిస్తాం..

జగన్‌ ప్రభుత్వంలో సాగునీటిరంగ పూర్తిగా చతికిలబడిపోయింది. బటన్లు నొక్కుతున్నానని చెబుతున్నారు కానీ ప్రాజెక్టుల గేట్లు ఊడిపోతున్నా పట్టించుకోవడం లేదు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, నదుల్లో నీటిని రైతులకు పూర్తిగా అందుబాటులోకి తేవడానికి కృషిచేస్తాం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పట్టాలెక్కించి సాగునీటి భరోసా కల్పిస్తాం.
సామాజిక వర్గాలన్నింటికీ సమ ప్రాధాన్యం.. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక సామాజిక వర్గాలకు సమప్రాధాన్యం ఇస్తాం. వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పథకాలను 36 వరకు రద్దుచేసింది. వాటన్నింటిని పునరుద్దరిస్తాం. కార్పొరేషన్లు పెట్టి ఆర్థికంగా ఆదుకుంటాం. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటిని లబ్ధిదారులకు చేరువ చేస్తాను.  

ఆంక్షలు లేని సంక్షేమం కల్పిస్తాం..

వైకాపా ప్రభుత్వం ఒకచేత్తో రూ10 ఇచ్చి మరో చేత్తో రూ.100 తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంక్షలు లేని సంక్షేమ కార్యక్రమాలను చేపడతాం. సామాజిక భద్రత పింఛన్లను రూ.4 వేలకు పెంచడమే కాదు.. ఏప్రిల్‌ నుంచి అమలుచేసి జులైలో రూ.7 వేలు పింఛను ఇంటి దగ్గరకు వచ్చి అందిస్తాం. జిల్లాలో 2.65 లక్షల మందికి రూ. 185 కోట్లు ఒక్క జులైలోనే ఖర్చుచేయబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం వచ్చే అయిదేళ్లల్లో 3 కోట్ల ఇళ్లు నిర్మించబోతోంది. అందులో జిల్లాకు సంబంధించి 70 వేల ఇళ్లు పేదలకు అందిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల జాగా ఇస్తాం. వచ్చే అయిదేళ్లు ఉచిత రేషన్‌ అందిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని