logo

రైతుకు ఏటా రూ.20వేల పెట్టుబడి సాయం

ప్రతి సంవత్సరం వ్యవసాయ పనుల కోసం రైతుకు పెట్టుబడి సాయం కింద కూటమి ప్రభుత్వం రూ.20 వేలు అందిస్తుందని భీమిలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు.

Published : 06 May 2024 03:10 IST

భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు

మాట్లాడుతున్న గంటా శ్రీనివాసరావు

ఆనందపురం, న్యూస్‌టుడే: ప్రతి సంవత్సరం వ్యవసాయ పనుల కోసం రైతుకు పెట్టుబడి సాయం కింద కూటమి ప్రభుత్వం రూ.20 వేలు అందిస్తుందని భీమిలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం గంభీరం, బోని, ముకుందపురం, శిర్లపాలెం, పేకేరు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, 90 శాతం రాయితీతో బిందు సేద్యానికి పరికరాలు అందిస్తామన్నారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టంతో పాటు యువత స్వయం ఉపాధికి సాయం, రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తామన్నారు. ఉత్తరాంధ్రలో బీసీలతో వైకాపా ప్రభుత్వం ఆడుకుందన్నారు. గడచిన అయిదేళ్లలో రాయలసీయ నుంచి వచ్చిన ఇద్దరు నాయకులు విశాఖలో తిష్ఠ వేసి ఉత్తరాంధ్రను దోచుకున్నారన్నారు. ఇక్కడి నాయకులు కనీసం ఎదురు చెప్పే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అంతకుముందు గ్రామాల్లో మహిళలు గంటా శ్రీనివాసరావుకు హారతి పట్టి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గోస్తనీ ఎత్తిపోతల పథకంతో మూడు పంటలు : బోని గ్రామంలో జరిగిన సభలో గంటా మాట్లాడుతూ కేవలం రూ.6 కోట్లు ఖర్చు చేసి గోస్తనీ నదిపై లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రక్రియ చేపడితే బోని గోవిందరాజు, ఏనుగుపాలెం చెరువుల కింద మూడు పంటలు పండేవని అన్నారు. 2018 డిసెంబరులో అప్పటి వ్యవసాయశాఖ మంత్రితో కలిసి బోని సందర్శించినపుడు స్థానిక రైతుల సూచన మేరకు ఈ ప్రతిపాదన చేశామన్నారు. 2019 ఎన్నికలు రావడం ఆ తర్వాత ఎవరూ పట్టించుకోక అది ప్రతిపాదన దశలోనే నిలిచిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వంలో సంబంధిత పథకానికి ప్రాధాన్యమిస్తామన్నారు. తెదేపా హయాంలో ఆనందపురం-బోని రహదారి నిర్మించగా, పేకేరు-అనంతవరం మధ్య ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డు వేయలేని స్థితిలో వైకాపా ప్రభుత్వం చతికిలపడిందన్నారు. ఈ కార్యక్రమంలో కోరాడ రాజబాబు, కంటుభుక్త రామానాయుడు, వానపల్లి లక్ష్మీ, ముత్యాలరావు, తెదేపా, భాజపా, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని