logo

సమస్యల్లో పరవాడ ‘మేజర్‌’

పరవాడ మేజర్‌ పంచాయతీలో పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి.

Published : 07 May 2024 04:34 IST

పట్టించుకోని వైకాపా ప్రజాప్రతినిధులు

అసంపూర్తిగా నిలిచిపోయిన ఆర్‌బీకే భవనం

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మేజర్‌ పంచాయతీలో పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఎన్టీపీసీ, ఫార్మాసిటీ రాకతో ఇక్కడ రోజురోజుకి నివాసాలు, జనాభా పెరగుతున్నా అందుకు తగట్టుగా వసతులు కల్పించకపోవడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. వైకాపా పాలనలో వసతులు కల్పించకపోవడంతో పాటు ఫార్మా కాలుష్యంతో చెరువులు, భూగర్భ జలాలు కలుషితమై పంటలు నాశనమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెదేపాకు పేరొస్తుందని..

గ్రామంలో తెదేపా హయాంలో లుపిన్‌ ఫౌండేషన్‌ సీఎస్‌ఆర్‌ నిధులు రూ.30 లక్షలు వెచ్చించి మంచి వసతులతో పార్కును నిర్మించారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెదేపాకు పేరొస్తుందనే కారణంతో పార్కు నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో చిన్నారుల ఆట వస్తువులు, బెంచీలు, విద్యుత్తు స్తంభాలు తప్పుపట్టి పాడైపోయాయి. పార్కులో పిచ్చిమొక్కలు పెరగడంతో ఆహ్లాదం కరవైంది. గతంలో నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం నిర్వహణను పట్టించుకోకపోవడంతో ప్రధాన ద్వారం గేటు దొంగలు ఎత్తుకుపోయారు. దీంతో కొంతమంది రాత్రి సమయంలో దొడ్డిదారిన ఫార్మా వ్యర్థాలను పడేసి నిప్పుపెట్టి వెళ్లిపోవడంతో దట్టమైన పొగ వ్యాపించి గ్రామస్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

పార్కులో తుప్పుపట్టిన చిన్నారుల ఆట పరికరాలు

నిరుపయోగంగా నిర్మాణాలు..

ఇక్కడి సచివాలయం-1 భవనం కొద్దినెలల క్రితం ప్రారంభోత్సవం చేశారు. ప్రస్తుతం దాన్ని తెరవకపోవడంతో నిరుపయోగంగా మారింది. పాత పంచాయతీ భవనంలోనే సచివాలయ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. రైతు భరోసా కేంద్రం భవనం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో గుత్తేదారు చేతులెత్తేశారు. దీంతో ఆర్‌బీకే సేవలను మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో అందిస్తున్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ పనుల్లో భాగంగా రోడ్లను ఇష్టానుసారంగా తవ్వేసి ఇంటింటా కొళాయి పైపులు ఏర్పాటు చేశారు. వీటిని కూడా సకాలంలో చేపట్టకపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. గ్రామంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న పలు ఎల్‌ఈడీ విద్యుత్తు స్తంభాలు తుప్పుపట్టి కూలేందుకు సిద్ధంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. కోనాం చెరువుకు చెందిన గెడ్డ వాగులు కబ్జాకు గురయ్యాయి. భారీ వర్షాలు కురిసినా చెరువులోకి నీరు రాకపోవడంతో క్రీడా మైదానంగా మారిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని