logo

కూత వినిపించేనా..?

బ్రిటిష్‌వారి కాలం నుంచే సాలూరు పట్టణ ప్రజలకు రైలు సేవలు అందేవి. ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే గోధుమలు, సిమెంట్‌ వంటివి ఇక్కడికే వచ్చేవి. గూడ్స్‌ ద్వారా వచ్చే సరకులను స్టేషన్‌ నుంచి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు లారీలు, ఇతర వాహనాల్లో ర

Published : 18 Jan 2022 05:35 IST

రైలుబస్సుకు నోచుకోని సాలూరు రైల్వే స్టేషన్‌


సాలూరు స్టేషన్‌లో నిలిచిన రైలు

సాలూరు, న్యూస్‌టుడే: బ్రిటిష్‌వారి కాలం నుంచే సాలూరు పట్టణ ప్రజలకు రైలు సేవలు అందేవి. ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే గోధుమలు, సిమెంట్‌ వంటివి ఇక్కడికే వచ్చేవి. గూడ్స్‌ ద్వారా వచ్చే సరకులను స్టేషన్‌ నుంచి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు లారీలు, ఇతర వాహనాల్లో రవాణా చేసేవారు. స్టేషన్‌లో రిజర్వేషన్‌ సౌకర్యం ఉండేది. సాలూరు-బొబ్బిలి పట్టణాల మధ్య బొగ్గుతో నడిచే రైలు రాకపోకలు చేసేది. ప్రయాణికులు వందల సంఖ్యలో ప్రయాణించేవారు. పదుల సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు ఉండేవారు. వారి కోసం భవన సముదాయం కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పుడు అవన్నీ లేవు. 15 ఏళ్ల కిందట రైల్వేస్టేషన్‌ను ఎత్తేశారు. ఆ తరువాత రైలుబస్సు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది కూడా రావడం లేదు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రస్తుతం రైళ్లు నిలిపేందుకు ఈ స్టేషన్‌ను వినియోగిస్తుండటం గమనార్హం. అతి తక్కువ రవాణా ఛార్జీలతో పేద, మధ్యతరగతి ప్రజలు బొబ్బిలి పట్టణానికి వెళ్లి వచ్చేవారు. శివరాంపురం, రొంపల్లి, భవానీపురం, నారాయణప్పవలస తదితర గ్రామాల ప్రజలు, విద్యార్థులు నిత్యం వందల సంఖ్యలో రాకపోకలు సాగించేవారు. రైలు సేవలు నిలిపివేయడంతో రోడ్డు మార్గాన్ని మాత్రమే వినియోగించాల్సిన దుస్థితి నేడు నెలకొంది. 

షెడ్యూల్‌ ప్రకటించి..: పట్టణం నుంచి బొబ్బిలి మీదుగా విశాఖ వరకు పాసింజరు రైలు నడుపుతామని మూడేళ్ల కిందట ఎస్‌ఈ రైల్వే అధికారులు తెలిపారు. ఉన్నతాధికారులు స్టేషన్‌ను పరిశీలించారు. దండిగాం రోడ్డు వరకు లైన్‌ పొడిగించి రైలు సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. రూ.లక్షల నిధులు వెచ్చించి మరో ట్రాక్‌ నిర్మాణం, విద్యుత్‌ లైన్ల పనులు చేయించారు. స్టేషన్‌ ఆధునికీకరణ, కొత్త షెడ్‌ ఏర్పాటు చేశారు. ఇదంతా జరిగి రెండున్నరేళ్లు కావస్తున్నా.. నేటికీ రైలు కూత మాత్రం వినిపించడం లేదు. 

హామీలే తప్ప..: రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు జరిపించాక.. రైలు బస్సు పునరుద్ధరణతో పాటు గదులను అప్పటి అరకు ఎంపీ గీత ప్రారంభించారు. రిజర్వేషన్‌ కౌంటరు కూడా స్థానిక పోస్టాఫీసులో ఏర్పాటు చేయిస్తామన్నారు. వాటికి నేటికీ అతీగతీ లేదు. పట్టణ వినియోగదారుల మండలి సభ్యులు ఎంపీకి  వినతులు సమర్పించారు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం రైలు నడపాలని కోరారు. పార్లమెంట్‌లో ప్రస్తావించి రైలు వచ్చేలా చూస్తానని హామీ  ఇచ్చారు. రైల్వే ఉన్నతాధికారులు కూడా వచ్చిన ప్రతిసారీ త్వరలోనే రైలు సేవలంటూ హామీలు ఇస్తున్నారు తప్ప..ఆచరణ కానివ్వడం లేదు.

పలుమార్లు కోరాం 
రైలు సౌకర్యం కల్పిస్తే పట్టణ పరిసర ప్రాంత ప్రజలు, విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుంది. సాలూరు నుంచి బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ వెళ్లేవారికి రవాణాలో సమయంతో పాఉట ఛార్జీల భారం తగ్గుతుంది. నేతలు, అధికారులు పట్టించుకోవాలి.   
-జె.సీతారాం, జిల్లా వినియోగ  దారుల మండలి కార్యదర్శి, సాలూరు.

లేఖలు రాశా 
పట్టణానికి రైలు సౌకర్యం కల్పించాలి. లేదంటే గతంలో ఉన్న రైలు బస్సు అయినా నడపాలని రైల్వే ఉన్నతాధికారులకు పలుమార్లు లేఖలు రాశా. వారి నుంచి సమాధానం రావాలి. లేదంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైలు సేవలు అందించాలని కోరుతాను. 
-పి.రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని