logo

నాటుగా.. పూటుగా

జిల్లాలో నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పల్లె, పట్టణాలనే తేడా లేకుండా అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఓ వైపు పోలీసులు, మరోవైపు ఎస్‌ఈబీ అధికారులు దాడులు చేస్తున్నా.. ఎక్కడా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. స్థానికంగా

Published : 20 Jan 2022 05:10 IST

చినమేరంగి ప్రాంతంలో సారా తయారీ బట్టీ

పార్వతీపురం పట్టణం, విజయనగరం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పల్లె, పట్టణాలనే తేడా లేకుండా అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఓ వైపు పోలీసులు, మరోవైపు ఎస్‌ఈబీ అధికారులు దాడులు చేస్తున్నా.. ఎక్కడా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. స్థానికంగా తయారీ తక్కువే అయినప్పటికీ ఒడిశా రాష్ట్రం నుంచి ఇబ్బడిముబ్బడిగా దిగుమతి అవుతుండడంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

పెరుగుదలకు కారణాలివీ..

రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మద్యం ధరలను విపరీతం పెంచింది. దీంతో డబ్బులు లేక తక్కువ ధరకు లభించే సారాపై కొందరి దృష్టిపడింది. దీంతో అప్పటి వరకు కొంతమేర ఉన్న సారా విక్రయాలు ఒక్కసారిగా విస్తరించాయి. ముఖ్యంగా జిల్లాలోని పార్వతీపురం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కొమరాడ తదితర ఏజెన్సీ మండలాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే ఒడిశా నుంచి అలమండ, కేదారపురం, కొమరాడ, పార్వతీపురం, సాలూరు తదితర మార్గాల మీదుగా సారా దిగుమతి అవుతోందని అధికారులు గుర్తించారు.

కానరాని చెక్‌పోస్టులు..

ఒడిశా నుంచి పార్వతీపురం డివిజన్‌లోకి ప్రధానంగా 11 మార్గాల ద్వారా అక్రమంగా రవాణా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికి నాలుగు చోట్ల మాత్రమే పెట్టారు. దీంతో దిగుమతికి అడ్డుకట్ట పడడం లేదు.

85 శాతం ఒడిశా నుంచే..

గతంలో మారుమూల గ్రామాలు, శివారు, నిషేధిత ప్రాంతాల్లో నాటుసారా తయారు చేసేవారు. కానీ నేడు ఎక్కడికక్కడే బట్టీలు వెలుస్తున్నాయి. అయితే ప్రధానంగా ఒడిశా నుంచే ఎక్కువగా సారా వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దాదాపు 85 శాతం దిగుమతి అవుతోందని గణాంకాలు చెబుతున్నాయి.

మళ్లీ వెనక్కి..

సారా విక్రయదారులు పట్టుబడితే అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి తక్కువ సమయంలోనే వారు బెయిల్‌పై బయటకు వస్తున్నారు. దీంతో విక్రయ, రవాణాదారుల్లో భయం లేకుండా పోతోంది. జిల్లాలో దొరికిన వారే మళ్లీ మళ్లీ పట్టుబడుతుండడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. అలాగే ఎస్‌ఈబీ విభాగంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. నిత్యం కొంతమంది మాత్రమే దాడుల్లో పాల్గొంటున్నారు.

కఠిన చర్యలు.. సారా తయారీదారులు, తరలించే వ్యక్తులపై బైండోవరు కేసులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 1397 మందిని బైండోవరు చేశాం. ప్రతి ఆరునెలలకోసారి వారి కదలికలు, నడవడికను బట్టి వాటిని ఉంచాలా..? తొలగించాలా..? అనేది నిర్ణయిస్తాం. ఈ విషయంలో ఎవర్నీ ఉపేక్షించేది లేదు. ఎక్సైజ్‌ యాక్టు ప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. స్థానిక పోలీసులు, అబ్కారీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బలగాలు దాడుల్లో పాల్గొంటున్నాయి. - ఎన్‌.శ్రీదేవీరావు, అదనపు ఎస్పీ, ఎస్‌ఈబీ

జిల్లాలో ఇలా..

ఎస్‌ఈబీ ఏర్పాటైనప్పటి నుంచి నమోదైన కేసులు: 2,758

అరెస్టు అయినవారు: 1712 మంది

స్వాధీనం చేసుకున్న సారా: 87,197.5 లీటర్లు

సీజ్‌ చేసిన వాహనాలు: 629

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని