logo

గుంకలాంలో సరే.. మిగిలిన చోట?

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకంలో కొందరికి ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తామని చెప్పింది. ఇది జరిగి ఏడాదైనా స్పష్టత లేదు. తాజాగా గృహాల నిర్మాణం ప్రారంభించని వాటిని రద్దు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అటువంటి వారు 14,884 మంది

Published : 20 May 2022 04:24 IST


 నిర్మాణంలో ఉన్న ఇళ్లు

విజయనగరం అర్బన్, మయూరికూడలి, న్యూస్‌టుడే: నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకంలో కొందరికి ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తామని చెప్పింది. ఇది జరిగి ఏడాదైనా స్పష్టత లేదు. తాజాగా గృహాల నిర్మాణం ప్రారంభించని వాటిని రద్దు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అటువంటి వారు 14,884 మంది ఉన్నారు. వీరిలో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద లేఅవుట్‌ అయిన గుంకలాంలో 11,091 ఇళ్లు మంజూరవ్వగా మూడో ఐచ్ఛికం వారికి ఒప్పంద (కాంట్రాక్టు) విధానంలో నిర్మించాలనుకున్నారు. ఇందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా సర్వే చేయగా మూడు వేల మంది ముందుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులు, నిర్మాణ సంస్థ రాక్రీట్‌ ఏజెన్సీ మధ్య ఎంవోయూ(అవగాహన ఒప్పందం) పూర్తి చేసి నిర్మాణాలు ప్రారంభించారు.  
ప్రభుత్వం ఆర్థిక భారంతో లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకోవాలి అనడంపై వ్యతిరేకత రావడంతో మూడు ఐచ్ఛికాలను ప్రవేశపెట్టింది. సొంతంగా నిర్మాణం, ప్రభుత్వ సామగ్రితో కట్టుకోవడం, ప్రభుత్వమే నిర్మించి ఇవ్వడం ఇందులో ఉన్నాయి. సొంత స్థలమున్న వారు కట్టుకునేందుకు ముందుకొచ్చారు. కొందరు సామగ్రి ఇవ్వాలని సుముఖత తెలియజేశారు. మిగిలిన వారు ఆర్థిక స్థోమత లేని కారణంగా ప్రభుత్వమే నిర్మించాలని రాతపూర్వకంగా తెలియజేశారు. వీరిలో నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే నిర్వహించి ఏడాది కిందటే ప్రభుత్వానికి నివేదించారు. నిర్మాణాల కోసం ప్రతి 20 మందిని ఒక బృందంగా ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల్లో 10,420 గ్రూపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు అప్పట్లో ప్రకటించారు. ఐసీఐసీఐలో ఖాతా తెరవాలని లబ్ధిదారులకు ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చే మొత్తం లబ్ధిదారుల ఖాతా నుంచి నేరుగా మేస్త్రీ ఖాతాకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. పనులు చేపట్టేందుకు 416 మంది తాపీమేస్త్రీలను గుర్తించారు. తర్వాత మరుగున పడింది. 

అధికారి మాట.. 
గుంకలాంలో ముందుకొచ్చిన వారికి ఏజెన్సీ ద్వారా నిర్మిస్తాం. గతంలో మూడో ఐచ్ఛికం చెప్పిన వారిలో కొందరు సొంతంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. మిగిలిన వారి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.   
 - ఎస్‌.రమణమూర్తి, పీడీ, గృహ నిర్మాణ శాఖ  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని