logo

విద్యార్థులు తెలుగు పదాలు చదవలేకపోతే ఎలా?

‘కనీసం తెలుగు పదాలను కూడా సరిగా చదవలేకపోతున్నారు. ఇలా ఉంటే గిరిజన విద్యార్థులెలా బాగుపడతారు? ఈ పరిస్థితికి ఉపాధ్యాయులే బాధ్యత వహించాలంటూ’ రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కుంభా రవిబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Published : 27 Nov 2022 03:56 IST

ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ అసంతృప్తి

ఎస్‌.కోట ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థితో తెలుగు పాఠ్యాంశం చదివిస్తున్న రవిబాబు

శృంగవరపుకోట, వేపాడ, న్యూస్‌టుడే: ‘కనీసం తెలుగు పదాలను కూడా సరిగా చదవలేకపోతున్నారు. ఇలా ఉంటే గిరిజన విద్యార్థులెలా బాగుపడతారు? ఈ పరిస్థితికి ఉపాధ్యాయులే బాధ్యత వహించాలంటూ’ రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కుంభా రవిబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఎస్‌.కోట, వేపాడ మండలం కొండగంగుబూడిల్లో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో పది, ఏడు తరగతుల విద్యార్థులతో పాఠ్యాంశాలను చదివించారు. ఆంగ్లం కాదు కదా కనీసం తెలుగు పదాలు చదవలేకపోవడంతో ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి శనివారం సాయంత్రం గంట పాటు విద్యార్థులు భయం లేకుండా మాట్లాడటంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. మళ్లీ మూడు నెలల తర్వాత వస్తానని, అప్పటకి మార్పు తప్పకుండా కనిపించాలన్నారు. కేజీపూడి పాఠశాల స్టోర్‌ రూంలో నూనె, సెనగపప్పు పాడైపోవడాన్ని గమనించి, ఇలా ఉంటే నాణ్యమైన ఆహారం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఆయన వెంట రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నెక్కల నాయుడుబాబు, ఎస్టీ కమిషన్‌ సభ్యురాలు కొర్రా రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రెండు నెలల్లో ఆధార్‌, జనన ధ్రువపత్రాలు .. రాష్ట్రంలో పర్యటించినప్పుడు గిరిజన విద్యార్థులకు ఆధార్‌, జనన ధ్రువపత్రాలు లేకపోవడాన్ని గుర్తించామని, వీరికి వాటిని రెండు నెలల్లో అందిస్తామని రవిబాబు తెలిపారు. దీనిపై ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ప్రత్యేక డ్రైవ్‌గా తీసుకొని ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని