logo

విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలే

ఊహించని రీతిలో ములుగు జడ్పీ ఛైర్మన్‌ పదవిని కైవసం చేసుకున్న కుసుమ జగదీశ్వర్‌ ప్రస్థానం అనతి కాలంలోనే ముగిసింది.

Published : 12 Jun 2023 06:28 IST

ములుగు జడ్పీ ఛైర్మన్‌ జగదీశ్వర్‌ మృతితో విషాదం

ములుగు, న్యూస్‌టుడే: ఊహించని రీతిలో ములుగు జడ్పీ ఛైర్మన్‌ పదవిని కైవసం చేసుకున్న కుసుమ జగదీశ్వర్‌ ప్రస్థానం అనతి కాలంలోనే ముగిసింది. వరించిన పదవిని సంతృప్తిగా అనుభవించకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయారు. ములుగు జిల్లా ములుగు మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన కుసుమ జగదీశ్వర్‌(47) జీవిత చరిత్ర ఓ ప్రత్యేకత. కుసుమ ఆదినారాయణ - సులోచన దంపతులకు నలుగురు సంతానం. జగదీశ్వర్‌ రెండో వాడు. మల్లంపల్లిలో ప్రాథమిక విద్యనభ్యసించారు. ములుగు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసిన ఆయనకు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవాటయ్యాయి. ఇంటర్‌ పూర్తి చేసిన ఆయన 1991 నుంచి 1994 వరకు గ్రామంలో విశ్వ భారతి యూత్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుండడం, మల్లంపల్లి సమీప గ్రామాల్లో యువతను కూడగట్టి గుట్కా, గుడుంబా నిషేధం తదితర కార్యక్రమాలు చేయడం, వ్యవసాయ సాగులో రైతులకు శాస్త్రవేత్తలతో శిక్షణ తరగతులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేసేవారు. మావోయిస్టు అనుబంధ తెలంగాణ జనసభలో కొంతకాలం ములుగు ఇన్‌ఛార్జిగా పనిచేశారు.

ఉద్యమ సమయంలో చురుగ్గా..

హైదరాబాద్‌ వెళ్లిన ఆయన, అదే సమయంలో ఆవిర్భవించిన తెరాసలో చేరారు. యువజన విభాగంలో పని చేస్తూ.. ఉద్యమ సమయంలో చురుకైన పాత్ర పోషించారు. ఆ సమయంలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో తెరాస అభ్యర్థి విజయం కోసం పని చేశారు.

ఏటూరునాగారం జడ్పీటీసీ అభ్యర్థిగా

జిల్లాలో సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చిన జగదీశ్వర్‌(పాతచిత్రం)

పార్టీ ఇచ్చిన అవకాశంతో 2019 మే నెలలో తెరాస అభ్యర్థిగా ఏటూరునాగారం జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేశారు. గెలుపొందిన ఆయనకు పార్టీ జడ్పీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించింది. అదే ఏడాది ఆగస్టు 7న జడ్పీ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత తెరాస ములుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జి, జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను కూడా పార్టీ అప్పగించింది. నిరంతరం జిల్లా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కార్యకర్తలను ప్రోత్సహిస్తూ.. పార్టీని ముందుకు నడిపించడంతో కీలక పాత్ర పోషిస్తున్నారు.

మల్లంపల్లిని మండలం చేయాలని..

స్వగ్రామమైన మల్లంపల్లి గ్రామాన్ని మండలం చేయాలనేది ఆయన లక్ష్యం. సుమారు మూడేళ్ల నుంచి ఆయన మండలం కోసం శ్రమిస్తున్నారు. మండలం ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంతో స్థానికులు, ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్‌ ములుగులో నిర్వహించిన బహిరంగ సభలో మల్లంపల్లి మండలం ప్రస్తావన తీసుకొచ్చి కేటీఆర్‌కు వినతిపత్రం కూడా అందించారు. ఏటూరునాగారం మండల పరిధిలోని గ్రామాలకు సీసీ రోడ్లు మంజూరు చేయించారు. ఏటూరునాగారంలో జడ్పీ క్యాంపు కార్యాలయం మంజూరు చేయించగా, అది నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రెండేళ్లుగా వర్షాకాలంలో ములుగు జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాలు, వరదలతో గ్రామాల్లో నష్టం జరిగిన సమయంలో ఆయన స్వయంగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకమై వరద సహాయక కార్యక్రమాలు నిర్వహించారు.


నేడు కేటీఆర్‌ రాక

ములుగు, న్యూస్‌టుడే:  జగదీశ్వర్‌ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం మల్లంపల్లిలో సోమవారం ఉదయం 10 గంటలకు జరగనున్నాయి. అంత్యక్రియలకు భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి  కేటీఆర్‌ హాజరు కానున్నారు. ఉదయం 8.45 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 9 గంటలకు బేగంపేట చేరుకుంటారు. ఉదయం 9.30 గంటలకు హెలికాప్టర్‌లో ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన  హెలీప్యాడ్‌కు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మల్లంపల్లి చేరుకొని జడ్పీ ఛైర్మన్‌ అంత్యక్రియల్లో కేటీఆర్‌ పాల్గొంటారు.


కటతడి పెట్టిన మంత్రి సత్యవతి రాథోడ్‌

కుటుంబ సభ్యులు, అభిమానులు జగదీశ్వర్‌ మృతిని జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన మరణ వార్త దావానలంలా వ్యాపించింది. బంధువులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో మల్లంపల్లికి చేరుకొని విలపించారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ జగదీశ్వర్‌ మృతదేహానికి పూల మాల వేసి నివాళులర్పించి కంటతడి పెట్టారు. జడ్పీ ఛైర్మన్‌ తల్లి సులోచన తన కొడుకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. రోదిస్తుండటం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించింది.


మంచి మిత్రుడిని కోల్పోయాం : షాపూరి మహేందర్‌, మల్లంపల్లి

ఓ మంచి మిత్రుడిని కోల్పోయాం. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మల్లంపల్లిలోనే కలిసి చదువుకున్నాం. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎలాంటి మార్పు రాలేదు. మాతో చాలా సన్నిహితంగా ఉండే వాడు. నిజం చెప్పాలంటే ఆయన నిగర్వి.


ప్రతి పనిలో పట్టుదలే : తుమ్మనపెల్లి కిరణ్‌

జగదీశ్వర్‌ మేము మంచి స్నేహితులం. కలిసి చదువుకున్నాం. ఆయన ఏ పని చేపట్టినా పట్టుదలతో చేసే వారు. సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం  చాలా ఇష్టం.  మృతి మాకు బాధ కలిగిస్తోంది. ఒక మంచి మిత్రుడిని కోల్పోయామనే బాధ వెంటాడుతోంది.


పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాం : ల్యాద సాంబరాజు

జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నికైన తర్వాత చదువుకున్న వాళ్లమంతా కలవాలని పదే పదే చెప్పేవారు. అనుకున్నట్లుగానే మల్లంపల్లి పాఠశాలలో కలిసి చదువుకున్న మిత్రులతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుని సంబరపడ్డాం. జగదీశ్వర్‌ లేడనే విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు