logo

అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు

తప్పుడు సర్వే నంబర్లతో దేవాలయాల భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, వాటిని పరిశీలించి రద్దు చేయాలని వరంగల్‌, హనుమకొండ జిల్లాల సబ్‌ రిజిస్టర్లకు వరంగల్‌ ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ రామల సునీత లేఖ రాశారు.

Published : 28 Mar 2024 04:10 IST

రామన్నపేట, న్యూస్‌టుడే: తప్పుడు సర్వే నంబర్లతో దేవాలయాల భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, వాటిని పరిశీలించి రద్దు చేయాలని వరంగల్‌, హనుమకొండ జిల్లాల సబ్‌ రిజిస్టర్లకు వరంగల్‌ ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ రామల సునీత లేఖ రాశారు. ఇటీవల ‘ఈనాడు’లో ప్రచురితమైన వరుస కథనాలతో దేవాదాయశాఖ అధికారుల్లో కదలిక వచ్చింది. హనమద్గిరి లక్ష్మీనర్సింహస్వామి, రాగన్న దర్వాజ శ్రీసీతారామచంద్ర స్వామి(చిన్న కోవెల), శ్రీరంగనాయకుల స్వామి(పెద్ద కోవెల) దేవాలయాల భూములు కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు మా దృష్టికి వచ్చిందని, అలాంటి వాటిని తక్షణం రద్దు చేయాలని, భవిష్యత్తులో ఆలయాల భూములు రిజిస్ట్రేషన్లు జరగకుండా బ్లాక్‌ చేయాలని సహాయ కమిషనర్‌ సునీత కోరారు. హనుమకొండ పద్మాక్షి, శ్రీసిద్ధేశ్వర స్వామి, వీరపిచ్చమాంబ ఆలయాల స్థలాల్లో వెలిసిన ఆక్రమణలు తొలగించేందుకు సహకారం అందించాలని హనుమకొండ రెవెన్యూశాఖ అధికారులు, గ్రేటర్‌ వరంగల్‌కు లేఖలు రాశారు. ఆక్రమణదారులకు ఆయా దేవస్థానాల నుంచి నోటీసులు జారీ చేసినట్లు సహాయ కమిషనర్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఆక్రమణదారులను వదిలేది లేదని, వివిధ న్యాయస్థానాల్లో కేసులు కొనసాగుతున్నందున ప్రస్తుతం చర్యలు తీసుకోవడం లేదన్నారు. వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లో దేవాలయాల భూముల ఆక్రమణలు, అన్యాక్రాంతంపై సమగ్రమైన నివేదిక పంపించాలని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు వరంగల్‌ జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఆక్రమణలపై అధికారులు స్పందించి, సత్వర చర్యలు చేపట్టాలన్నారు.

లోకాయుక్త న్యాయస్థానం అసంతృప్తి

వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లోని పద్మాక్షి, సిద్ధేశ్వర, వీరపిచ్చమాంబ, శ్రీరంగనాయక స్వామి, శ్రీవేణుగోపాల స్వామి ఆలయాల భూముల ఆక్రమణలపై బుధవారం హైదరాబాద్‌లోని లోకాయుక్త న్యాయస్థానంలో విచారణ జరిగింది. సామాజిక కార్యకర్తలు చీకటి రాజు, సాంబరాజు చక్రపాణి, దేవాదాయ శాఖ తరఫున ఈఓ హాజరయ్యారు. వరంగల్‌ జిల్లా దేవాదాయశాఖ అధికారులు గైర్హాజరుకావడం పట్ల న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. ఈ విషయంపై రాష్ట్ర కమిషనర్‌కు లేఖ రాయాలని సామాజిక కార్యకర్తలు నిర్ణయించారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని