logo

నామపత్రాలకు వేళాయె!

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Published : 18 Apr 2024 06:09 IST

అభ్యర్థులూ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఈనాడు, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, వరంగల్‌ కలెక్టరేట్‌

వరంగల్‌ పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మహబూబాబాద్‌ (ఎస్టీ) నియోజకవర్గానికి సంబంధించి మహబూబాబాద్‌ సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) కార్యాలయంలో, వరంగల్‌ (ఎస్సీ) స్థానానికి  వరంగల్‌ కలెక్టరేట్‌లోని ఆర్వో కార్యాలయంలో నామపత్రాలను స్వీకరించనున్నారు. మహబూబాబాద్‌ స్థానానికి ఆర్వోగా మహబూబాబాద్‌ కలెక్టర్‌ అద్వైత్‌ కుమార్‌ సింగ్‌, వరంగల్‌ స్థానానికి ఆర్వోగా వరంగల్‌ కలెక్టర్‌ పి.ప్రావీణ్య వ్యవహరించనున్నారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నామపత్రాలను వీరు  స్వీకరిస్తారు. రిటర్నింగ్‌ కార్యాలయం సమీపంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా 360 డిగ్రీల కోణం కలిగిన నిఘా నీడలో జరుగుతుంది.

ధ్రువపత్రాలు పక్కాగా ఉండాలి..

పోటీ చేసే అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేసే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా ధ్రువపత్రాలను జత చేయాలి. లేకుంటే నామపత్రాలు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.

  • ఎస్సీ, ఎస్టీకి రిజర్వు అయిన స్థానాల్లో అభ్యర్థులు ఇటీవల తహసీల్దార్‌ కార్యాలయం నుంచి జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాలి.
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 ధరావతు చలానా రూపంలో చెల్లించి ఆ రసీదు అందజేయాలి. లేదా నగదు కూడా చెల్లించొచ్చు. దేశంలో ఎక్కడ ఓటరుగా నమోదై ఉన్నా పోటీ చెయ్యొచ్చు. పోటీ చేసే నియోజకవర్గానికి చెందిన ఓటరు అతన్ని ప్రతిపాదించాలి.
  • గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థిని ఒకరు ప్రతిపాదించవచ్చు. స్వతంత్ర అభ్యర్థి అయితే ఆ నియోజకవర్గానికి సంబంధించిన 10 మంది ఓటర్లు ప్రతిపాదించాలి.  నిరక్షరాస్యులైన వారుంటే వారు ఆర్వో సమక్షంలోనే వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.
  • నామినేషన్‌ వేసే అభ్యర్థులు ఎన్నికల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తీసుకోవాలి. ఎన్నికలకు సంబంధించిన ప్రతి వ్యయాన్ని ఆ ఖాతా ద్వారా చెల్లింపులు చేయాలి.
  • గుర్తింపు కలిగిన న్యాయవాది నుంచి పొందిన ఫారం-26 అఫిడవిట్‌లో అభ్యర్థులకు సంబంధించిన విద్యార్హతలు, ఆస్తులు, వాహనాలు, నేర చరిత్ర, అభ్యర్థి కుటుంబ సభ్యుల ఆస్తుల, వాహనాల వివరాలను అందులో నమోదు చేయాలి.
  • ప్రతి అభ్యర్థి నాలుగు సెట్ల నామపత్రాలను సమర్పించవచ్చు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఆపార్టీ జారీ చేసిన బీ ఫాంను నామపత్రాల దాఖలు చేసే చివరి తేదీ నాటికి ఆర్వోకు సమర్పించాలి.
  • నామపత్రాలు సమర్పించేందుకు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోకి అభ్యర్థితో పాటు మరో నలుగురిని అనుమతిస్తారు. మిగిలిన వారిని 100 మీటర్ల దూరంలోని నిలిపివేస్తారు.

ముహూర్తాలు చూసుకుంటూ..

నామపత్రాలు సమర్పించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఈ నెల 21 వరకే మంచిరోజులు ఉండటంతో మొత్తం ఎక్కువశాతం అప్పటిలోగా దాఖలయ్యే అవకాశాలున్నాయి. ఈ నెల 21 ఆదివారం కావడంతో తొలిమూడు రోజుల్లోనే ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు నామపత్రాలను సమర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
హెల్ప్‌ డెస్క్‌ను వినియోగించుకోవాలి: రిటర్నింగ్‌ కార్యాలయంలోని ఆర్వో కార్యాలయానికి వెళ్లే ముందు హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని డీటీ స్థాయి అధికారులు ఉంటారు. వారు అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను పరిశీలిస్తారు. ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునేందుకు సూచనలు అందిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని