ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

Updated : 01 May 2024 07:13 IST

డీఎస్సీ పోస్టులు భర్తీ కాగానే టీచర్ల హేతుబద్ధీకరణ
విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్‌) చేపడతామని వెల్లడించారు. సర్కారు బడుల్లో విద్యతో పాటు వికాసం, సాంస్కృతిక, క్రీడారంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల అనంతరం విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేనతో కలిసి బుర్రా వెంకటేశం విలేకరులతో మాట్లాడారు.
‘‘ప్రైవేటు విద్యాసంస్థల్లో రుసుములు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రత్యేక చట్టం రూపకల్పనపై ప్రభుత్వం దృష్టిసారించింది. డీఎస్సీ ద్వారా అదనంగా 11 వేల ఉపాధ్యాయ పోస్టులు వస్తున్నాయి. అన్నింటినీ కలిపి హేతుబద్ధీకరణ చేపడతాం. టెట్‌ ఫలితాల అనంతరం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఉంటాయి. విద్యాసంవత్సరంలో ప్రవేశాలు పెంచేందుకు బడిబాట కార్యక్రమాన్ని, విద్యార్థుల్లో వ్యక్తిత్వ, మానసిక వికాసం, దేహదారుఢ్యం పెంపొందించేందుకు ప్రత్యేక సాంస్కృతిక, క్రీడాశిక్షణ తరగతులు నిర్వహిస్తాం. వారంలో నాలుగు రోజుల పాటు ఇవి ఉంటాయి. ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా వీటిని చేపడతాం. పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదును పకడ్బందీగా నిర్వహించేందుకు ముఖగుర్తింపు (ఫేషియల్‌ రికగ్నిషన్‌) విధానంతో పనిచేసే యాప్‌ను ప్రవేశపెడతాం’’ అని బుర్రా వెంకటేశం తెలిపారు. పది పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరగడం అభినందనీయమని ముఖ్యకార్యదర్శి అన్నారు. ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఉత్తీర్ణత కాకపోవడానికి అనేక కారణాలుంటాయని చెప్పారు. వాటిని విశ్లేషించుకొని సప్లిమెంటరీ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావచ్చని హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని