logo

ఒకటి.. రెండు.. ఒకటి.. రెండు..

ఉమ్మడి వరంగల్‌లో  లోక్‌సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది.

Updated : 19 Apr 2024 05:04 IST

 జనరల్‌ నుంచి రిజర్వుడు స్థానాలుగా లోక్‌సభ నియోజకవర్గాలు 

ఉమ్మడి వరంగల్‌లో  లోక్‌సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది. జనరల్‌ స్థానాలు రిజర్వుడు నియోజకవర్గాలుగా రూపాంతరం చెందాయి..ఆ వివరాలతో ప్రత్యేక కథనం..

ఈనాడు, మహబూబాబాద్‌


దేశవ్యాప్తంగా 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఒకే ఒక లోక్‌సభ స్థానంగా వరంగల్‌ ఉండేది. ఆ తర్వాత 1957లో లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచారు. కొత్తగా మహబూబాబాద్‌ ఆవిర్భవించింది. మళ్లీ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో మహబూబాబాద్‌ రద్దయింది.  ఆ తర్వాత మళ్లీ ఆవిర్భవించింది. ప్రస్తుతం వరంగల్‌ (ఎస్సీ), మహబూబాబాద్‌ (ఎస్టీ) స్థానాలతో కొనసాగుతోంది.

1977లో హనుమకొండ  

పలు దఫాల్లో జరిగిన శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగానే 1977 లోక్‌సభ  ఎన్నికల సమయం నాటికి అప్పటికే ఉన్న వరంగల్‌ లోక్‌సభ స్థానంతో పాటు హనుమకొండ లోక్‌సభ స్థానం ఆవిర్భవించింది. ఆ సమయాన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 12 శాసనసభ నియోజకవర్గాలుండగా వాటిలో కొన్నింటితో పాటు కరీంనగర్‌ జిల్లాలోని కమలాపూర్‌ నియోజకవర్గాన్ని హనుమకొండ ఎంపీ స్థానంలో కలిపారు. ఈ లోక్‌సభ స్థానం 2009 వరకు కొనసాగి ఆ తర్వాత రద్దు అయింది.  దీనికి తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగాయి. 2008లో ఉప ఎన్నిక కూడా జరిగింది.

1957లో మహబూబాబాద్‌ ఆవిర్భావం

ఉమ్మడి జిల్లాలో అప్పటికే ఉన్న వరంగల్‌ ఎంపీ స్థానంతో పాటు 1957లో మహబూబాబాద్‌ నూతన ఎంపీ స్థానంగా ఏర్పాటైంది. ఇది కూడా జనరల్‌ స్థానంగానే ఉండేది. ఈ స్థానానికి 1957, 1962లో ఎన్నికలు జరిగాయి. 1965లో ఉప ఎన్నిక కూడా జరిగింది. రెండు దఫాలు లోక్‌సభ స్థానంగా కొనసాగిన మహబూబాబాద్‌ 1967 నాటికి రద్దు అయింది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో మళ్లీ మహబూబాబాద్‌ (ఎస్టీ) లోక్‌సభ స్థానంగా ఆవిర్భవించింది.

 ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని డోర్నకల్‌ (ఎస్టీ), మహబూబాబాద్‌ (ఎస్టీ), నర్సంపేట, ములుగు (ఎస్టీ) అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక (ఎస్టీ), ఇల్లెందు (ఎస్టీ), భద్రాచలం (ఎస్టీ) అసెంబ్లీ సెగ్మెంట్లతో మొత్తంగా ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కొనసాగుతోంది. ఈ స్థానానికి ప్రస్తుతం జరగబోతున్న ఎన్నిక నాలుగోది.

వరంగల్‌కు 18వ ఎన్నిక

హైదరాబాద్‌ రాష్ట్ర కేంద్రంగా 1952లో తొలిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల నుంచే వరంగల్‌.. లోక్‌సభ  స్థానంగా కొనసాగుతోంది. ప్రస్తుతం జరగబోతున్న ఎన్నికలతో ఈ స్థానానికి 18వ ఎన్నిక. మధ్యలో ఉప ఎన్నికలు కూడా జరిగాయి. ఇది 14 దఫాలు జనరల్‌ స్థానంగా కొనసాగింది. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో ఎస్సీ రిజర్వుడు స్థానమైంది. ఈ రిజర్వుడు స్థానానికి ఇప్పుడు 4వ లోక్‌సభ ఎన్నిక జరగబోతుంది. 2015లో ఉప ఎన్నిక జరిగింది.

  •  ఈ  నియోజకవర్గం పరిధిలో ఉమ్మడి జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి, వర్ధన్నపేట, వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ, పరకాల, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
  •  ఉమ్మడి జిల్లాలో 1952లో ఒకే లోక్‌సభ స్థానంగా ఉన్న వరంగల్‌ మధ్యలో రెండు స్థానాలుగా ఏర్పడింది. ఆ తర్వాత 1967, 1971 వరకు ఈ రెండు పర్యాయాలు మళ్లీ వరంగల్‌ ఒకటే లోక్‌సభ స్థానంగా కొనసాగింది. 1977లో హనుమకొండ లోక్‌సభ ఆవిర్భవించడంతో మళ్లీ ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ స్థానాలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని