logo

భాజపాను ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తాం

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో సోమవారం భాజపా నిర్వహించిన రోడ్‌షో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపింది.

Published : 23 Apr 2024 03:57 IST

రోడ్డుషోలో పాల్గొన్న కేంద్రమంత్రి కిరెణ్‌రిజిజు. చిత్రంలో ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు తదితరులు

ఈనాడు, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో సోమవారం భాజపా నిర్వహించిన రోడ్‌షో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపింది. భాజపా అభ్యర్థిగా అజ్మీరా సీతారాంనాయక్‌ నామపత్రం దాఖలు సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో కేంద్ర ఎర్త్‌ సైన్సెస్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పరిశ్రమల శాఖ మంత్రి కిరెణ్‌ రిజిజు పాల్గొన్నారు. ఓపెన్‌టాప్‌ వాహనంపై ప్రధాన రహదారులకు ఇరువైపులా ప్రజలకు అభివాదం చేస్తూ ఆర్టీసీ బస్టాండ్‌, మదర్‌థెరిస్సా చౌరస్తా, జిల్లా ఆసుపత్రి, నెహ్రూసెంటర్‌, ఇందిరా సెంటర్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగించారు. గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ఈ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న సీతారాంనాయక్‌ను ఓట్లు వేసి ఆశీర్వదించండి.. ఈప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. నియోజకవర్గం పరిధిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు. పదేళ్ల మోదీ పరిపాలనలో దేశంలో చేపటిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్థానం పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్యనాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు.

 ఇంటింటా చెప్పండి..

 ప్రధాని మోదీ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను నాయకులు, కార్యకర్తలు ఇంటింటా చెప్పాలని కేంద్ర మంత్రి కిరెణ్‌రిజిజు కోరారు. కార్యక్రమంలో భాజపా ఎన్నికల రాష్ట్ర ప్రచార కర్త, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాజ్యసభ  మాజీ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, భాజపా క్రమశిక్షణా కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు,  మాజీ ఎంపీ చాడా సురేష్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.రాజవర్ధన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వై.వెంకటేశ్వర్‌రావు, మాజీ అధ్యక్షుడు వి.రామచందర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మోసంగి మురళి తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలతో ఘనస్వాగతం

ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్‌కు వచ్చిన మంత్రికి భాజపా శ్రేణులు ఆదివాసీ, గిరిజన సంపద్రాయాలతో ఘనస్వాగతం పలికారు. రోడ్‌షోలో ఆదివాసీలు కొమ్ము నృత్యాలు, లంబాడీలు తమ సంపద్రాయ వేషధారణతో చేసిన నృత్య ప్రదర్శనలు, కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని