logo

గొర్రెల పంపిణీకి మంగళం!

గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్థక శాఖ అధికారులు నిర్ణయించారు

Published : 23 Apr 2024 04:04 IST

న్యూస్‌టుడే, భూపాలపల్లి: గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్థక శాఖ అధికారులు నిర్ణయించారు. గతేడాది డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు గొర్రెల పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చాలా చోట్ల గొర్రెల పెంపకందారులు తమకు ప్రభుత్వం వెంటనే యూనిట్లు పంపిణీ చేయాలని లేదా తాము చెల్లించిన డీడీలు వెనక్కి ఇవ్వాలని ఆందోళనకు దిగారు. చివరకు స్థానిక అధికారులపై గొర్రెల పెంపకందారుల సంఘాలు, నాయకులు ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో అడిగిన వాళ్లందరి డీడీలు వెనక్కి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. గత భారాస ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. గొర్రెల యూనిట్ల కోసం చాలా మంది దరఖాస్తు చేశారు. ఒక్కో యూనిట్‌ విలువ రూ.1.70 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో లబ్ధిదారుల వాటా రూ.43,750 చెల్లించాలి. మిగతా మొత్తం ప్రభుత్వం రాయితీ కింద భరించి గొర్రెలను పెంపకందారులకు అందజేస్తుంది. ఒక్కో యూనిట్‌లో 20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటాయి. మొదటి విడత కింద 2018లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 6,722 యూనిట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.8.94 కోట్లు ఖర్చు చేసింది. 2019లో రెండో విడతగా 5,784 యూనిట్ల వరకు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నిధుల కొరత కారణంగా పథకం ముందుకు సాగలేదు. దాదాపుగా 796 మంది గొర్రెల పెంపకందారులు ఒక్కొక్కరు రూ.43,750 చొప్పున ప్రభుత్వానికి డీడీలు చెల్లించారు. ఇందులో 395 యూనిట్లకు గొర్రెలు పంపిణీ చేశారు. మిగతా 401 యూనిట్లకు ఇవ్వాల్సి ఉంది. నాలుగేళ్లవుతున్నా గొర్రెలు పంపిణీ చేయకపోవటంతో డీడీలు చెల్లించిన వాళ్లంతా ఆశలు వదులుకున్నారు. సంబంధిత అధికారులు కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని వేచిచూశారు. రాష్ట్ర స్థాయి విజిలెన్స్‌ అధికారులు ఈ పథకం అమలుపై విచారణ చేపట్టడంతో పలు అక్రమాలు వెలుగు చూశాయి. పథకం ఇక కొనసాగే అవకాశాలు లేవని గ్రహించిన రాష్ట్ర పశు సంవర్థక శాఖ అధికారులు డీడీల సొమ్ము వెనక్కి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు లబ్ధిదారులు కూడా కొద్ది రోజులుగా ఆ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయంపై జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి శ్రీదేవిని వివరణ కోరగా.. డీడీలు లబ్ధిదారులకు తిరిగి ఇవ్వాలని ఇంకా ఆదేశాలు రాలేదన్నారు. ప్రభుత్వం నుంచి కచ్చితమైన ఉత్తర్వులు జారీ అయితే లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని