logo

పీఎంశ్రీ పాఠశాలలకు సిరి!

పాఠశాలల్లో పలు వసతులను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా(పీఎంశ్రీ) పేరుతో కొత్త పథకానికి గతేడాది శ్రీకారం చుట్టింది.

Published : 05 May 2024 05:34 IST

ఎంపికైన గణపురం ఆదర్శ పాఠశాల

పాఠశాలల్లో పలు వసతులను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా(పీఎంశ్రీ) పేరుతో కొత్త పథకానికి గతేడాది శ్రీకారం చుట్టింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రెండో విడత 30 పాఠశాలలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. యూడైస్‌ ప్లస్‌ ప్రోగ్రాంలో నమోదైన సమాచారం ప్రకారం జిల్లాల వారీగా పీఎంశ్రీ పథకానికి ఎంపిక ప్రక్రియ చేపట్టారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 60 రకాల ప్రశ్నావళిని పూరించారు. పాఠశాల ఫొటోలు, పంచాయతీ తీర్మాన ప్రతులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.. సొంత భవనం, అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ, విద్యార్థుల నమోదు, శౌచాలయాలు, తాగునీరు, చేతుల శుభ్రత, సరిపడే సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యుత్తు, గ్రంథాలయ వసతి వంటి అంశాలను అందులో నింపాలి.. దాని ఆధారంగా మొదటి విడతలో 62 బడులను ఎంపిక చేయగా, రెండో విడతలో మరికొన్ని పాఠశాలలకు అవకాశం దక్కింది.

న్యూస్‌టుడే, భూపాలపల్లి


ఎంపికైన బడులు ఇవీ

భూపాలపల్లి: గణపురం ఆదర్శ పాఠశాల, మహదేవపూర్‌ మండలం యామన్‌పెల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల
హనుమకొండ: ఆత్మకూరు మండలం అక్కంపేట ప్రాథమిక పాఠశాల, భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్‌ ఉన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం ఎల్కతుర్తి, హనుమకొండ ఉన్నత పాఠశాల, కమలాపూర్‌ ఆదర్శ పాఠశాల, శాయంపేట మండలం చిట్యాల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం (బాలికలు).
జనగామ: ఆదర్శ పాఠశాల కొడకండ్ల, లింగాలఘనపురం మండలం రత్నమాల కేసరి యూపీఎస్‌, ఆదర్శ పాఠశాల నర్మెట్ట, ఉన్నత పాఠశాల తరిగొప్పుల, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం(బాలికలు) జఫర్‌గఢ్‌.
మహబూబాబాద్‌: గార్ల మండలం పెద్దకిష్టాపురం ప్రాథమిక పాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం (బాలికలు) కేసముద్రం, ఆదర్శ పాఠశాల మహబూబాబాద్‌, మరిపెడ మండలం ప్రాథమిక పాఠశాల తానముచ్చర్ల, తొర్రూరు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం, సీతారాంపురం ఉన్నత పాఠశాల.
ములుగు: కన్నాయిగూడెం మండలం లక్ష్మిపురం ప్రాథమిక పాఠశాల, జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం, గిరిజన ఆశ్రమ పాఠశాల తాడ్వాయి, ప్రాథమిక పాఠశాల నారాయణపూర్‌, ప్రాథమిక పాఠశాల బెస్తగూడెం.
వరంగల్‌: నల్లబెల్లి మండలం నారక్కపేట ప్రాథమిక పాఠశాల, ఆదర్శ పాఠశాల నెక్కొండ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం పర్వతగిరి, రాయపర్తి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం, వరంగల్‌ పట్టణంలోని నరేంద్రనగర్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఇల్లంద.


కొన్నింటికే అవకాశం..

పీఎంశ్రీ కింద పాఠశాలలకు ఎంపిక చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని అప్పట్లో సూచించారు. ప్రతి మండలం నుంచి రెండు పాఠశాలలను ఎంపిక చేస్తామని ప్రకటించారు. తీరా మొదటి విడతలో కొన్ని, ఇప్పుడు మరికొన్ని ఎంపిక చేశారు. మండలానికి రెండు పాఠశాలలు ఎంపికవుతాయని ఉపాధ్యాయులు, గ్రామస్థులు భావించారు. కానీ, కొన్ని మండలాల్లో బడులకు ప్రాతినిథ్యం దక్కలేదు.


రూ.లక్షల్లో నిధులు

ఎంపికైన పాఠశాలలకు నాలుగేళ్లలో రూ.లక్షల్లో నిధులు విడుదలకానున్నాయి. ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు అందిస్తాయి. ఈ నిధులతో పోషకాహారవనం, శుద్ధజలం, సౌర విద్యుత్తు, ప్రయోగశాలలు, అంతర్జాల సదుపాయం, డిజిటల్‌ బోధన, వృత్తి విద్యా కోర్సులు, ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దడం, డిజిటల్‌ గ్రంథాలయం, క్రీడా మైదానం, నైపుణ్యాభివృద్ధి పెంపునకు చర్యలు తీసుకోనున్నారు. పాఠశాల దశ నుంచే ఒకేషనల్‌ కోర్సులను ప్రోత్సహిస్తారు. విద్యార్థి డిగ్రీకి వచ్చే సరికి ఏదో ఒక రంగంలో ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలని జాతీయ విద్యావిధానం లక్ష్యం..


ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం..

- కె.లక్ష్మణ్‌, జిల్లా విద్యాశాఖ సమన్వయ అధికారి, భూపాలపల్లి  

ఎంపికైన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఎన్ని తరగతి గదులు అవసరం, మరుగుదొడ్లు, క్రీడా సామగ్రి, సైన్సు ల్యాబ్‌ ఏర్పాటుకు అవసరమైన నిధుల వివరాలను పంపిస్తాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడుతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని