logo

మేడారం జాతీయ హోదా.. చిరకాల వాంఛ!

ఆసియా ఖండంలో అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతరకు జాతీయ హోదా గుర్తింపు విషయం ఏళ్లుగా నానుతోంది.

Published : 05 May 2024 05:44 IST

కృషి చేస్తే యునెస్కో గుర్తింపు సైతం దక్కే అవకాశం..
అభ్యర్థులపైనా గురుతర బాధ్యత

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ఈనాడు, మహబూబాబాద్‌: ఆసియా ఖండంలో అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతరకు జాతీయ హోదా గుర్తింపు విషయం ఏళ్లుగా నానుతోంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరగుతున్నాయి.. మహబూబాబాద్‌ పరిధిలోని ములుగు అసెంబ్లీ సెగ్మెంట్‌లో మేడారం జాతర వస్తుంది. అభ్యర్థుల్లో ఎవరు విజయం సాధించినా గిరిజన జాతరకు జాతీయ హోదా.. యునెస్కో గుర్తింపు తీసుకురావాలని ఉమ్మడి వరంగల్‌ వాసులు కోరుతున్నారు.  

ఏళ్లుగా ప్రయత్నాలు..

ప్రతి రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహించే మహాజాతరకు కోటి మందికి పైగా తరలివస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్‌, తదితర రాష్ట్రాల నుంచి గిరిజనులు, గిరిజనేతరులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.  ఎంతో ప్రాశస్త్యం, విశిష్ఠత కలిగిన జాతరకు జాతీయ హోదా ప్రయత్నం ఏళ్లుగా సాగుతోంది. 2008 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. 2018 నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ.. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళుతోంది. మన ఎంపీలు అవకాశం వచ్చినప్పుడల్లా పార్లమెంట్ సమావేశాల్లోనూ ప్రస్తావిస్తున్నారు.

ఇంటాంజిబుల్‌ విభాగంలో .

కాకతీయుల కట్టడమైన రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కింది. అశేష భక్తజనం తరలివచ్చే మేడారం జాతరకూ ఇంటాంజిబుల్‌ విభాగంలో ఈ అరుదైన గుర్తింపు లభించే అవకాశం ఉంది. సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక పద్ధతులు, ఆచారాలు, పండగలు, విశ్వాసాలు, కళలు, నైపుణ్యాలు, ఇతర ప్రత్యేకతలను వారసత్వ సంపదగా గుర్తించి భావితరాలకు అందించేందుకు ఇంటాంజిబుల్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ జాబితాలో చేర్చి వీటి పరిరక్షణకు పాటుపడతారు.

అభివృద్ధికి ఆస్కారం..

మేడారం మహాజాతర రాష్ట్ర పండగగా ఉమ్మడి రాష్ట్రంలోనే 1996లో గుర్తించారు. ఉత్తర భారతంలో జరిగే కుంభమేళాకు జాతీయ పండగ హోదా కల్పించడంతో నిర్వహణకు కేంద్రం నిధులు కేటాయిస్తోంది. ఈ హోదా మేడారానికి వస్తే రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చే నిధులతో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించొచ్చు. యునెస్కో గుర్తింపు దక్కితే జాతర వైభవం ప్రపంచ దేశాలకు తెలుస్తుంది. భావితరాలకు అందుతుంది.


ప్రత్యేక శ్రద్ధ వహిస్తా

-అజ్మీరా సీతారాంనాయక్‌, భాజపా అభ్యర్థి

గతంలో ఎంపీగా పనిచేసినప్పుడు రామప్ప వద్ద పలు అభివృద్ధి పనులు చేశాం. ఈసారి సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ హోదా తీసుకురావడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతాను.  


కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాను

- మాలోత్‌ కవతి, భారాస అభ్యర్థి

మేడారానికి జాతీయహోదా దక్కేంత వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాను. రామప్పలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరోసారి ఎంపీగా గెలిచిన తర్వాత ప్రత్యేక దృష్టి సారిస్తాను.


అది మన హక్కు..

- పోరిక బలరాంనాయక్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి

మేడారానికి జాతీయ హోదా మన హక్కు.. ఈ విషయాన్ని మ్యానిఫెస్టోలోనూ చేర్చాం. రామప్ప అభివృద్ధికి కూడా చొరవ చూపుతాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని