logo

చేసింది కొంత.. చేయాల్సింది కొండంత

‘2021 ఏప్రిల్‌లో గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 66 డివిజన్ల కార్పొరేటర్ల పదవులకు ఎన్నికలు జరిగాయి. 2021 మే 6న మేయర్‌, ఉప మేయర్‌, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు.’వరంగల్‌ మహా నగరపాలక సంస్థ పాలకవర్గం కొలువు తీరి (ప్రమాణ స్వీకారం) సోమవారంతో మూడేళ్లు పూర్తవుతుంది.

Updated : 06 May 2024 06:25 IST

గ్రేటర్‌ పాలక వర్గానికి నేటితో మూడేళ్లు పూర్తి
కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

అభివృద్ధి పనులు చేపట్టాలని మేయర్‌ సుధారాణికి వినతిపత్రం ఇస్తున్న కార్పొరేటర్లు (పాతచిత్రం)

‘2021 ఏప్రిల్‌లో గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 66 డివిజన్ల కార్పొరేటర్ల పదవులకు ఎన్నికలు జరిగాయి. 2021 మే 6న మేయర్‌, ఉప మేయర్‌, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు.’
వరంగల్‌ మహా నగరపాలక సంస్థ పాలకవర్గం కొలువు తీరి (ప్రమాణ స్వీకారం) సోమవారంతో మూడేళ్లు పూర్తవుతుంది. తమ డివిజన్లలో అనుకున్నంత అభివృద్ధి పనులు చేయలేక పోయామని పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు వాపోతున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పాలకవర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని కార్పొరేటర్లు అంటున్నారు.

ముగ్గురు కమిషనర్లు బదిలీ

ఈ మూడేళ్లలో ముగ్గురు ఐఏఎస్‌ కమిషనర్లు బదిలీ అయ్యారు. తొలుత ఐఏఎస్‌ అధికారిణి పమేలా సత్పతి, తర్వాత ఐఏఎస్‌ అధికారిణి ప్రావీణ్య, ఐఏఎస్‌ అధికారి రిజ్వాన్‌ బాషా జిల్లా కలెక్టర్లుగా పదోన్నతులపై వెళ్లారు. మూడేళ్లలో ఏడాదికొక కమిషనర్‌ మారడంతో నగరాభివృద్ధి దశ, దిశ లేకుండా పోయిందనే విమర్శలున్నాయి.

పొంచి ఉన్న అవిశ్వాస ముప్పు

పాలకవర్గం మూడేళ్ల పదవీకాలం పూర్తి కావడంతో మేయర్‌, ఉప మేయర్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది.   ప్రస్తుతం మేయర్‌ సహా మెజార్టీ భారాస కార్పొరేటర్లు అధికార కాంగ్రెస్‌లో చేరారు. దీంతో  అవిశ్వాసం ఉంటుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వరంగల్‌లో జరిగిన ఓ సమావేశంలో మంత్రి కొండా సురేఖ మేయర్‌గా సుధారాణి కొనసాగుతారని ప్రకటించారు. కొంత మంది కార్పొరేటర్లు మాత్రం లోక్‌సభ ఎన్నికల తర్వాత అవిశ్వాసం నోటీసు ఇస్తామంటున్నారు.

కాగితాల్లోనే అభివృద్ధి..

  • నగరంలోని 66 డివిజన్లలో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే సాగాయి. ఒక్కో డివిజన్‌లో సుమారు రూ.2-6 కోట్ల పనులు ప్రతిపాదించారు. చాలా డివిజన్లలో పనులు మధ్యలో ఆగిపోయాయి.  జనరల్‌ఫండ్స్‌, పట్టణ ప్రగతి, ఇతర గ్రాంట్ల రూపేణా సుమారు రూ.950 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో అన్ని కలిపి  రూ.450 కోట్ల పైచిలుకు పనులు పూర్తయ్యాయి.
  • స్మార్ట్‌సిటీ పథకం ద్వారా రూ.986 కోట్లతో 37 పనులు ప్రతిపాదించగా, ఇందులో 20 పనులు పూర్తయ్యాయి. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి.
  • గత భారాస ప్రభుత్వ హయాంలో శాసనసభ ఎన్నికల ముందు  రూ.650 కోట్ల పనులకు శంకుస్థాపనలు జరిగాయి. ఆ పనులన్నీ నిలిపివేశారు.

సాధించిన విజయాలు

  • స్మార్ట్‌సిటీ, హృదయ్‌ పథకం నిధులతో భద్రకాళి బండ్‌ పూర్తయింది.
  • వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లో 22 స్మార్ట్‌ రోడ్లు, 16 జంక్షన్లు అభివృద్ధి చెందాయి.
  • హనుమకొండ 57వ డివిజన్‌ వాజ్‌పాయ్‌ కాలనీలో మోడల్‌ వైకుంఠధామం ప్రారంభించారు.
  • వరంగల్‌ రంగంపేటలో ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయాన్ని స్మార్ట్‌ లైబ్రరీగా, బాలసముద్రం జిల్లా గ్రంథాలయాన్ని ముస్తాబు చేశారు.
  • వరంగల్‌ పోతననగర్‌లో ఆధునిక చెత్త రవాణా కేంద్రం, ఆధునిక దోబీఘాట్‌ ప్రారంభించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని