logo

భాజపా, భారాసలకు గుణపాఠం తప్పదు

కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందాలనే కుటిల యత్నాలు చేస్తున్న భాజపా నుంచి దేశ ప్రజలకు రక్షణ కల్పించేందుకు వామపక్ష పార్టీల్లో ఒక్కటైన సీపీఎం ఇండియా కూటమిలో భాగస్వామ్యమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Updated : 06 May 2024 06:38 IST

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

అభివాదం చేస్తున్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్‌ రామచంద్రునాయక్‌, ఎమ్మెల్యే మురళీనాయక్‌, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సుంకరి వీరయ్య, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందాలనే కుటిల యత్నాలు చేస్తున్న భాజపా నుంచి దేశ ప్రజలకు రక్షణ కల్పించేందుకు వామపక్ష పార్టీల్లో ఒక్కటైన సీపీఎం ఇండియా కూటమిలో భాగస్వామ్యమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఇండియా కూటమికి చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ విజయానికి మద్దతు తెలుపుతూ సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. సమగ్ర, సమైక్యత కోసం కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు సీపీఎం ముందుకు వచ్చిందన్నారు. రెండు పర్యాయాలు దేశంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిందన్నారు. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయి అప్పులపాలైందన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో భాజపా, భారాసలకు గుణపాఠం తప్పదన్నారు.

  • సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య మాట్లాడుతూ మతతత్వ భాజపా, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విధ్వంసం చేసిన భారాస చెప్పే మాటలను నమ్మడానికి వీలు లేదన్నారు. ఇద్దరు భారాస ఎంపీలు ఈ ప్రాంత సమస్యలపై ఏనాడు కూడా పార్లమెంట్‌లో ప్రశ్నించలేదన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాంనాయక్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సుంకరి వీరయ్య మాట్లాడుతూ పదేళ్లు దేశాన్ని పాలించిన ప్రధాని మోదీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. దేశంలో ఏ వర్గాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ ఎన్నికల్లో భాజపాకు గుణపాఠం చెప్పాలన్నారు.
  • సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో వరంగల్‌, ములుగు జిల్లాలో సీపీఎం కార్యదర్శులు సీహెచ్‌.రంగయ్య, తుమ్మల వెంకటరెడ్డి, సీపీఎం నాయకులు సూర్నపు సోమయ్య, ఆకుల రాజు, అల్వాల వీరయ్య, గునిగంటి రాజన్న పాల్గొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని