logo

ఎన్నికల వేళ.. మద్యం జోరు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నాయకుల ప్రచారాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఒకవైపు ప్రత్యర్థులపై మాటల యుద్ధం చేస్తూనే మరో వైపు గెలుపుపై అస్త్రాలు సంధిస్తున్నారు. ఇవిగాక ప్రలోభాలనే ప్రధానంగా నమ్ముకుని ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు.

Published : 06 May 2024 06:30 IST

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే

అనుమతి లేకుండా విక్రయిస్తున్న దుకాణంపై దాడి చేసి పోలీసులు పట్టుకున్న మద్యం (పాత చిత్రం)

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నాయకుల ప్రచారాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఒకవైపు ప్రత్యర్థులపై మాటల యుద్ధం చేస్తూనే మరో వైపు గెలుపుపై అస్త్రాలు సంధిస్తున్నారు. ఇవిగాక ప్రలోభాలనే ప్రధానంగా నమ్ముకుని ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు. డబ్బు, మద్యం తదితర వాటిపై సామాన్య ప్రజలకు ఆశ చూపి ఓట్లు రాబట్టుకునేందుకు నాయకులు విఫల యత్నం చేస్తారు. సాధారణ సమయంలో కంటే ఎన్నికల సమయంలో మద్యం రవాణా అధికమవుతుంది. దీనిపై ప్రత్యేక కథనం..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. అభ్యర్థులు వెంట తిరిగే కార్యకర్తలకు అవసరమైన మద్యం, భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. నాటుసారాతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మద్యం సైతం విక్రయిస్తుంటారు. వీటికి తోడు గ్రామాల్లోని గొలుసు దుకాణాల్లో 24 గంటలు విక్రయాలు జరుగుతాయి. అక్రమ రవాణా నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్కడికక్కడ దాడులు చేస్తూ తనిఖీలు చేస్తున్నా ఆగడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, గొలుసు దుకాణాలు, సారాయిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

ఎన్నికలపై ప్రభావం

ఎన్నికల్లో ఓటరుపై మద్యం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకోసం గొలుసు దుకాణాల్లో క్రయవిక్రయాలపై టాస్క్‌ఫోర్స్‌ విభాగం పోలీసులు, స్థానిక పోలీసులు, ఆబ్కారీ పోలీసుల నిఘా ఉంటుంది. ఇదే సమయంలో గతేడాది ఎంత మద్యం కొనుగోలు చేశారు. ఇప్పుడు ఎంత చేశారు అనే లెక్కల వివరాలను ఎక్సైజ్‌ పోలీసులు తీసుకుంటారు. గతంలో కంటే అధిక మొత్తంలో మద్యం విక్రయాలు జరిగితే నిఘాను పెంచుతారు. దానిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. పట్టుబడిన వారిని ముందుగా తహసీల్దార్ల ఎదుట బైండోవర్‌ చేస్తున్నారు. బైండోవర్‌ ఉల్లంఘిస్తే జైలుకు పంపించడం లేదా భారీగా జరిమానా విధిస్తున్నారు.


మద్యంపై ప్రత్యేక నిఘా..

- సీపీ అంబర్‌కిషోర్‌ఝా

ఎన్నికల సమయంలో మద్యం అక్రమ రవాణా, మత్తుపదార్థాలు, నాటు సారా  రవాణా, తయారీపై  పోలీసుల ప్రత్యేక నిఘా ఉంటుంది. ఎవరైనా విక్రయిస్తున్నారన్న సమాచారం తెలిస్తే సీ-విజిల్‌ యాప్‌ లేదా ఇతర మార్గాల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని