logo

మండుటెండలో భాజపా శ్రేణుల్లో జోష్‌..!

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వరంగల్‌ జిల్లా నర్సంపేటలో భాజపా నిర్వహించిన జన సభ విజయవంతమైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రజలు భారీగా తరలిరావడం కాషాయ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

Updated : 07 May 2024 07:17 IST

నర్సంపేట బహిరంగ సభలో మాట్లాడుతున్న ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి,
పక్కన ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌. వేదికపై మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు,
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు,
పార్టీ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌, అధికార ప్రతినిధి
రాణి రుద్రమరెడ్డి, నాయకులు రాణా ప్రతాప్‌, ప్రతాప్‌, తదితరులు

నర్సంపేట, నర్సంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వరంగల్‌ జిల్లా నర్సంపేటలో భాజపా నిర్వహించిన జన సభ విజయవంతమైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రజలు భారీగా తరలిరావడం కాషాయ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సభకు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. భాజపా మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 

మహబూబాబాద్‌ భాజపా అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌ను గెలిపించాలని
కోరుతున్న ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి

ఐదు నెలల్లోనే పదేళ్ల వ్యతిరేకత

పార్టీ అభ్యర్థి సీతారాం నాయక్‌ మాట్లాడుతూ కేంద్రంలో వచ్చేది మోదీ ప్రభుత్వమేనని.. తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి.. కేంద్ర సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తానని అన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ ప్రసంగిస్తూ.. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోవడంతో ఐదు నెలల్లో ఆ పార్టీపై పదేళ్ల వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎన్నికల్లో భాజపా విజయం ఖాయమని తేలడంతో రిజర్వేషన్లను రద్దు చేస్తారని సీˆఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి   గారడి మాటలతో బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మహబూబాబాద్‌ లోక్‌సభ ఇన్‌ఛార్జి ముస్కు శ్రీనివాస్‌రెడ్డి, మహబూబాబాద్‌ జిల్లా అధ్యక్షుడు యలమంచిలి వెంకటేశ్వర్‌రావు, ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, ములుగు అసెంబ్లీ సెగ్మెంటు ప్రభారి నరోత్తమరెడ్డి, రాష్ట్ర నాయకుడు కుసుమ సతీశ్‌ తదితరులు మాట్లాడారు. 

సభకు భారీగా హాజరైన జనం

విశేషాలు..

  • జనసభకు వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. పార్టీ శ్రేణులు తీసుకొచ్చిన మజ్జిగ, మంచినీటి పొట్లాల కోసం ప్రజలు ఎగబడ్డారు.
  • పుష్కర్‌సింగ్‌ ధామి హిందీలో ప్రసంగించారు. నాయకులెవరూ ప్రసంగాన్ని తెలుగులోకి తర్జుమా చేయకపోవడంతో ప్రజలు నిరాశ చెందారు.
  • మహిళలు, యువకులు కమలం, మోదీ చిత్రాలతో కూడిన టోపీలను ధరించారు
  • జనసభ ముగిసిన తర్వాత ఇళ్లకు తిరిగి వెళ్లేవారు ఎండ వేడి తట్టుకోలేక మోదీ కటౌట్లను నెత్తిపై నీడగా పట్టుకొని వెళ్లారు.

హెలికాప్టర్‌కు జెండాతో వీడ్కోలు !

ఈ చిత్రం చూస్తే.. ఆకాశంలో వెళ్తున్న హెలికాప్టర్‌కు టాటా చెబుతూ జెండాతో వీడ్కోలు పలుకుతున్నట్టు ఉంది. వరంగల్‌ జిల్లా నర్సంపేటలో సోమవారం భాజపా మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్‌కు మద్దతుగా నిర్వహించిన ప్రచార సభలో ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి పాల్గొన్నారు. ఆయన హెలికాప్టర్లో తిరిగి వెళుతుండగా ప్రజలు జెండా ఊపుతుండగా ‘ఈనాడు’ కెమెరాకు చిక్కిన దృశ్యమిది.

ఈనాడు, హనుమకొండ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని