logo

ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం

తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే.

Published : 19 Apr 2024 04:45 IST

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారిని వైద్యం కోసం ముందుగా ఈ ఆసుపత్రికే తీసుకొస్తుంటారు. కానీ ట్రామాకేర్‌, సిటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ వంటి సదుపాయాలు ఇక్కడ లేకపోవడంతో క్షతగాత్రుడికి ఏమైందో తెలియని దుస్థితి. అలాంటి సమయంలో ఎలాంటి వైద్యం అందించాలో తెలియక వైద్యులు వేరే ఆస్పత్రికి రిఫర్‌ చేస్తుండటం పరిపాటిగా మారింది. గంటల కొద్దీ సమయం ఇక్కడే వృథాకావడంతో సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు ఆవిరవుతున్నాయి.

ఆసుపత్రుల అభివృద్ధి విషయంలో వైకాపా నేతల మాటలు కోటలు దాటుతుంటాయి. వాస్తవంలోకి వెళ్తే పెద్దాసుపత్రుల్లో సైతం కనీస వైద్యం అందని పరిస్థితి. ఇక అత్యవసర వైద్య సేవలంటే అగమ్యగోచరమే.అయిదేళ్ల పాలనలో జగన్‌ ప్రభుత్వం ఆసుపత్రుల అభివృద్ధిని గాలికొదిలేసింది. అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చడం పక్కన పెడితే ఒక్కో సమయంలో రోగులకు మందులు ఇవ్వలేని స్థితిలో ఉండటం గమనార్హం.


గర్భిణులకు వైద్యం అందించేందుకు ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రత్యేక గదులే లేకుండా పోయాయి. పదుల సంఖ్యలో గంటల తరబడి నిలబడి వైద్యుల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాతాశిశువులకు వైద్యం అందించడానికి ప్రత్యేకంగా చేపట్టిన భవన నిర్మాణాలు ఐదేళ్లుగా సా..గుతూనే ఉన్నాయి.
ఆసుపత్రి పరిధిలో సంచార వైద్యం కోసం కేటాయించిన వాహనమిది. అయిదేళ్లుగా ఆసుపత్రి ప్రాంగణంలోనే నిలిపేశారు. గతంలో వీటిపై గ్రామాలకు వెళ్లి పలు రకాల పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను ఉచితంగా అందించేవారు.


నిత్యం వంద మందికిపైగా గర్భిణులు, బాలింతలు వైద్య సేవల కోసం వస్తుంటారు. ఇక్కడ వారికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గంటల తరబడి నిలబడాల్సిన దుస్థితి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని