logo

50 ఏళ్లకే రూ.4 వేల పింఛను

అభివృద్ధి- సంక్షేమం అంటే ఏంటో అమలు చేసి చూపిస్తామని తెదేపా, జనసేన, భాజపా కూటమి ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న పథకాలపై ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు.

Published : 05 May 2024 05:58 IST

బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఆర్థిక భరోసా
అభివృద్ధి-సంక్షేమం అంటే ఏంటో చూపిస్తాం
‘న్యూస్‌టుడే’తో కూటమి ఉండి అభ్యర్థి రఘురామకృష్ణరాజు

ఈనాడు డిజిటల్‌, భీమవరం, కాళ్ల, న్యూస్‌టుడే: అభివృద్ధి- సంక్షేమం అంటే ఏంటో అమలు చేసి చూపిస్తామని తెదేపా, జనసేన, భాజపా కూటమి ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న పథకాలపై ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా కూటమి మేనిఫెస్టో రూపుదిద్దుకుందన్నారు. వైకాపా అయిదేళ్ల పాలనలో ఏ ఒక్క సమస్యకూ పరిష్కారం చూపలేకపోయిందన్నారు. చుట్టూ జల వనరులు ఉన్నా ప్రజలకు తాగునీటికి కష్టాలు తప్పడం లేదు. గుంతల రోడ్లతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇలాంటి సమస్యలన్నింటికీ కూటమి ప్రభుత్వం రాగానే పరిష్కారం చూపిస్తామని.. ఉండి నియోజకవర్గ రూపురేఖలను మారుస్తామని పేర్కొన్నారు.


రైతుకు ఏటా రూ.20 వేలు

వైకాపా ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం అందించనున్నాం. గోనె సంచులు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూస్తాం. నిత్యావసర సరకుల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టి పేద, మధ్య తరగతి ఆర్థిక స్థితిగతులు చక్కదిద్దేందుకు ప్రయత్నం చేస్తాం. చెత్త సేకరణ రుసుములు రద్దు చేస్తాం.


ప్రతి మహిళకు నెలకు రూ.1500

సాధారణ, మధ్య తరగతి మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రణాళిక అమలు చేస్తాం. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం పథకాలు సమగ్రంగా అమలయ్యే చర్యలు చేపడతాం. ప్రతి మహిళకు నెలకు రూ.1500 అందజేస్తాం. 19 నుంచి 59 సంవత్సరాలున్న వారికి ఇది వర్తిస్తుంది. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. నియోజకవర్గంలో 5,500 వరకు డ్వాక్రా సంఘాలున్నాయి. వీరికి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తాం.


అందరికీ పని.. ఆదాయం..

వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో చేతివృత్తిదారులు, కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఇసుక కొరత సృష్టించి పనుల్లేకుండా చేశారు. ఈ పరిస్థితులను చక్కదిద్దుతాం. ఇసుక పాలసీని సులభతరం చేస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. పూర్‌ టు రిచ్‌ పథకంలో భాగంగా అందరికీ పని కల్పించి ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారిస్తాం. అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తాం.


యువతకు నైపుణ్య శిక్షణ

యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్‌హబ్‌లు ఏర్పాటు చేస్తాం. స్థానిక అవసరాలకు అనుగుణంగా యువత రూపొందించే ప్రాజెక్టులకు బ్యాంకుల నుంచి రుణాలు అందేలా కృషిచేస్తాం. ఉపాధ్యాయ కొలువుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం.


ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు

నియోజకవర్గంలో 70 శాతం విస్తీర్ణంలో ఆక్వా సాగు ఉంది. ఈ రంగానికి ప్రోత్సాహం అందించడంతో పాటు ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంటాం. వైకాపా ప్రభుత్వం ఆక్వా రంగాన్ని కోలుకోలేని దెబ్బకొట్టింది. సాగుదారులకు రాయితీలు లేకుండా చేసింది. ప్రకృతి విపత్తుల కన్నా జగన్‌ విపత్తులతోనే రైతులు అల్లాడిపోయారు. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో అమలైన రాయితీలను పునరుద్ధరిస్తాం.


ప్రతి ఇంటికీ తాగునీరు

తాగునీటి ఇబ్బందులు తొలగించేలా చంద్రబాబు హయాంలో విజ్జేశ్వరం నుంచి పైపులైను వేసే పనులకు అంకురార్పణ చేశారు. వైకాపా ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి ఈ పథకాన్ని పక్కన పెట్టేసింది. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులతో  ఇంటింటికీ కుళాయి ద్వారా మంచినీరు అందిస్తాం. అయిదారు గ్రామాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు నీటి సమస్యలపై చర్చించేందుకు కమిటీలు వేస్తాం.


ఒకటో తేదీనే జీతాలు

వైకాపా సర్కారు ఉద్యోగులను మోసం చేసింది. పీఆర్‌సీ, డీఏ, సరెండర్‌ లీవులు వంటి అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఒకటో తేదీనే జీతాలు అందేలా చూస్తాం. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులను భాగస్వాములను చేస్తాం. తక్కువ జీతాలు పొందే ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం.


అన్ని వర్గాలకూ అండగా..

బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో 50 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.4 వేల చొప్పున పింఛను ఇస్తాం. నియోజకవర్గంలో సుమారు 13 వేల మందికి ఈ పథకం ద్వారా లబ్ధిచేకూరనుంది. బీసీలకు సంబంధించి వైకాపా ప్రభుత్వం రద్దు చేసిన 36 పథకాలను పునరుద్ధరిస్తాం. కుల వృత్తిదారులకు తోడ్పాటునందిస్తాం.  వృద్ధాప్య, వితంతువులు, ఒంటరి మహిళలు పింఛన్లను రూ.4 వేలకు, దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచుతాం. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్యబీమా వర్తింపచేసేలా డిజిటల్‌ కార్డులు అందజేయనున్నాం.

మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు మంజూరు చేయించి స్వయం ఉపాధికి తోడ్పడతాం. హజ్‌ యాత్రకు వెళ్లేవారికి రూ.లక్ష అందించనున్నారు. ఇమామ్‌లకు ప్రతినెలా రూ.10 వేలు, మసీదుల నిర్వహణకు నెలకు రూ.5వేల చొప్పున అందజేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని