logo

నీటి తడులకు కంటతడి

ప్రొద్దుటూరు మండలం.. మీనాపురంలోని జగనన్న కాలనీలో నవరత్నాలు.. పేదలందరికీ పథకంలో భాగంగా గ్రామీణ లబ్ధిదారుల ఇంటి కట్టడాలకు తాత్కాలిక నీటి సరఫరా కోసం రూ.1.99 కోట్లతో మంజూరైన పనులు పట్టాలెక్కలేదు. దీనికి నిధుల కేటాయింపునకు స్పష్టమైన హామీ,

Published : 28 Jun 2022 06:04 IST

జగనన్న కట్టడాలకు కానరాని ట్యాంకర్లతో సరఫరా

రూ.2 కోట్లు విడుదల ప్రతిపాదనలకే పరిమితం

న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు గ్రామీణం

మీనాపురం జగనన్న కాలనీలో ట్యాంకర్‌ ద్వారా రాళ్ల తొట్టెలో నింపుతున్న నీరు

ప్రొద్దుటూరు మండలం.. మీనాపురంలోని జగనన్న కాలనీలో నవరత్నాలు.. పేదలందరికీ పథకంలో భాగంగా గ్రామీణ లబ్ధిదారుల ఇంటి కట్టడాలకు తాత్కాలిక నీటి సరఫరా కోసం రూ.1.99 కోట్లతో మంజూరైన పనులు పట్టాలెక్కలేదు. దీనికి నిధుల కేటాయింపునకు స్పష్టమైన హామీ, భరోసాపై జిల్లా గృహనిర్మాణ శాఖ నుంచి ప్రతిస్పందన కొరవడింది. దీంతో రెండు దఫాలుగా టెండర్ల ప్రక్రియ చేపట్టిన గుత్తేదారులు పోటీ నుంచి తప్పుకొన్నారు. నిధుల గ్యారెంటీ అంశంపై స్పష్టత లేని కారణంగా జిల్లా గ్రామీణ నీటిసరఫరా విభాగం ఉన్నతాధికారులు తదుపరి కార్యాచరణ నిలిపేశారు. పనులు పూర్తయ్యాక నిధులు విడుదల కాకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని గుత్తేదారుల భావన అని పంచాయతీ వర్గాలు అంటున్నాయి.

ఖాళీ బిందెలతో ఆపసోపాలు

జగనన్న కాలనీలోని డి-బ్లాక్‌లో 40 ఎకరాల పరిధిలో 1,804 మంది కొత్తపల్లె పంచాయతీ, ఏడుగురి చొప్పున ఉప్పరపల్లె, నంగనూరుపల్లె గ్రామాలకు సంబంధించి లబ్ధిదారులు ఉన్నారు. 1.10 సెంట్ల విస్తీర్ణంలో అధికారుల ఒత్తిళ్ల నేపథ్యంలో ఇంటి కట్టడాల పనులు ఇటీవల ఊపందుకున్నాయి. కానీ నీటి తడుల కోసం బండ రాళ్లతో ఏర్పాటు చేసుకున్న తొట్లలోకి ట్యాంకర్లు నీటిని నింపుతున్నారు. అవి ఎంత వరకు సురక్షితంగా ఉంటాయో.. ఎప్పుడు పగిలిపోతాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తొట్టిలోని నీటిని ఖాళీ బిందెల్లో నింపుకొని గుంతల్లో కాంక్రీటు స్తంభాలు, పునాది, గోడలు, ఆర్సీ శ్లాబ్‌లకు సరిపడే తడుల కోసం ఆపసోపాలు పడుతున్నారు. నీటిని నింపుకోవాలంటే గ్రామ సహాయ ఇంజినీరుకు చెబితే తొట్లలోకి ట్యాంకర్ల నీటిని వదిలిపెడుతున్నారు. ప్రధాన గొట్టాలకు కనెక్షన్లు ఉంటే ప్లాస్టిక్‌ పైపుల వినియోగంతో శ్రమపడాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. సరిపడేవిధంగా నీటి తడులు లేకపోతే కట్టడాలకు దృఢత్వం, సామర్థ్యంపై దుష్ఫ్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
ః కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని లబ్ధిదారులు తమ సొంతింటి పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ప్రస్తుతం 100 గృహాలకు గుంతల తవ్వకాలతో పాటు పునాది, గోడల నిర్మాణం వరకు వివిధ దశల్లో కట్టడాలు ఉన్నాయి. గొట్టాల నుంచి నేరుగా నీటి సరఫరా లేక లబ్ధిదారులు అవస్థపడుతున్నారు.


శాశ్వత పనులకు అనుమతి మంజూరు

- కరుణాకర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ

రూ.1.99 కోట్ల పనులకు ఆమోదంపై ప్రభుత్వానికి ఉన్నతాధికారులు నివేదిక పంపాం. జల్‌జీవన్‌ మిషన్‌ (జేజేఎం) కింద మీనాపురం జగనన్న కాలనీల్లో రూ.7 కోట్ల శాశ్వత నీటి సరఫరా పనులకు అనుమతి ఉంది. దీంతో తాత్కాలిక పద్ధతిలో జేజేఎం పనులను చేపట్టడానికి ఉన్నత స్థాయిలో అనుమతి రాగానే వాటి పనులు చేస్తాం.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని