logo

కళ తప్పిన పత్తి బతుకులు

ప్రొద్దుటూరు కొర్రపాడు రోడ్డు పత్తిమిల్లులు (జిన్నింగ్‌)కు పెట్టింది పేరు. నిత్యం వందలాదిమందితో కళకళలాడుతూ ఉండేది. పత్తి మిల్లులే ఆధారంగా జీవనం సాగించే కుటుంబాల్లోని మహిళలకు ఉపాధి అందించేవి. ఈ మిల్లులతోపాటు నూనె మిల్లులు ఉండేవి. వీటిపై ఆధారపడి

Published : 28 Jun 2022 06:04 IST

 మిల్లుల మూతతో ఉపాధి కోత

 పనులు దక్కక పేదల పస్తులు

న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు పట్టణం

మూసివేసిన పత్తి మిల్లులో అద్దె పద్ధతిలో కొనసాగుతున్న చెక్కపాలిష్‌ దుకాణం

ప్రొద్దుటూరు కొర్రపాడు రోడ్డు పత్తిమిల్లులు (జిన్నింగ్‌)కు పెట్టింది పేరు. నిత్యం వందలాదిమందితో కళకళలాడుతూ ఉండేది. పత్తి మిల్లులే ఆధారంగా జీవనం సాగించే కుటుంబాల్లోని మహిళలకు ఉపాధి అందించేవి. ఈ మిల్లులతోపాటు నూనె మిల్లులు ఉండేవి. వీటిపై ఆధారపడి అనేకమంది బతుకుతున్నారు. మారిన పరిణామాల క్రమంలో భాగంగా నాలుగేళ్లుగా మిల్లులు మూతపడ[డంతో డ్రైవర్‌కొట్టాల, ఎర్రన్నకొట్టాల, సంజీవయ్యనగర్‌, భగత్‌సింగ్‌కాలనీలకు చెందిన ప్రజల ఉపాధికి గొడ్డలిపెట్టులా మారింది. కొందరు వ్యక్తులు పొట్టకూటికోసం తెలియని పనులు ఒప్పుకోగా.. మరికొందరు కువైట్‌, సౌదీ లాంటి ప్రాంతాలకు సైతం వెళ్లారు. కొందరు మహిళలు నిరక్షరాస్యులు పూటగడవలేక కడుపేదరికం కావడంతో ఇళ్లల్లో పాచిపనికి వెళుతున్నారు. ఇటీవల మాల్స్‌, పెద్ద దుకాణాల్లోకి యువత పనికి వెళుతున్నారు. గృహాల్లోని పనులకు వెళ్లలేక ఇంట్లోనే జీవితాలు గడుపుతున్న మహిళలకు ఉపాధి కరవైంది. కొందరి మహిళలు వారి మాటల్లోనే...

ఇంటిల్లిపాది కూలీకి వెళుతున్నాం - మాబున్నీ, గృహిణి

నాలుగేళ్లకు పైగా మిల్లులన్నీ మూసివేయడంతో పని కరవైంది. మగవాళ్లు చేసే పనిపై మాత్రమే ఇంటిల్లిపాది జీవించాల్సి వస్తోంది. పెరిగే ఖర్చులకు ప్రస్తుతం ఒక్కరి వేతనం సరిపోవడం కుటుంబానికి కష్టమే. పనిచేసే ఆసక్తి ఉన్నా దొరకక అవస్థలు పడుతున్నాం.

కుటుంబానికి సహాయ పడుతున్నా - అంకమ్మ

నేను 30ఏళ్లకు పైగా పత్తిమిల్లులో పని చేశాను. మిల్లులు మూసి వేయడంతో ఏ పనికి వెళ్లలేకపోతున్నాను. మిల్లులో కూర్చొని అయినా కొన్ని పనులు చేసుకోవచ్చు. రోజుకు రూ.100ల కూలి వచ్చేది. మిల్లులు లేకపోవడంతో ఇంట్లోనే కుటుంబానికి సహాయపడుతున్నాను.

మిల్లులో పని హూందాతనం కలిగించేది  - నాగమ్మ

పత్తిమిల్లుల నుంచి కూలి పని చేసుకొని జీవించేదాన్ని.  ఆ మిల్లులు మూసివేయడంతో బతకడం కష్టమై ఇంట్లో పని చేస్తున్నాను. మిల్లులో పని చేసినప్పుడు హూందాతనం ఉండేది. గృహాల్లో పనులు చేస్తున్నా చాలీ చాలని వేతనం వస్తోంది.

ఖర్చులు పెరుగుతున్నా... ఉపాధి కరవైంది - మాబున్న

మా భర్త ఆటో డ్రైవర్‌. నేను పత్తిమిల్లులో కూలి పనికి పోయేదాన్ని. మిల్లులు మూసివేయడంతో ఏ పనికి పోలేకపోతున్నాం. కొన్నేళ్ల కిందట ఉన్న ఖర్చులకు తగ్గ కూలి అందేది. ప్రస్తుతం ఖర్చులు పెరుగుతున్నా ఉపాధి లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాం. మా ఇళ్ల వద్ద బతలేక కొందరు మహిళలు ఇంట్లో పనికి వెళుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని