logo

ముందే గంట కొట్టారు!

కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు పారదర్శకంగా జరుగుతాయనుకున్న ఉపాధ్యాయులకు తాజాగా ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఉద్యోగులకు సాధారణ బదిలీలు పూర్తయిన వెంటనే తమ వంతు వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్న తరుణంలో జరుగుతున్న ప

Published : 28 Jun 2022 06:04 IST

నేతల సిఫార్సులతో బదిలీలు

ఉపాధ్యాయుల్లో ఆందోళన

ఈనాడు, డిజిటల్‌ కడప: కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు పారదర్శకంగా జరుగుతాయనుకున్న ఉపాధ్యాయులకు తాజాగా ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఉద్యోగులకు సాధారణ బదిలీలు పూర్తయిన వెంటనే తమ వంతు వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్న తరుణంలో జరుగుతున్న పరిణామాలపై వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కౌన్సెలింగ్‌లో కోరుకున్న చోటకు అవకాశం లభించదనే ఉద్దేశంతో తమ పలుకుబడిని, రాజకీయ అండను వినియోగించుకుని పలువురు సిఫార్సులతో బదిలీలకు ప్రయత్నించి దాదాపు కొలిక్కి తెచ్చుకున్నట్లు సమాచారం. అన్నమయ్య జిల్లాలో ఓ ఎమ్మెల్యే సిఫార్సుపై మదనపల్లె, పీటీఎం మండలాల్లో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు తాము కోరుకున్నచోటుకు బదిలీ చేయించుకున్నారు. తిరుపతి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సిఫార్సుపై చిట్వేలి మండలంలోని ఓ జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి తిరుపతి నగరంలోని ఓ జడ్పీ ఉన్నత పాఠశాలకు ఒకరు బదిలీ అయ్యారు. టి.సుండుపల్లె మండలంలోని ఓ జడ్పీ ఉన్నత పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయిని ఓ ఎమ్మెల్సీ సిఫార్సుపై కడప నగరానికి బదిలీ అయ్యారు. ములకల చెరువు మండలంలో పనిచేసే ఓ ఉపాధ్యాయిని ఏకంగా ఓ మంత్రి సిఫార్సుపై తిరుపతికి బదిలీ అయ్యారు.

 వైయస్‌ఆర్‌ జిల్లాలోని ఓ ఎమ్మెల్సీ సిఫార్సుపై చాపాడు మండలంలోని ఓ ఉపాధ్యాయుడికి కడప నగరానికి, ఓ మంత్రి సిఫార్సుతో అనంతపురం జిల్లాలో పని చేస్తున్న ఒకరికి వైయఆర్‌ జిల్లా సీకేదిన్నె మండలానికి బదిలీ కానుంది. ఓ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి పలుకుబడితో ప్రొద్దుటూరులో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయినికి తాను కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేసేందుకు అనుమతి లభించింది. వీటిపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నడూలేని విధంగా సిఫార్సు లేఖలపై భారీఎత్తున విచ్చలవిడిగా బదిలీలు చేపట్టారని.. మిగిలిన వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. హేతుబద్దత లేకుండా ఇష్టారాజ్యంగా బదిలీలతో మూరుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో పోస్టులు ఖాళీ ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిణామాలతో తలెత్తే సమస్యలను విద్యాశాఖ ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని