logo

ప్రభుత్వ భూముల్లో అసైన్డు దందా!

‘ప్రభుత్వ భూములన్నాయి... అసైన్‌మెంట్‌ కమిటీ  ద్వారా పట్టాలిస్తాం... ఎవరెంత డబ్బులిస్తే ఆ మేరకు భూములిస్తాం... త్వరపడండి.. వెంటనే రేషన్‌, ఆధార్‌కార్డుల ప్రతులివ్వండి.

Updated : 06 Feb 2023 06:32 IST

సర్కారు స్థలాల పంపిణీ పేరిట వైకాపా నేతల వసూళ్లు
అనుచరులకు కట్టబెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు

ఒంటిమిట్ట మండలం ఓబులేసుకోనలో నేతల కన్ను పడిన ప్రభుత్వ భూమి

‘ప్రభుత్వ భూములన్నాయి... అసైన్‌మెంట్‌ కమిటీ  ద్వారా పట్టాలిస్తాం... ఎవరెంత డబ్బులిస్తే ఆ మేరకు భూములిస్తాం... త్వరపడండి.. వెంటనే రేషన్‌, ఆధార్‌కార్డుల ప్రతులివ్వండి.

- బి.మఠం మండలంలో వైకాపాకు చెందిన కొందరు నాయకుల రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూళ్లు చేస్తున్న వైనమిది.

‘ఆక్రమించుకున్న భూములకు పట్టాలు తీసుకుందాం... రెవెన్యూశాఖాధికారులతోపాటు నియోజకవర్గ నేతలకు కొంత సమర్పించుకోవాలి... పార్టీలతో సంబంధం లేదు. ఈ విషయంలో కలిసి నడుద్దాం. ఆక్రమించుకున్న భూమి విలువను బట్టి నగదు ఇవ్వండి.

- ఇదీ అట్లూరు మండలంలో ఆక్రమార్కులకు అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతల పిలుపు.

‘ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నా, రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా అసైన్‌మెంటు కమిటీ ద్వారా భూములను సొంతం చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఉండదు. ’

-ఇదీ రాజంపేట నియోజకవర్గంలో ఆక్రమార్కుల నిర్ణయం.

‘పార్టీకి పనిచేసి నష్టపోయినవారు, పనులు చేసి బిల్లులు రానివారు ప్రభుత్వ భూములను ఎంపిక చేసుకుని వస్తే అసైన్‌మెంట్‌ కమిటీ ద్వారా పట్టాలిప్పిస్తాం.’

- ఇదీ రాయచోటి నియోజకవర్గంలో కార్యకర్తలకు నేతలకు అభయం.

అత్త సొమ్ము... అల్లుడు దానం చేసిన చందాన. ప్రభుత్వ భూముల పందేరానికి రంగం సిద్ధ్దమవుతోంది. అసైన్‌మెంట్‌ కమిటీల ద్వారా ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చేందుకు వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో గోప్యంగా కసరత్తు జరుగుతోంది. ఈ వ్యవహారం ద్వారా నాలుగు రాళ్లు వెనకేసుకోవడంతో పాటు తమ అనుచరులకు భూములను కట్టబెట్టడానికి అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆక్రమణలను సక్రమం చేసుకోవడానికి పలు రకాల కుతంత్రాలు పన్నుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లకు గాలం వేయడానికి సైతం ఈ  కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారు.  

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, కడప: ఇప్పటివరకు అన్ని రకాల దందాలు సాగిస్తున్న కొంతమంది నేతలు చివరకు ప్రభుత్వ భూములపై కన్నేశారు. అసైన్‌మెంట్‌ కమిటీలను తెరపైకి తీసుకొచ్చి పలు రకాలుగా దందాలు సాగిస్తున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట గ్రామపంచాయతీలో కొందరు వైకాపా నాయకులు అసైన్‌మెంట్‌ కమిటీ ద్వారా భూములకు పట్టాలిస్తామంటూ రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. మండలంలో మల్లేపల్లి, పలుగురాళ్లపల్లి, నాగిశెట్టిపల్లి, డి.నేలటూరు గ్రామాల్లో ప్రభుత్వ భూములు అధికంగా ఉండడంతో గ్రామాల్లో తిరుగుతూ రేషన్‌, ఆధార్‌కార్డులు సేకరిస్తూ నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు. అట్లూరు మండలం మాడుకూరు, కమలకూరు, ముత్తుకూరు, కొండూరు గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్ని ఇప్పటికే పలువురు ఆక్రమించుకున్నారు. వీటిని అసైన్‌మెంటు కమిటీ ద్వారా సక్రమం చేసుకోవడానికి కుతంత్రాలు సాగిస్తున్నారు. ఇక్కడి భూములన్నీ దాదాపు నేతల చేతుల్లోనే ఉన్నాయి.

* అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మన్నూరులో 55/2 సర్వే నంబరులో ప్రభుత్వ భూములను ఇతరులకు కట్టబెట్టారనే అభియోగం కింద వీఆర్వో సస్పెండయ్యారు. ఈ భూములను కాజేసిన రాజా బాలాజీ అనే వ్యక్తి నుంచి ఆరుగురు భూములను కొనుగోలు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. రాజా బాలాజీని పావుగా వాడుకుని ఈ భూమిని కొందరు సొంతం చేసుకున్నట్లు కలెక్టర్‌ చేయించిన విచారణలో తేలింది. వీటిని సైతం అసైన్‌మెంట్‌ కమిటీ ద్వారా మరో ఆమోదముద్ర వేసుకోవడానికి ప్రయత్నాలు సాగాయి. ఇలాంటి వ్యవహారాలు రాజంపేట నియోజకవర్గం వ్యాప్తంగా భారీ ఎత్తున సాగుతున్నాయి.

దున్నుకోండి పట్టాలిస్తాం

గతంలో వ్యవసాయ సాగు భూమి లేని నిరుపేదలను గుర్తించి ప్రభుత్వం ఆదేశాల మేరకు అసైన్‌మెంట్‌ కమిటీ ద్వారా కేటాయిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఇందుకు భిన్నంగా వ్యవహారం నడుస్తోంది. ‘మీ చేతిల్లో బంజరు భూములుంటే ఖాళీగా పెట్టొద్దు. వెంటనే యంత్రాలతో దున్నేయండి... సాగులో ఉన్నట్లు చూపండి... మీ అనుభవంలో ఉన్నట్లు వారికి పట్టాలివ్వాలని  ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతాం’ అని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న యంత్రాంగం చెప్పడంతో ఆశావహులు ఇదే అదునుగా ప్రభుత్వ భూములపై కన్నేశారు. ఒంటిమిట్ల మండలం పెన్నపేరూరులో ఓబులేసుకోనలో సర్వే సంఖ్య 659లో 89.75 ఎకరాలు, 661లో 1,778.28 ఎకరాలుంది. గతంలో 1 నుంచి 6 విడతల వరకు పేదలకు భూ పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. గత పదేళ్లుగా చూస్తే ఇక్కడ పెద్దగా ఎవరు పంటలను సాగు చేయలేదు. ఇప్పుడు ఎందుకో ఉన్న ఫళంగా చదును పనులు చేయిస్తున్నారు. ఇప్పటికే 50 ఎకరాలకు పైగా సాగులోకి తీసుకొచ్చేందుకు పనులు చేపట్టడం గమనార్హం.

అంతులేని భూ దాహం

తమ ఆధీనంలో ఉందని చూపితే పట్టాలిస్తారని కీలక నేతల అనుచరులు భూదాహంతో వడివడిగా అడుగులేస్తున్నారు. మరికొందరు గతంలో పేదలకు ఇచ్చిన అసైన్డు (డీకేటీ) భూములను కొనుగోలు చేసి పంటలు వేశారు. పేదల బలహీనతలను సొమ్ము చేసుకొని కాసుల వల విసిరి కొనుగోలు చేసి పంటలను సాగు చేస్తున్నారు. పైగా రహదారులు వేసుకుని కంచె ఏర్పాటు చేసుకున్నారు. లబ్ధిదారుల పేరిట దరఖాస్తులు చేయించి విద్యుత్తు వసతి కూడా పొందారు. ఈ విధంగా జిల్లాలో సిద్దవటం, అట్లూరు, బద్వేలు, వీరపునాయునిపల్లె, సీకేదిన్నె, కలసపాడు, పోరుమామిళ్ల, బ్రహ్మంగారిమఠం, గోపవరం మండలాల్లో భారీగా భూ దందాను సాగిస్తున్నారు.

లబ్ధి పొందాలని హడావుడి

రహదారులకిరువైపులా ఉన్న విలువైన భూముల్లో పాగా వేయాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇందుకు అధికార బలంతోపాటు నాయకుల సహకారం మెండుగా ఉంది. ఇప్పటికే ఏ సర్వే నంబరు ఎవరికీ ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. పేదల కంటే పెద్దలు కొన్ని రోజులుగా హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి భారీగా రాయితీలు, ఆర్థిక తోడ్పాటు, పెట్టుబడి సాయం,    పంట రుణాలు పొందవచ్చు. ప్రధాన రహదారులకు పక్కనే భూమిని పొందితే భవిష్యత్తులో మంచి ధర వస్తుందని ఆశావాదంతో చాలామంది రంగంలోకి దిగుతున్నారు.

పారదర్శకంగా భూముల పంపిణీ

భూమిలేని నిరుపేదలెందరున్నారో సచివాలయాల్లో ముందుగా జాబితా ప్రదర్శించాలనే డిమాండు ఉంది. దరఖాస్తు చేసుకున్న వారి కుటుంబ సభ్యుల పేర్లతో భూములున్నాయా లేదా... అనే విషయాలను అధికారులు గుర్తించాలి. ఉమ్మడి కుటుంబంలోని భూముల్ని చూపకుండా.. వారి కుటుంబ సభ్యులు నిరు పేదలుగా చూపిస్తూ భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. భూములకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను గ్రామసభల్లో ఆమోదించిన తరువాతే అసైన్‌మెంట్‌ కమిటీ ముందుకు తీసుకెళ్లాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని