logo

చుక్కల భూముల పేరిట చక్కబెడుతున్నారు!

చుక్కల భూములతో చిక్కుల్లో ఉన్నవారి భూములను కారు చౌకగా కొందరు కొనుగోలు చేశారు. ఈ ప్రక్రియ అనంతరం నిషేధిత జాబితాను తొలగించుకుని భూముల విలువ పెంచుకున్నారు.

Published : 28 Mar 2023 03:18 IST

వేలాది ఎకరాలకు మినహాయింపు
లబ్ధి పొందుతున్న ‘అధికార’ నేతలు
- ఈనాడు డిజిటల్‌, కడప

చుక్కల భూములతో చిక్కుల్లో ఉన్నవారి భూములను కారు చౌకగా కొందరు కొనుగోలు చేశారు. ఈ ప్రక్రియ అనంతరం నిషేధిత జాబితాను తొలగించుకుని భూముల విలువ పెంచుకున్నారు. లాభదాయకమైన ఈ వ్యవహారానికి ఇటీవల భారీ ఎత్తున ఉత్తర్వులు వెలువడ్డాయి. అక్రమార్కులకు వరంగా మారింది.

నిషిద్ధ జాబితా నుంచి చుక్కల భూములను గతానికి భిన్నంగా వేగంగా తొలగిస్తున్నారు. కలెక్టర్ల నిర్ణయానికి అనుగుణంగా రెవెన్యూశాఖ చుక్కల భూములను నిషిద్ధ జాబితా నుంచి తప్పిస్తూ ఉత్తర్వులను జారీ చేస్తోంది. ఈ ప్రక్రియలో అధికారులపై రాజకీయ ఒత్తిడి అధికంగా కనిపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్క అన్నమయ్య జిల్లాలోనే 27,014 ఎకరాల చుక్కల భూములకు విముక్తి కల్పించారు. పలు దఫాలుగా ఉత్తర్వులు జారీ చేసి కొందరికి ప్రత్యేక అవకాశం కల్పించారు. నిషేధిత జాబితాలో ఉండగా విలువ లేని భూములకు తొలగింపు అనంతరం ధరలకు రెక్కలొచ్చాయి. అధికార వైకాపా నేతలు ఈ విధానం ద్వారా బాగా లబ్ధి పొందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రాయచోటి ప్రాంతంలో భారీ ఎత్తున కొందరు నేతలు లబ్ధి పొందినట్లు ప్రచారం జరుగుతోంది. చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తప్పిస్తూ ఉత్తర్వుల ద్వారా అధిక భాగం అన్నమయ్య జిల్లా తరువాతే వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందినవి ఉండడం చర్చనీయాంశమైంది. గతంలో ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, కడప శివారులోని సీకే దిన్నె ప్రాంతాల్లోని ఎకరాల కొద్దీ చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తప్పించారు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి, పెద్దశెట్టి పల్లి, చాపాడు మండలం పల్లవోలు, ఓబులవారిపల్లె, రాయచోటి మండలం చెర్లోపల్లి, జమ్మలమడుగు మండలం పెద్దనందలూరు, పులివెందుల మండలం అచ్చవెల్లి, మండల కేంద్రం ముద్దనూరులోని చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. నిషేధిత జాబితా నుంచి తమ భూములను తొలగించి విముక్తి కల్పించాలంటూ అన్నమయ్య జిల్లాలో 2,500 వరకు దరఖాస్తులొచ్చాయి. వీటిలో చాలా వరకు అధికార పార్టీకి చెందిన వాటికి ప్రాధాన్యమిచ్చి ఉత్తర్వులిచ్చినట్లు సమాచారం. ఈ ముసుగులో దేవాదాయ, ప్రభుత్వ, డీకేటీ భూములను సొంతం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. బాధిత రైతులు, పేదలకంటే బడా నేతలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదీ సమస్య

ఆంగ్లేయుల హయాంలో ఆర్‌ఎస్‌ఆర్‌ తయారీలో తప్పిదాలు దొర్లాయి. ప్రైవేటు భూముల రీ-సర్వే తరుణంలో యజమానులు అందుబాటులో లేకున్నా.. వాటి వద్ద చుక్కలు పెట్టారు. దేవాదాయ, ప్రభుత్వ, డీకేటీ భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేకుండా చుక్కల భూమిలో చేర్చారు. ఇలాంటి భూములను నిషిద్ధ జాబితా నుంచి తొలగించుకోవడానికి సామాన్య ప్రజానీకం కార్యాలయాల చుట్టూ తిరుగు తున్నా పరిష్కారానికి నోచుకోలేదు. చుక్కల భూముల దరఖాస్తులను వీఆర్వో పరిశీలించాలి. తర్వాత తహసీల్దారు ఆ భూములను గతంలో రిజిస్ట్రేషన్లు జరిగాయా? లింకు డాక్యుమెంట్లు ఉన్నాయా? వంటి వాటిని తనిఖీ చేసి సిఫార్సు చేయాలి. ఈ వ్యవహారం జరగకుండానే తొలగింపు జాబితాకు సిఫార్సు చేసినట్లు విమర్శలొచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని