logo

రామయ్య దర్శనం... భక్తుల పరవశం

ఏకశిలానగరి కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు శుక్రవారం ఉదయం ధ్వజారోహణ ఘట్టం వేడుకగా జరిగింది.

Published : 01 Apr 2023 02:39 IST

వేడుకగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు


కోదండరామాలయంలో ధ్వజారోహణం క్రతువు నిర్వహిస్తున్న అర్చకులు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే : ఏకశిలానగరి కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు శుక్రవారం ఉదయం ధ్వజారోహణ ఘట్టం వేడుకగా జరిగింది. వేదపండితుల మంత్రాచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ భక్తుల జయజయధ్వానాలతో దాశరథి సన్నిధిలో ఉత్సవ ధ్వజం నింగికెగసింది. తితిదే ఉప కార్యనిర్వహణాధికారి పి.వి.నటేష్‌బాబు పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల కంకణదారు, తితిదే పాంచరాత్ర ఆగమశాస్త్రం సలహాదారు కల్యాణపురం రాజేష్‌ భట్టార్‌ పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సీతారామలక్ష్మణమూర్తులను పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. తితిదే జేఈవో వి.వీరబహ్మ్రం, రాజంపేట శాసనసభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి, జేసీ సాయికాంత్‌వర్మ, శిక్షణ కలెక్టర్‌ రాహుల్‌ మీనా హాజరయ్యారు. ధ్వజారోహణ ఘట్టం ఆద్యంతం నేత్రపర్వంగా జరిగింది.

శేషవాహనంపై దాశరథి

దాశరథి శేష వాహనంపై ఆసీనుడై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారి గ్రామోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఒంటిమిట్ట వీధుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఊరేగింపులో దారి పొడవునా తాళ భజనలు, కోలాట నృత్య ప్రదర్శనలు హోరెత్తించాయి. బాలికలు, అతివలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సన్నాయి మేళం, కేరళ కళాకారుల వాయిద్యాల నడుమ మెరవణి కనులపండువగా సాగింది.

ధ్వజారోహణం ఘట్టాన్ని వీక్షిస్తున్న రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, జేసీ సాయికాంత్‌వర్మ, శిక్షణ కలెక్టర్‌ రాహుల్‌ మీనా తదితరులు

ముత్యాల తలంబ్రాల తయారీ పూర్తి

ఈనెల 5న రాత్రి సీతారాముల కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించాలని తితిదే ఉన్నతాధికారులు నిర్ణయించారు. జానకిరాముల పరిణయ ఘట్టాన్ని తిలకించడానికి తరలిరానున్న భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేయాలని అనుమతిచ్చారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో ఉన్న యాత్రికుల వసతి భవన సముదాయంలో శ్వేత డైరెక్టరు ప్రశాంతి పర్యవేక్షణలో శ్రీవారి సేవకుల ద్వారా 1.86 లక్షల ప్యాకెట్లను తయారు చేయించారు.

నేడు వేణుగానాలంకారం

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు శనివారం ఉదయం 8-10 గంటల వరకు వేణుగానాలంకారంలో కోదండరాముడు దర్శనమిస్తారు. ఒంటిమిట్టలో గ్రామోత్సవం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌ సేవ, రాత్రి హంస వాహనంపై సీతారామలక్ష్మణమూర్తుల ఊరేగింపు ఉంటుందని డిప్యూటీ ఈవో నటేష్‌బాబు తెలిపారు.

శేష వాహనంపై ఊరేగుతున్న సీతారామలక్ష్మణమూర్తులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని