logo

వ్యవసాయ రంగం అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదలకు డిమాండు

నాలుగేళ్లుగా వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి, వ్యయంపై వైకాపా ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండు చేశారు.

Published : 03 Jun 2023 02:33 IST

ప్రొద్దుటూరు గ్రామీణ, ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే : నాలుగేళ్లుగా వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి, వ్యయంపై వైకాపా ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండు చేశారు. దీనిపై అధికార పార్టీ నాయకులతో చర్చకు సిద్ధమన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు రోడ్డులో ‘యువగళం’ పాదయాత్ర కోసం విడిది చేసిన శిబిరంలో ఉన్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో శుక్రవారం ముచ్చటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లలో వ్యవసాయ యాంత్రీకణ కోసం అన్నదాతలకు 5,500 ట్రాక్టర్లు పంపిణీ చేశామని సీఎం జగన్‌ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. తెదేపా పాలనలో యాంత్రీకణకు 23,500 ట్రాక్టర్ల సరఫరా, వివిధ రకాల పరికరాలు, సామగ్రికి రూ.650 కోట్లు ఖర్చు చేశామన్నారు. డ్రిప్‌, మైక్రో ఇరిగేషన్‌ కోసం రూ.1,260 కోట్లతో చేపట్టిన సమగ్ర అభివృద్ధి పనులతో ఏపీ వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. వైకాపా పాలనలో బిందు సేద్యం పరికరాలు, ఎత్తిపోతల పథకాలు, సూక్ష్మపోషకాలు, భూసార పరీక్షలు, తదితర ప్రయోజనాలకు మంగళం పాడినట్లు ధ్వజమెత్తారు. ఇటీవల తెదేపా ప్రకటించిన మేనిఫెస్టోపై మాట్లాడే అర్హత వైకాపాకు లేదన్నారు. దీనిపై మంత్రులు, స్పీకర్‌, ఎమ్మెల్యేలు, నాయకులు దురుసుగా మాట్లాడుతున్నా సీఎం జగన్‌ వారిపై చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి మాట్లాడుతూ.. ఎంపీ అనివాష్‌రెడ్డికి మంజూరైన ముందస్తు బెయిల్‌కు వ్యతిరేకంగా వైఎస్‌ సునీత సుప్రీంకోర్టుకు వెళ్లే పరిస్థితులు ఉన్నట్లు తెలిపారు. అవినాష్‌రెడ్డిని కాపాడటానికి ఎవరినైనా బలిపశువుగా మార్చడంలో సీఎం జగన్‌ ఘనాపాటి అన్నారు. జిల్లాలో యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని